News


పెట్టుబడుల ఆకర్షణీయ దేశంగా భారత్‌!

Wednesday 25th September 2019
news_main1569383511.png-28526

- కార్పొ పన్ను కోతతో కీలక పరిణామం
- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌
- ఆర్థికమంత్రితో భేటీ

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో భారత్‌ పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదిగా ఆయన అభివర్ణించారు.   ఆర్థిక మందగమనానికి మందుగా దేశీయ కంపెనీలపై 30 శాతంగా ఉన్న పన్నును 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ గత వారం తగ్గించిన సంగతి తెలిసిందే. 28 సంవత్సరాల్లో చరిత్రాత్మకమైనదిగా ఈ నిర్ణయాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. ‘‘ఇది ఎంతో సాహసోపేతమైన చర్య. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి అత్యంత సానుకూలమైనది. భారత్‌ కార్పొరేట్‌ పన్ను ప్రస్తుతం ఆసియాన్‌ అలాగే ఇతర ఆసియా దేశాల్లో అతితక్కువగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్య పోటీ అంశాలకు వస్తే, ఇది భారత్‌కు అత్యంత సానుకూలమైనది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోణంలో చూసినా లేక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుల (ఎఫ్‌డీఐ) వైపు నుంచి ఆలోచించినా, భారత్ ఇప్పుడు పోటీ పూర్వక వాతావరణంలో నిలిచింది. అధిక పెట్టుబడులను ఆకర్షించే సామర్ధ్యాన్ని పొందింది’’ అని దాస్‌ పేర్కొన్నారు. ‘‘ఇక దేశీయ కార్పొరేట్ల విషయానికి వస్తే, వారి వద్ద ఇప్పుడు అదనపు నిధులు ఉంటాయి. దీనితో వారు మరిన్ని పెట్టుబడులు పెట్టగలుగుతారు’’ అని కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. రుణ భారంలో ఉన్న కంపెనీలు దీనిని కొంత తగ్గించుకోగలుగుతాయని, వాటి బ్యాలెన్స్‌ షీట్లు మెరుగుపడతాయని శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితిపై ఆర్థికమంత్రితో చర్చ
అంతకుముందు ఆయన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం ముందు జరిగే సాంప్రదాయక సమావేశంగా ఆయన దీనిని పేర్కొన్నారు. ‘‘పాలసీ సమావేశానికి ముందు ఆర్థిక శాఖ మంత్రితో ఆర్‌బీఐ గవర్నర్‌ సమావేశం కావడం, ఆర్థిక వ్యవస్థపై చర్చించడం గత ఎంతోకాలంగా ఉన్న సాంప్రదాయమే. ఇప్పుడు జరిగింది కూడా ఈ తరహా సమావేశమే’’ అని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా పావుశాతం రెపోరేటు కోత ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం ఉద్దీపన చర్యలు ప్రకటించడానికి వీలుపడదని, ద్రవ్య పరిస్థితులు ఇందుకు దోహదపడవని ఇటీవల పేర్కొన్న ఆర్‌బీఐ గవర్నర్‌, అయితే రెపో రేటు తగ్గింపునకు మాత్రం అవకాశం ఉందని అభిప్రాయపడిన సంగతి ఇక్కడ గమనార్హం.  ఆర్థిక వృద్ధి లక్ష్యంగా గడచిన నాలుగు త్రైమాసికాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో 1.1 శాతం తగ్గింది. దీనితో ఈ రేటు ప్రస్తుతం 5.4 శాతానికి దిగివచ్చింది. అంతేకాకుండా తమకు అందుతున్న ఈ ప్రయోజనాన్ని బ్యాంకింగ్‌ తక్షణం కస్టమర్లకు బదలాయించడానికీ ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.  బ్యాంక్‌ రుణ రేటును రెపో, తదితర​ బెంచ్‌మార్క్‌ రేట్లకు అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ అనుసంధానించాలని బ్యాంకింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది.  మూడు నెలలకు ఒకసారి సమీక్ష జరిపి ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుండాలనీ కూడా ఆర్‌బీఐ సూచించింది. 



You may be interested

పండుగల సీజన్‌లో 1.40 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు

Wednesday 25th September 2019

- అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ భారీ నియామకాలు న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ సంస్థలు పండుగల సీజన్‌లో భారీ తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. దసరా, దీపావళి పండుగల అమ్మకాల కోసం 90,000 మందిని తాత్కాలికంగా నియమించుకోనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. క్రమబద్ధీకరణ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లు, కస్టమర్ సేవా వంటి విభాగాల్లో వీరి నియామకం జరగనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే నగరాల్లో తాత్కాలిక ఉద్యోగుల నియామకం జరగనున్నట్లు వివరించింది.

రూ.400 కోట్ల జీఎస్టీ స్కామ్‌ వెలుగులోకి

Wednesday 25th September 2019

అహ్మదాబాద్‌: జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ విభాగం రూ.400 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. దేశ రాజధాని ప్రాంతానికి (ఎన్‌సీఆర్‌) చెందిను ఎగుమతిదారులు గుజరాత్‌లోని కాండ్లా ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌)లోని యూనిట్ల సాయంతో రూ.400 కోట్ల వరకు జీఎస్‌టీ రిఫండ్‌ను పొందినట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారులు గుర్తించారు. తక్కువ నాణ్యతతో కూడిన పొగాకు ఉత్పత్తులు సెంటెడ్‌ జర్దా, ఫిల్టర్‌ ఖైనీ కేంద్రంగా ఈ స్కామ్‌ జరిగినట్టు

Most from this category