News


బెంగళూరును దాటేసిన భాగ్యనగరం!

Wednesday 8th January 2020
news_main1578454162.png-30744

  • ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ టాప్‌
  • హెచ్‌2లో 89 లక్షల చ.అ. లావాదేవీలు; 7,933 గృహాల విక్రయం
  • నైట్‌ఫ్రాంక్‌ ఇండియా 12వ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ క్రయవిక్రయాలు టాప్‌ గేర్‌లో సాగుతున్నాయి. 2019 జులై – డిసెంబర్‌ (హెచ్‌2) మధ్య కాలంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే భాగ్యనగరంలోనే అత్యధిక లావాదేవీలు జరిగాయి. గతేడాది హెచ్‌2లో బెంగళూరులో 70 లక్షల చ.అ.కు సంబంధించిన లావాదేవీలు జరగ్గా.. హైదరాబాద్‌లో 89 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. ఏడాది మొత్తంగా చూస్తే 1.28 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తన 12వ నివేదికలో తెలియజేసింది. ఇతర నగరాల్లో లావాదేవీలు చూస్తే.. ముంబైలో 51 లక్షల చ.అ., ఎన్‌సీఆర్‌లో 48 లక్షలు, పుణేలో 24 లక్షలు, అహ్మదాబాద్‌లో 10 లక్షలు, చెన్నైలో 34 లక్షలు, కోల్‌కతాలో 7 లక్షల చ.అ. మేర నమోదయ్యాయి. మంగళవారమిక్కడ హైదరాబాద్‌ డైరెక్టర్‌ శామ్సన్‌ ఆర్థర్‌ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ రెండో అర్ధ సంవత్సర నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. 
జులై – డిసెంబర్‌ మధ్య కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా 8,065 గృహాలు ప్రారంభం కాగా.. 7,933 గృహాలు విక్రయమయ్యాయి. హెచ్‌1లో ప్రారంభాలు 5,430 కాగా.. అమ్మకాలు 8,334లుగా ఉన్నాయి. కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఆరంభమయ్యాయి. రూ.80– కోటి రూపాయల ధర ఉండే ఇళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కోటిన్నర పైన ధర ఉండే గృహాల్లో 17 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన గృహాలు (ఇన్వెంటరీ) 39 శాతం క్షీణించి 4,397 యూనిట్లుగా ఉన్నాయి.

13.6 లక్షల చ.అ. కో–వర్కింగ్‌ స్పేస్‌...
హైదరాబాద్‌ కార్యాలయ స్థలాల లావాదేవీల్లో ఐటీ రంగానిదే హవా. 2018 హెచ్‌2లో మొత్తం లావాదేవీల్లో ఐటీ స్పేస్‌ వాటా 44 శాతంగా ఉండగా.. 2019 హెచ్‌2 నాటికి 58 శాతానికి పెరిగింది. గతేడాది హెచ్‌2లో నగరంలో 13.6 లక్షల చ.అ. కో–వర్కింగ్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్‌ స్పేస్‌ ధరలు చ.అ.కు రూ.61గా ఉండగా... ఏడాదిలో 5 శాతం వృద్ధి కనిపించింది.
దేశవ్యాప్తంగా...
దేశవ్యాప్తంగా హెచ్‌2లో 1,12,150 గృహాలు ప్రారంభం కాగా.. 1,16,576 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇన్వెంటరీ 5 శాతం క్షీణించి 4,45,836 యూనిట్లకు పరిమితమయింది. ఆఫీస్‌ స్పేస్‌లో 3.32 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి. ఇందులో కో–వర్కింగ్‌ స్పేస్‌ 41 లక్షల చ.అ.లుగా ఉంది. మొత్తం లావాదేవీల్లో ఐటీ వాటా 41 శాతం, బీఎస్‌ఎఫ్‌ఐ 16, తయారీ రంగం 12 శాతంగా ఉన్నాయి. 



You may be interested

ఇక రోజంతా రూపీ ట్రేడింగ్‌

Wednesday 8th January 2020

బ్యాంకులకు ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఎక్స్చేంజీల్లోనూ వేళలు పొడిగించే అవకాశం ముంబై: దేశీయంగా రూపాయి ట్రేడింగ్‌ సేవలు ఇకపై 24 గంటలూ అందుబాటులో ఉండేలా రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రోజంతా దేశీ కరెన్సీ ట్రేడింగ్‌ సేవలు అందించడానికి దేశీ బ్యాంకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూపాయి ట్రేడింగ్‌ పరిమాణం భారత్‌లో కన్నా విదేశాల్లో గణనీయంగా జరుగుతుండటం, ఇక్కడ ట్రేడింగ్‌ వేళలు పరిమితంగా ఉండటం వల్ల అంతర్జాతీయ పరిణామాలను దేశీ మార్కెట్లు

పతనంతో ప్రారంభం?

Wednesday 8th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 114 పాయింట్లు డౌన్‌ యూఎస్‌ సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్‌ మిస్సైళ్లతో దాడి చేసినట్లు వెలువడిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు తెరతీశాయి. దీంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం 8.20 ప్రాంతం‍లో 114 పాయింట్లు పడిపోయి 11,942 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,106 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌

Most from this category