News


ఉద్దీపనలు బాగున్నా... వృద్ధి అంతంతే!

Wednesday 28th August 2019
news_main1566966818.png-28064

  • పలు విశ్లేషణా, రేటింగ్‌ సంస్థల అంచనా
  • దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు
  • ఆగస్టు 31న ఏప్రిల్‌-జూన్‌ 

త్రైమాసిక జీడీపీ గణాంకాల వెల్లడి నేపథ్యం భారత్‌ ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రస్తుతం తీవ్రంగా ఉన్నాయని పలు విశ్లేషణా, రేటింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇటు దేశీయ అటు అంతర్జాతీయ ప్రతికూలతలు దీనికి కారణమన్నది ప్రధాన విశ్లేషణ. ఈ నెలాఖరున ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారిక గణాంకాలు వెల్లడవుతుండడం దీనికి నేపథ్యం. ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

వృద్ధి 6.4 శాతమే!: మూడీస్‌...
ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఇటీవల ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపన చర్యలు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ మెరుగుకు మద్దతునిస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ విశ్లేషించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి మాత్రం 6.4 మాత్రమే ఉంటుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సోమవారం అంచనావేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక ప్రతికూల అంశాలు దీనికి కారణమని పేర్కొంది. మూడీస్‌ (సావరిన్‌ రిస్క్‌ గ్రూప్‌) వైస్‌ ప్రెసిడెంట్‌ విలియమ్‌ ఫాస్టెర్‌ మాట్లాడుతూ,  ‘‘2019-20లో వృద్ధి 6.4 శాతంగానే ఉన్నా, 2020-2021లో ఈ రేటు 6.8 శాతానికి పెరిగే అవకాశం ఉంది. పన్ను రాయితీలు, వివిధ రంగాల్లో సంస్కరణలు ఆర్థిక వృద్ధి మెరుగుకు దీర్ఘకాలంలో దోహదపడుతుంది.  ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన పెంపు ద్రవ్య లభ్యతకు దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం వల్ల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో దఫా రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

క్యూ1లో  5.5 శాతమే: యస్‌బ్యాంక్‌
యస్‌బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ సుభద్రా రావు కూడా భారత్‌ ఆర్థిక వ్యవస్థపై నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు కేవలం 5.5 శాతంగానే ఉంటుందని వివరించారు. జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 20 త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.8 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే.  దేశీయ మందగమన పరిస్థితులకు అంతర్జాతీయ అంశాలే ప్రధానకారణమయినా, దేశీయంగా కొన్ని అంశాలూ కొంత ప్రతికూలమవుతున్నాయని యస్‌బ్యా్‌ంక్‌ ఆర్థికవేత్త పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ పరిస్థితులు తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ), ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌, ఎఫ్‌ఎంసీజీలు తీవ్ర ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయని విశ్లేషించారు. కాగా ఇటీవల ఆర్థికశాఖ మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు దీర్ఘకాలంలో కొంత సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్నారు. రుణ వృద్ధి, ఆర్థిక లావాదేవీల పెరుగుదల, పన్ను వసూళ్ల మెరుగుదల వంటి అంశాల్లో సానుకూలతలు కనిపిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

మూలధనం పెంపు తక్షణ ప్రయోజనం ఉండదు: ఎస్‌అండ్‌పీ
ఆర్థిక ఉద్దీపన చర్యల్లో భాగంగా బ్యాంకింగ్‌కు తాజాగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన రూ.70,000 కోట్ల మూలధన కల్పన వల్ల తక్షణ ప్రయోజనం ఏదీ ఒనగూరకపోవచ్చునని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) అంచనావేస్తోంది. కార్పొరేట్స్‌ నుంచి బలహీన రుణ డిమాండ్‌, ఎన్‌బీఎఫ్‌సీల రుణ సంక్షోభ పరిస్థితులు దీనికి కారణంగా ఎస్‌అండ్‌పీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. బ్యాంకింగ్‌ రుణ నాణ్యత మెరుగుకు మరికొన్ని సంవత్సరాలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గాడిలో పడినప్పుడే, బ్యాంకుల రుణ వృద్ధి తీరు మెరుగుపడుతుందని విశ్లేషించింది. బ్యాంకులు తక్షణం రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని లేదంటే ఎప్పటికప్పుడు మూలధన అవసరాలు ఏర్పడతాయని ఎస్‌అండ్‌పీ హెచ్చరించింది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటుపై అంతర్జాతీయ అంశాలే కాకుండా, దేశీయ అంశాలూ ప్రభావం చూపిస్తున్నాయని నివేదిక తెలిపింది. 7 శాతంపైన ప్రస్తుతం వృద్ధి కష్టమని పేర్కొంది. 

ఇప్పుడప్పుడే వృద్ధి ‘టర్నెరౌండ్‌’ కష్టం: డీఅండ్‌బీ 
దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊపందుకోవడం తక్షణం కష్టమని ఆర్థిక విశ్లేషణ సంస్థ- డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ భారత్‌ వ్యవహారాల చీఫ్‌ ఎకనమిస్ట్‌ అరుణ్‌ సింగ్‌ తెలిపారు. పైగా మరింత దిగజారే అవకాశమూ ఉందని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంస్థాగత సవాళ్లకు తగిన పరిష్కార మార్గాన్ని ఇంకా కనుగొనక పోవడమే దీనికి కారణంగా వివరించారు. ప్రస్తుతం దేశంలో పారిశ్రామిక రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు.  పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 66 శాతం వాటా కలిగిన తయారీ రంగం కోలుకునే పరిస్థితి లేకపోవడమే డీఅండ్‌బీ ఎకానమీ అబ్జర్వర్‌ విశ్లేషణకు కారణంగా పేర్కొన్నారు. జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి  కేవలం 2.5 శాతం నుంచి 3 శాతం మధ్యే ఉంటుందన్నది తమ అభిప్రాయమన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రేటు కోత నిర్ణయాలు కార్పొరేట్లకు కొంత ఊరట కల్పిస్తాయని అన్నారు. అయితే రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకింగ్‌ కస్టమర్‌కు బదలాయించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఆర్‌బీఐ నుంచి భారీ నిధులు ప్రయోజనమే!
ఇదిలావుండగా ఆర్‌బీఐ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి అందుతున్న రూ.1,76,051 కోట్లు వృద్ధిబాటలో తగిన సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్న విశ్లేషణ పలు వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. మందగమనంపై పోరు, బ్యాంకులకు తాజా మూలధన కల్పన వంటి అవసరాలకు కేంద్రం ఈ నిధులను వెచ్చిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  అయితే ఈ నిధుల్లో అధిక మొత్తం వినియోగం వైపు కాకుండా, మౌలిక రంగంపైనే ప్రభుత్వం వెచ్చిస్తుందన్న అభిప్రాయాన్ని బ్రోకరేజ్‌ సంస్థ- ఎంకీ పరిశోధనా నివేదిక తెలిపింది. కాగా బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజ మూలధన ప్రకటన విషయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ ప్రస్తావిస్తూ, ఆర్‌బీఐ నుంచి అందుతున్న నిధుల్లో కొంత భాగాన్ని కేంద్రం సంబంధిత మూలధన కల్పనకు వినియోగిస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 2019-20 కేంద్ర 3.38 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాలను చేరుకోవడంలో ఆర్‌బీఐ నిధుల బదలాయింపు కీలకమవుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకనమిస్ట్‌ సమీర్‌ నారంగ్‌ పేర్కొన్నారు. 3.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. 



You may be interested

విస్తరణ బాటలో ‘రామ్‌రాజ్‌ కాటన్‌’

Wednesday 28th August 2019

- నెల్లూరులో 100వ షోరూం ప్రారంభం ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రామ్‌రాజ్‌ కాటన్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో తన 100వ షోరూంను ప్రారంభించింది. సినీహీరో, సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ దగ్గుబాటి వెంకటేష్‌ చేతుల మీదుగా నూతన ఎక్స్‌క్లూజీవ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్‌ ప్రారంభమైంది. సందర్భానికి తగినట్లుగా ఉండే దాదాపు 2,000 వెరైటీల ధోతీలను అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక తమకు 12,500 టెక్స్‌టైల్స్‌ రిటైలర్స్‌ ఉండగా.. లాభాపేక్ష లేకుండా, చేనేత కార్మికులకు అండగా

కియా కార్ల ఉత్పత్తిలో నాణ్యతకు ప్రాధాన్యం

Wednesday 28th August 2019

కియా మోటార్స్‌ ఇండియా ఎండీ కుకుయున్‌షిమ్‌ పెనుకొండ: కియా కార్ల ఉత్పత్తిలో నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని కియా మోటార్స్‌ ఇండియా ఎండీ, సీఈఓ కుకుయున్‌షిమ్‌ తెలిపారు. సెల్టోస్‌ విక్రయాలు ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం కియా యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కుకుయున్‌షిమ్‌ మాట్లాడుతూ... 2017లో కియా కార్ల ప్లాంట్‌ నిర్మాణాన్ని 530.5 ఎకరాల్లో ప్రారంభించగా.. ఇంజనీరింగ్‌ టీం సమర్థతతో ఎక్కడా జాప్యం లేకుండా పూర్తయినట్టు తెలిపారు. ఏటా

Most from this category