News


చర్చలో ప్రధానాంశం ఉల్లిపాయే!

Friday 20th December 2019
news_main1576814058.png-30329

  • ఆర్‌బీఐ ద్రవ్య సమీక్షా సమావేశ మినిట్స్‌ వివరాలు వెల్లడి

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ నెల మొదటి వారంలో మూడు (3-5 తేదీల మధ్య) రోజులు నిర్వహించిన ద్రవ్య, పరపతి సమీక్షా సమావేశ మినిట్స్‌ వివరాలు గురువారం వెల్లడయ్యాయి. భారీగా పెరిగిన ఉల్లి ధరలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు మినిట్స్‌ వెల్లడించాయి. సెప్టెంబర్‌ నుంచీ ఉల్లి ధరలు తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కేజీ ధర రూ.125 నుంచి రూ.150 వరకూ పలుకుతోంది. 2018 నవంబర్‌ ధరలతో పోల్చిచూస్తే, 2019 నవంబర్‌లో ఉల్లిపాయల ధర కేజీకి 175 శాతం పెరిగిందని స్వయంగా టోకు ధరల గణాంకాలు తెలిపాయి. టోకు ధర పెరుగుదల తీవ్రతే ఇంత ఉంటే, ఇక రిటైల్‌లో ఈ నిత్యావసర వస్తువు ధర పరిస్థితి ఊహించుకోవచ్చు. ఫిబ్రవరి నుంచీ వరుసగా ఐదు ద్వైమాసిక సమీక్షా సమావేశాల సందర్భంగా ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటును 135 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ఆర్థిక వృద్ధే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాలకు ధరలు కట్టడిలో ఉండడం ఊతం ఇచ్చింది. అయితే ఈ నెల మొదట్లో జరిగిన ద్వైమాసిక సమీక్షా సమావేశంలో మాత్రం రెపో రేటును యథాతథంగా ఉంచాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ధరల తీవ్రతే దీనికి ప్రధాన కారణం. ‘‘సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఉల్లిపాయలుసహా నిత్యావసరాల ధరల భారీగా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల ఖరీఫ్‌ పంట దెబ్బతినడం దీనికి కారణం’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ పరపతి విధాన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. గవర్నర్‌ నేతృత్వంలోని ద్రవ్య విధాన పరపతి సమీక్షా కమిటీలోని ఆరుగురు సభ్యులూ రెపో రేటు యథాతథ పరిస్థితికి ఓటు చేసిన సంగతి తెలిసిందే. You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Friday 20th December 2019

ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల్ని అందిపుచ్చుకున్న భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం ప్రారంభంలోనే మరో కొత్త రికార్డుస్థాయిని అందుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్లు జంప్‌చేసి 41,746 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 12,270 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

పాస్‌వర్డ్‌లు చోరీ ‍అయ్యాయి.. జాగ్రత్త..

Friday 20th December 2019

భారత్‌లో యూజర్లను అప్రమత్తం చేసిన గూగుల్‌ న్యూఢిల్లీ: నిర్దిష్ట వెబ్‌సైట్లను ఉపయోగించే వారి పాస్‌వర్డ్‌లు చోరీకి గురై ఉంటాయని, వాటిని తక్షణమే మార్చుకోవాలని భారత్‌లోని యూజర్లను టెక్ దిగ్గజం గూగుల్‌ అప్రమత్తం చేసింది. మీడియా సంస్థలు మొదలుకుని సామాన్య యూజర్ల దాకా చాలా మంది ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్‌ స్క్రీన్‌లపై గురువారం ఈ మేరకు నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి. డేటా లీకేజీ కారణంగా పాస్‌వర్డ్‌లు చోరీకి గురై ఉంటాయని వీటిల్లో గూగుల్ పేర్కొంది.

Most from this category