News


సొంత సాంకేతిక సామర్ధ్యాలను పెంచుకోవాలి

Tuesday 25th February 2020
news_main1582598976.png-32055

  • సమ్మిళిత వృద్ధిపై దృష్టి పెట్టాలి
  • దేశీ సంస్థలకు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సూచన

ముంబై: సమ్మిళిత వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెట్టాలని, సొంతంగా సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల భారతీయ సంస్థలకు సూచించారు. గత దశాబ్దంలో మొబైల్‌ ద్వారా స్మార్ట్‌ టెక్నాలజీలు విరివిగా వాడకంలోకి వచ్చాయన్నారు. అయితే, అగ్రిగేటర్‌ సంస్థలు మాత్రమే దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందాయని పేర్కొన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ నిర్వహించిన ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సీఈవోల సదస్సులో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. టెక్నాలజీ భవిష్యత్తు, భారతీయ కంపెనీలతో కలిసి మైక్రోసాఫ్ట్‌ పనిచేసే తీరుతెన్నులు మొదలైన వాటి గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. "మనం ఏదైనా టెక్నాలజీని రూపొందించినప్పుడు .. సమ్మిళిత ఆర్థిక వృద్ధికి అది ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది కూడా దృష్టిలో ఉంచుకోవాలి" అని నాదెళ్ల పేర్కొన్నారు. నాయకత్వ హోదాల్లో ఉన్న సంస్థలు ఓవైపు సాంకేతిక సామర్ధ్యాలను నిర్మించుకుంటూనే మరోవైపు టెక్నాలజీపరమైన మార్పులను సాధ్యమైనంత త్వరగా అందిపుచ్చుకోవాలని చెప్పారు. గడిచిన దశాబ్దంలో వినియోగదారుల వ్యయాల ధోరణులే ప్రధానమన్న రీతిగా ఎకానమీ నడిచిందని .. కానీ ఆర్థిక వ్యవస్థ అంటే అదొక్కటే కాదని నాదెళ్ల తెలిపారు. టెక్నాలజీని వివిధ ప్రక్రియల్లో విరివిగా వాడే కంపెనీలన్నీ కూడా ప్రైవసీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం మొదలైన అంశాల్లో సంబంధిత వర్గాల విశ్వాసం చూరగొనే విధంగా వ్యవహరించాలని సూచించారు. 

మారుతున్న టెక్నాలజీ ఉద్యోగాల తీరు...
సాంకేతిక రంగంలో ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోతున్నాయని, కొంగొత్త నైపుణ్యాల్లో ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతుండటం కీలకంగా మారిందని ఆయన చెప్పారు. దాదాపు ప్రతీ కంపెనీ ప్రస్తుతం సాంకేతికతను వినియోగిస్తోందన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సుమారు 72 శాతం ఉద్యోగాలు.. టెక్నాలజీయేతర కంపెనీల్లోనే ఉంటున్నాయన్న నెట్‌వర్కింగ్‌ సైట్‌ లింక్డ్‌ఇన్‌ డేటా ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు, సైబర్‌ సెక్యూరిటీపరమైన రిస్కులపై కంపెనీలు మరింతగా దృష్టి సారించాలని ఆయన సూచించారు. పిరమల్‌ గ్లాస్, ఓలా, నారాయణ హెల్త్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి కంపెనీల్లో సాంకేతికత వినియోగాన్ని నాదెళ్ల ప్రస్తావించారు. రిలయన్స్‌తో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం .. రాబోయే దశాబ్దంలో అత్యంత కీలకమైనదిగా ఆయన అభివర్ణించారు. 
 



You may be interested

మెరిసిన బంగారం

Tuesday 25th February 2020

అంతర్జాతీయంగా 1,700 డాలర్లకు చేరిక దేశీయంగానూ పరుగే  రూ.1000 వరకూ లాభం కరోనా భయాలు ప్రధాన కారణం రూపాయి పతనమూ కారణమే! ముంబై: చైనాలో మొదలై ప్రపంచ దేశాలను విస్తరిస్తూ పలు దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్‌-19 (కరోనా) వైరెస్‌... బంగారం మెరుపులకు కారణమవుతోంది. వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తుండడం,  ప్రపంచాభివృద్ధిపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుతం తమ పెట్టుబడులకు యల్లో మెటలే సురక్షిత సాధనమని అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈక్విటీలు, క్రూడ్‌సహా పలు విభాగాల నుంచి

టాప్‌ 3 ఎకానమీల్లోకి భారత్‌

Tuesday 25th February 2020

దశాబ్దకాలంలో సాధ్యమే డిజిటల్‌ సొసైటీగా ఎదుగుతాం టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుస్తుంది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడి న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో ప్రపంచంలోని టాప్‌ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌..  కచ్చితంగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ డిజిటల్‌ సమాజంగా భారత్‌ రూపొందుతుందని ఆయన చెప్పారు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుసుందన్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌

Most from this category