News


పరీక్ష పాసైతేనే కంపెనీకి డైరెక్టర్‌

Thursday 13th June 2019
news_main1560406514.png-26265

  • మోదీ సర్కారు యోచన
  • కార్పొరేట్‌ మోసాలకు చెక్‌ పెట్టే లక్ష్యం
  • అనుభవజ్ఞులకు మినహాయింపు

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పరిపాలనను పారదర్శకంగా మార్చేందుకు, కార్పొరేట్‌ కంపెనీల్లో అక్రమాలు, మోసాలకు చెక్‌ పెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కారు త్వరలోనే చర్యలు చేపట్టనుంది. దేశ కార్పొరేట్‌ రంగంలో గతేడాది ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల్లో విఫలం కావడం లిక్విడిటీని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ గ్రూపు ప్రమోటర్ల మోసాలు ఒక్కొక్కటీ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ ఏకంగా రూ.13,000 కోట్లకుపైగా మోసగించాడు. ఇవన్నీ చూశాక... కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలను కేంద్రం మరింత కఠినతరం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా కంపెనీల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా చేరాలనుకునే వారు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పెట్టే పరీక్ష పాస్‌ కావాల్సి ఉంటుందని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలిపారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఖాతాల్లో అక్రమాల సమాచారాన్ని రిపోర్ట్‌ చేయనందుకు, ఆ కంపెనీకి ఆడిటింగ్‌ సేవలందించిన డెలాయిట్‌ హస్కిన్స్‌, బీఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధించాలని ఇప్పటికే కార్పొరేట్‌ శాఖ ఎన్‌సీఎల్‌టీ ముందు పిటిషన్‌ కూడా దాఖలు చేసిన విషయం గమనార్హం. కంపెనీల్లో మోసాలు, సంక్షోభాలకు సంబంధించిన సంకేతాలను అవి బయటపడటానికి ముందే బోర్డుల్లో ఉన్న స్వతంత్ర డైరెక్టర్లు గుర్తించగలరనేది పరిశీలకుల భావన. ‘‘ఇండిపెండెంట్‌ డైరెక్టర్లకు ఎటువంటి ధర్మకర్త బాధ్యతలు లేవన్న అపోహను తొలగించాలనుకుంటున్నాం. కార్పొరేట్‌ విషయాల గురించి తెలియజేయడంతోపాటు, తమ విధులు, పాత్ర, బాధ్యతల గురించి వారిలో అవగాహన ఉండేలా చేయనున్నాం’’ అని ఇంజేటి శ్రీనివాస్‌ వివరించారు. 
ఆన్‌లైన్లో పరీక్ష...
‘‘భారతీయ కంపెనీల చట్టం, విలువలు, క్యాపిటల్‌ మార్కెట్‌ నిబంధనలు తదితర అంశాలను పరీక్షించేలా ఆన్‌లైన్‌ మదింపు ఉంటుంది. డైరెక్టర్లు కావాలనే ఆసక్తి ఉన్న వారు నిర్ణీత కాలవ్యవధిలోపు పరీక్షను పాస్‌ కావాల్సి ఉంటుంది. పరిమితి లేకుండా ఒకరు ఎన్ని సార్లయినా పరీక్ష రాసేందుకు అనుమతిస్తాం’’ అని శ్రీనివాస్‌ తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా సేవలందిస్తున్న అనుభవజ్ఞులకు మాత్రం ఆన్‌లైన్‌ పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పారు. అయితే, అటువంటి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే డేటాబేస్‌లో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కంపెనీలకు, ఇండిపెండెంట్‌ డైరక్టర్లకు ఇది వారధిగా ఉంటుందని, ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల కోసం చూసే కంపెనీలు తమతో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారిని ఈ వేదికగా కలుసుకోవచ్చని శ్రీనివాస్‌ తెలిపారు.  
స్వతంత్ర డైరెక్టర్ల పాత్రపై ప్రశ్నలు...
కంపెనీల చట్టం ప్రకారం ప్రతీ లిస్టెడ్‌ కంపెనీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్లను బోర్డులో నియమించుకోవాల్సి ఉంటుంది. బోర్డు మొత్తం సభ్యుల్లో కనీసం మూడింట ఒక వంతు వీరు ఉండాలి. ఆయా కంపెనీలకు పర్యవేక్షకులుగా వ్యవహరించడంతో పాటు, మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షకులుగా వ్యవహరించడమనేది వీరి బాధ్యత. ఈ మధ్య కాలంలో కార్పొరేట్‌ రంగంలో చోటుచేసుకున్న ఎన్నో ఘటనలు ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల విధులు, వారి పాత్రను, ఆడిటింగ్‌ సంస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసే విధంగా ఉంటున్నాయి. స్వతంత్ర డైరెక్టర్ల దగ్గర నుంచి ఆడిటింగ్‌ సంస్థలు, రేటింగ్‌ సంస్థల వరకు వాటి పాత్రలపై ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్యల దిశగా కేంద్ర సర్కారు యోచిస్తుండడం గమనార్హం. ఇండిపెండెంట్‌ డైరెక్టర్లకు పరీక్ష నిర్వహించాలనుకోవడం అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు మరో మెట్టు వంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. You may be interested

అదుపులో ధరలు... పరిశ్రమల పరుగు!

Thursday 13th June 2019

అదుపులో ధరలు... పరిశ్రమల పరుగు! ఊరటనిచ్చిన ఆర్థిక గణాంకాలు ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.4 శాతం ఆరు నెలల గరిష్ట స్థాయి నిరాశలోనే తయారీ, క్యాపిటల్‌ గూడ్స్‌  మేలో 3.05 శాతంగా రిటైల్‌ ధరల స్పీడ్‌ 7 నెలల గరిష్టమైనా నిర్దేశిత స్థాయిలోనే! న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగానికి సంబంధించి అలాగే రిటైల్‌ ధరల పరిస్థితికి సంబంధించి బుధవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాలు కొంత ఊరట కల్పించాయి. ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.4 శాతంగా

బ్యాంకుల్లో భారీ మోసాలు

Thursday 13th June 2019

11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల మేర 53 వేలకు పైగా చీటింగ్‌ కేసులు అత్యధికం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు మోసగాళ్లకు లక్ష్యంగా మారుతున్నాయి. గత 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల మేర భారీ మోసాలు ఇక్కడి బ్యాంకుల్లో చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. సంఖ్యా పరంగా ఎక్కువ ఘటనలు అత్యధికం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లోనే జరిగినట్టు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీగా మోసపోయినది మాత్రం పంజాబ్‌

Most from this category