News


పరిశ్రమలు వెనక్కి...!

Thursday 13th February 2020
news_main1581564384.png-31736

  • యథా‘మైనస్‌’లోకి పారిశ్రామిక ఉత్పత్తి
  • డిసెంబర్‌లో 0.3 శాతం క్షీణత
  • తయారీ, విద్యుత్‌ రంగాల ప్రధానపాత్ర
  • ఆరేళ్ల గరిష్టస్థాయికి రిటైల్‌ ధరల మంట

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోతే... రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. ఆర్థిక, విధాన నిర్ణేతలకు ఆందోళన కలిగిస్తున్న అంశాలివి. 2020-21 బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంగళవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ సమాధానం ఇస్తూ, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొన్నారు.  మరుసటిరోజే తాజా బలహీన గణాంకాలు వెలువడ్డం గమనార్హం. 

పారిశ్రామిక ప్రగతి శూన్యం...
 పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో కొంచెం పుంజుకుందనుకుంటే, డిసెంబర్‌లో మళ్లీ నీరసించిపోయింది. ఉత్పత్తి సూచీ (ఐఐపీ) -0.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 డిసెంబర్‌తో పోల్చిచూస్తే, 2019 డిసెంబర్‌లో అసలు వృద్ధిలేకపోగా -0.3 శాతం క్షీణతలోకి జారిందన్నమాట. తయారీ, విద్యుత్‌ రంగాలూ క్షీణబాటలోనే నిలిచాయి. ఐఐపీ గతేడాది వరుసగా మూడు నెలల పాటు క్షీణ బాటలోనే ఉన్నప్పటికీ (ఆగస్టులో -1.4 శాతం, సెప్టెంబర్‌లో - 4.6 శాతం, అక్టోబర్‌లో -4 శాతం) నవంబర్‌లో కాస్త పుంజుకుని 1.8 శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాత నెల డిసెంబర్‌లో మళ్లీ క్షీణించడం గమనార్హం.  2018 డిసెంబర్‌లో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. బుధవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం కీలక రంగాలను చూస్తే...

తయారీ: 2019 డిసెంబర్‌లో తయారీ రంగ ఉత్పాదకత క్షీణించి మైనస్ 1.2 శాతానికి పరిమితమైంది. 2018 డిసెంబర్‌లో ఇది 2.9 శాతం వృద్ధిలో ఉంది. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకూ చూస్తే, 0.5 శాతం వృద్ధిలో ఉన్నా... ఇది 2018 ఇదే కాలంతో పోల్చిచూస్తే (4.7 శాతం) తక్కువకావడం గమనార్హం. తయారీ రంగంలోని 23 పరిశ్రమల్లో 16 పరిశ్రమలు నెగటివ్ వృద్ధిని కనపర్చాయి. 
విద్యుత్‌: ఈ రంగంలో ఉత్పత్తి  4.5 శాతం  వృద్ధి నుంచి ​నుంచి -0.1 శాతానికి పడింది. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకూ చూసినా, వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గింది. 
మైనింగ్‌:  5.4 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌లో ఇది మైనస్ 1 శాతంగా నమోదైంది.అయితే ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకూ ఈ రేటు 3.1 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. 
క్యాపిటల్‌ గూడ్స్‌: పెట్టుబడులకు, భారీ యంత్ర సామాగ్రి కొనుగోలుకు కొలమానంగా నిల్చే క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో రేటు ఏకంగా - 18.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్‌లో ఇది 4.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
కన్జూమర్ డ్యూరబుల్స్‌: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో ఉత్పత్తి మైనస్ 6.7 శాతం. అయితే ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌)కు సంబంధించిన  నాన్-డ్యూరబుల్స్‌ మైనస్ 3.7 శాతంగా నమోదైంది.

తొమ్మిది నెలల్లో ఇలా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 4.7 శాతం.

 


ఆందోళనకరం...
గత నెల దాకా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న దాఖలాలు కనిపించినప్పటికీ డిసెంబర్‌లో గణాంకాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో అన్ని పరిశ్రమలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎకానమీకి ఇది అంత మంచిది కాదు.
- రుమ్‌కీ మజుందార్,  డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త .
 You may be interested

ధరలు పైపైకి..!

Thursday 13th February 2020

వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్‌ రిటైల్‌ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.  కట్టుదాటి...! రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్‌ 2’

నిఫ్టీ మద్దతు12,153 పాయింట్లు

Thursday 13th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11 పాయింట్లు మైనస్‌ బుధవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 11 పాయింట్లు నీరసించి 12,216 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,227 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వరుసగా మూడో రోజు

Most from this category