News


ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్లు, వాచీలు..

Saturday 20th July 2019
news_main1563596342.png-27197

  • రేటింగ్‌ ఏజెన్సీల అధికారులకు లంచాలు 
  • మెరుగైన రేటింగ్‌ పొందేందుకు అడ్డదారులు
  • ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ స్కామ్‌లో వెలుగులోకి నిజాలు

న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్‌ పొందేందుకు కంపెనీ మేనేజ్‌మెంట్‌ ఏ విధంగా అడ్డదారులు తొక్కినదీ వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్‌ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా  తాయిలాలిచ్చి ఏ విధంగా కుంభకోణానికి తెరతీసినది గ్రాంట్‌ థార్న్‌టన్‌ మధ్యంతర ఆడిట్‌లో వెల్లడయింది. దాదాపు రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ సంస్థలకు మెరుగైన రేటింగ్స్‌ ఇచ్చిన వివాదంలో ఇప్పటికే ఇద్దరు సీఈవోలను రెండు రేటింగ్‌ ఏజెన్సీలు సెలవుపై పంపాయి. ఇక, కొత్తగా ఏర్పాటైన బోర్డు... గత మేనేజ్‌మెంట్‌ వ్యవహారాల నిగ్గు తేల్చేలా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించే బాధ్యతలను కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్‌ థార్న్‌టన్‌కు అప్పగించింది. 2008–2018 మధ్య కాలంలో గ్రూప్‌ సంస్థల బాండ్లు తదితర సాధనాలకు అధిక రేటింగ్‌ ఇచ్చి, ఆయా సంస్థలు భారీగా నిధులు సమీకరించుకోవడంలో రేటింగ్‌ ఏజెన్సీలు పోషించిన పాత్రపై ఆడిట్‌ నిర్వహిస్తున్న గ్రాంట్‌ థార్న్‌టన్‌ మధ్యంతర నివేదికను రూపొందించింది. రేటింగ్‌ ఏజెన్సీల సీనియర్‌ అధికారులు, వారి కుటుంబ సభ్యులకు బహుమతులిచ్చి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ తమకు కావాల్సిన రేటింగ్స్‌ దక్కేలా చూసుకుందన్నది ఇందులో తేలింది. 
ఇండియా రేటింగ్స్‌ అధికారికి లబ్ధి...
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌ (ఐటీఎన్‌ఎల్‌), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఐఎన్‌), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు 2008–2018 మధ్యకాలంలో ప్రధానంగా కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్‌ సంస్థలు రేటింగ్‌ సేవలు అందించాయి. 2012 సెప్టెంబర్‌– 2016 ఆగస్టు మధ్యకాలంలో ఐఎఫ్‌ఐఎన్‌ మాజీ సీఈవో రమేష్‌ బవా, ఫిచ్‌ రేటింగ్స్‌లో ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ విభాగం హెడ్‌ అంబరీష్‌ శ్రీవాస్తవ మధ్య జరిగిన ఈమెయిల్స్‌ సంభాషణలను గ్రాంట్‌ థార్న్‌టన్‌ పరిశీలించింది (ఇండియా రేటింగ్స్‌కి ఫిచ్‌ మాతృసంస్థ). శ్రీవాస్తవ భార్య ఓ విల్లా కొనుక్కోవడంలోనూ, డిస్కౌంటు ఇప్పించడంలోను రమేష్‌ తోడ్పాటునిచ్చినట్లు వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే, విల్లా కొనుగోలు మొత్తాన్ని చెల్లించడంలో జాప్యం జరగ్గా.. దానిపై వడ్డీని మాఫీ చేసేలా చూడాలంటూ యూనిటెక్‌ ఎండీ అజయ్‌ చంద్రను కూడా రమేష్‌ కోరారు. ఇలా రమేష్‌ నుంచి పలు ప్రయోజనాలు పొందిన శ్రీవాస్తవ నిష్పక్షపాతంగా రేటింగ్స్‌ ఇచ్చి ఉంటారనేది సందేహాస్పదమేనని గ్రాంట్‌ థార్న్‌టన్‌ ఆడిట్‌ నివేదికలో పేర్కొంది.
బ్రిక్‌ వర్క్స్‌.. ఇక్రాకు ప్రయోజనాలు...
ఇక బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టరు డి రవిశంకర్‌కు కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నుంచి ప్రయోజనాలు లభించినట్లు మరో ఈమెయిల్‌లో ఆధారాలు లభించాయి. స్పెయిన్‌లో జరిగిన రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడటానికి తనకు, తన కుమారుడికి కార్పొరేట్‌ బాక్స్‌లో టికెట్లు ఇప్పించినందుకు ధన్యవాదాలు చెబుతూ అప్పటి ఐఎఫ్‌ఐఎన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అరుణ్‌ సాహాకు 2015 ఏప్రిల్‌లో రవిశంకర్‌ ఈమెయిల్‌ పంపారు. మరోవైపు, ఇక్రా మాజీ చైర్మన్‌ డీఎన్‌ ఘోష్‌ను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఏ విధంగా ప్రభావితం చేసినదీ మరో ఈమెయిల్‌లో బైటపడింది. సమీక్ష ట్రస్టుకు రూ. 25 లక్షల విరాళం ఇచ్చే అంశానికి సంబంధించి రవి పార్థసారథికి (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ మాజీ చైర్మన్‌) మీనాక్షి కనగత్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ మేనేజర్‌) 2008 ఫిబ్రవరిలో ఈమెయిల్‌ పంపారు. ఈ సమీక్ష ట్రస్టుకు డీఎన్‌ ఘోష్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా ఉన్నారు. ఇక, కేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ మొకాషికి ఇష్టమైన ఫిట్‌బిట్‌ వాచీ అందించే ఏర్పాటు చూడాలంటూ సుజయ్‌ దాస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌)కు సూచిస్తూ సాహా రాసిన మరో మెయిల్‌ లభ్యమైంది. అలాగే, శ్రీవాస్తవతో పాటు పలువురికి షర్టుల్లాంటివి కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బహుమతులుగా ఇచ్చినట్లు ఈమెయిల్స్‌లో ఆధారాలు లభించాయి. దీపావళి సందర్భంగా రేటింగ్‌ ఏజెన్సీల్లోని ముఖ్య అధికారులకు బహుమతులు అందించాలంటూ తమ సిబ్బందికి సాహా సూచించినట్లు వెల్లడైంది. మొత్తం మీద క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారుల అభిరుచుల గురించి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సిబ్బందికి తెలిసే ఉంటుందన్న అభిప్రాయం ఈ మెయిల్స్‌ ద్వారా కలుగుతోందని గ్రాంట్‌ థార్న్‌టన్‌ మధ్యంతర నివేదికలో పేర్కొంది. You may be interested

విమానయాన రంగం తిరిగి పుంజుకోనుంది

Saturday 20th July 2019

బోర్డు రూమ్‌ వివాదాలు, రుణాల భారం, భవిష్యత్తుపై అనుమానాలు వలన విమానయాన పరిశ్రమ ఇటివల అందరి దృష్ఠిని ఆకర్షిస్తోంది. సాధరణంగా ఈ పరిశ్రమ అధిక స్థిర ఆస్తి వ్యయాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ రంగంలో మార్జిన్లు తక్కువగా ఉంటాయి. వీటికి తోడు విమానయాన రంగ కంపెనీలు సంక్షోభం‍లో చిక్కుకోవడంతో ఈ రంగం ​చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడడంతో పాటు తాజాగా ఇండిగో సంస్థ యాజమాన్య గొడవలు

రెండో అతిపెద్ద టెలికం సంస్థగా ‘జియో’

Saturday 20th July 2019

భారతీ ఎయిర్‌టెల్‌ స్థానం కైవసం 32.29 కోట్ల చందాదారులతో రికార్డు 27.80 శాతానికి మార్కెట్‌ వాటా న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని ప్రముఖ టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’.. తాజాగా మరో సంచలనం సృష్టించింది. దిగ్గజ సంస్థలను వెనక్కి నెడుతూ ఈ రంగంలో వాయు వేగంతో దూసుకుపోతోంది. చందాదారుల సంఖ్య పరంగా ఇప్పటివరకు రెండో స్థానంలో కొనసాగిన భారతీ ఎయిర్‌టెల్‌ను పక్కకు నెట్టి.. ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ

Most from this category