News


ఐటీ మినహాయింపు పరిమితి పెంపు!

Monday 1st July 2019
news_main1561958298.png-26705

- రూ.10 కోట్ల ఆదాయం మించితే 40 శాతం పన్ను...
- బడ్జెట్‌లో ఈ దిశగా చర్యలు ఉండొచ్చని కేపీఎంజీ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్‌లో మోదీ సర్కారు ఆదాయపు పన్ను(ఐటీ) విషయంలో కీలక చర్యలను ప్రకటించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులకు ఇప్పటివరకూ రూ.2.5 లక్షలుగా ఉన్న మినహాయింపు పరిమితిని పెంచొచ్చని పేర్కొన్నారు. ఈ నెల 5న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. దీనిపై అం‍చనాల విషయంలో అన్ని పరిశ్రమలకు చెందిన 226 మంది నుంచి కేపీఎంజీ ప్రీ-బడ్జెట్‌ సర్వేను నిర్వహించింది. ముఖ్యాంశాలివీ...
- ఐటీ మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ.2.5 లక్షల నుంచి పెంచే అవకాశం ఉందని సర్వేలో పాల్గొన్న 74 శాతం మంది పేర్కొన్నారు.
- ఇక కుబేరుల(సూపర్‌ రిచ్‌)కు సంబంధించి... రూ.10 కోట్ల ఆదాయం మించిన వారికి కొత్తగా 40 శాతం పన్ను శ్లాబ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టొచ్చని 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయంపై ఎలాంటి పన్నూ లేదు. అయితే, మధ్యంతర బడ్జెట్‌లో రూ.5 లక్షల వరకూ పన్ను పడకుండా రిబేటు రూపంలో ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసందే.
- మరోపక్క, అనువంశిక పన్నును మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఉందని 13 శాతం మంది, సంపద/ఎస్టేట్‌ పన్నును పునఃప్రవేశపెట్టొచ్చని 10 శాతం మంది అంచనా వేశారు.
- గృహనిర్మాణ రంగంలో డిమాండ్‌ను పెంచేందుకు వీలుగా హౌసింగ్‌ రుణాల(సొంతింట్లో ఉన్నవారికి) వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ.2 లక్షల స్థాయి నుంచి పెంచొచ్చని 65 శాతం మంది పేర్కొన్నారు.
- అదేవిధంగా సెక‌్షన్‌ 80సీ కింద ఉన్న రూ.1.5 లక్షల మినహాయింపు పరిమితి నుంచి హౌసింగ్‌ రుణాల అసలు మొత్తం(ప్రిన్సిపల్‌) చెల్లింపులను వేరు చేసే అవకాశం ఉందని 51 శాతం మంది చెప్పారు.
- అయితే, ప్రత్యక్ష పన్నుల విషయంలో భారీ మార్పులేవీ ఉండకపోవచ్చని 53 శాతం మంది అంచనా వేశారు.
- ఇక పరిశ్రమ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నట్లుగా ఇప్పుడున్న 25 శాతం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు విషయంలో చర్యలు ఉండే అవకాశం లేదని 46 శాతం మంది సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేశారు.



You may be interested

తగ్గనున్న నెఫ్ట్‌ చార్జీలు ..

Monday 1st July 2019

ఆర్‌బీఐ ఆదేశాలతో నేటి నుంచే అమల్లోకి ముంబై: ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌ విధానాల ద్వారా నగదు బదిలీ లావాదేవీల చార్జీలు నేటి నుంచి (సోమవారం) తగ్గనున్నాయి. ఈ తరహా లావాదేవీలపై తాను విధించే చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇచ్చిన ఆదేశాలు జులై 1 నుంచి (నేడు) అమల్లోకి రావడం ఇందుకు కారణం. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు కూడా ఈ లావాదేవీల చార్జీలను తగ్గించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ ఆంధ్రా

జీఎస్‌టీ 2.0 అమల్లోకి తేవాలి

Monday 1st July 2019

పరిశ్రమవర్గాల అభిప్రాయం న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) రెండో దశను (2.0) అమల్లోకి తేవాల్సిన సమయం వచ్చిందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. విద్యుత్‌, చమురు, గ్యాస్‌, రియల్ ఎస్టేట్‌, ఆల్కహాల్‌ను కూడా దీని పరిధిలోకి తీసుకురావడం ద్వారా పన్ను సంస్కరణలకు మరింత ఊతమివ్వాల్సిన అవసరముందని పేర్కొన్నాయి. అలాగే పన్ను రేటును 2-3 శ్లాబులకు పరిమితం చేయాలని కోరాయి. "జీఎస్‌టీ అమల్లోకి వచ్చి రెండేళ్లయింది. ఇక జీఎస్‌టీ 2.0ని అమలు

Most from this category