News


5జీ వేలం ఈ ఏడాదే..

Tuesday 15th October 2019
news_main1571112814.png-28882

  • స్పెక్ట్రం ధరల్లో సంస్కరణలు తీసుకొస్తాం...
  • టెల్కోలకు మంత్రి రవి శంకర్ ప్రసాద్ భరోసా
  • ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభం

న్యూఢిల్లీ: 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. "టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రభుత్వానికి తెలుసు. స్పెక్ట్రం వేలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే జరుగుతుంది. ధరకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేపడుతున్నాం" అని ప్రసాద్ చెప్పారు. మరోవైపు, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి అంశంపై స్పందిస్తూ ఎన్‌క్రిప్షన్‌ను ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని చెప్పారు. అయితే, హింసను ప్రేరేపించే విధమైన తప్పుడు వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు .. దర్యాప్తు సంస్థలు వాటి మూలాలను కచ్చితంగా కనుగొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు అనువైన వ్యవస్థ ఉండటం తప్పనిసరన్నారు. స్పెక్ట్రం రేటును సంస్కరిస్తామంటూ ప్రసాద్ ప్రకటించడాన్ని సెల్యులార్ సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఇది టెలికం కంపెనీలకు "భారీ ఊరట" ఇస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. తగినంత స్పెక్ట్రం, సరైన ధర ఉంటే రాబోయే వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు టెల్కోలు కూడా ఆసక్తి చూపుతాయని పేర్కొన్నారు. 5జీ స్పెక్ట్రం వేలానికి రూ. 4.9 లక్షల కోట్ల బేస్ ధరను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) గతేడాది సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 

నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలి: బిర్లా
కొత్త డిజిటల్ భారతదేశాన్ని నిర్మించాలంటే టెలికం రంగం కీలకమని వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. ఈ రంగం వృద్ధికి నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలని, ప్రభుత్వం ఇందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని పేర్కొన్నారు. మరోవైపు, భారీ స్పెక్ట్రం ధరలు, నెట్‌వర్క్‌ విస్తృతికి భారీగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం టెలికం రంగంపై మరింత భారం మోపుతోందని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌ చైర్మన్ రాకేష్ భారతి మిట్టల్ చెప్పారు. 5జీ స్పెక్ట్రంనకు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రిజర్వ్ ధర మిగతా దేశాలతో పోలిస్తే ఏకంగా ఏడు రెట్లు అధికమన్నారు. అమెరికాలో యూజరుపై సగటు ఆదాయం 36 డాలర్లు ఉండగా.. భారత్‌లో 1.5 డాలర్లు మాత్రమే ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాపార నిర్వహణ సులభతరం చేసే సానుకూల పరిస్థితులు అవసరమని పేర్కొన్నారు. 5జీ టెక్నాలజీలో భారత్ లీడరుగా ఎదగాలంటే స్పెక్ట్రం ధర సహేతుకంగా ఉండేలా చూడటం అవసరమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తెలిపారు. మరోవైపు, భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమయ్యాక.. 5జీ నెట్‌వర్క్ పరికరాల ఉత్పత్తిని కూడా ఇక్కడ ప్రారంభించనున్నట్లు స్వీడన్‌ టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ఇండియా హెడ్ నన్జియో మిర్టిలో తెలిపారు. 

తొలి రోజున 5జీ టెక్నాలజీ మెరుపులు..
దేశీ టెలికం సంస్థలకు కీలక కార్యక్రమమైన ఐఎంసీ అక్టోబర్ 16 దాకా మూడు రోజుల పాటు సాగనుంది. ఽఈసారి ఒక లక్ష మంది దాకా దీన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. ఇందులో 500 పైచిలుకు కంపెనీలు, 250 స్టార్టప్‌లు, 110 విదేశీ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు. దేశీ టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో జరుగుతుండటంతో ఐఎంసీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తొలి రోజున వివిధ టెలికం దిగ్గజాలు పలు కొత్త కాన్సెప్ట్స్‌ను సందర్శకులకు ప్రదర్శించాయి. గాయకులు ఒక చోట పాడుతుంటే, మ్యూజిక్ కంపోజర్ మరోచోట కంపోజ్ చేస్తుండగా.. రెండింటినీ అనుసంధానం చేసి ఏకకాలంలో పూర్తి పాటను లైవ్‌లో వినిపించే 5జీ టెక్నాలజీ కాన్సెప్ట్‌ను ఎరిక్సన్‌, ఎయిర్‌టెల్ ప్రదర్శించాయి. స్మార్ట్‌ వాహనాల్లో 5జీ టెక్నాలజీ వినియోగాన్ని వొడాఫోన్ ఐడియా ప్రదర్శించింది. నోకియా భాగస్వామ్యంతో.. వైద్యం, విద్యా రంగాల్లో లైవ్ 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్‌ను ఏ విధంగా ఉపయోగించవచ్చో కూడా చూపింది. అటు రిలయన్స్ జియో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్‌ను ప్రదర్శించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ అమెరికన్ సంస్థ రాడిసిస్‌తో కలిసి జియో దీన్ని రూపొందించింది. 

అంబానీ, మిట్టల్ గైర్హాజరు..
గత రెండు సార్లు ఐఎంసీలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈసారి మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం. లీడర్స్ పర్ ది నెక్ట్స్‌ జనరేషన్ అంశంపై ప్రసంగించాల్సిన ముకేశ్ అంబానీ సంతానం ఆకాష్, ఈషా అంబానీ కూడా రాలేదు. అలాగే, విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా హాజరు కాలేదు. You may be interested

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,848 కోట్లు

Tuesday 15th October 2019

క్యూ2లో 21 శాతం వృద్ధి  ఒక్కో షేర్‌కు రూ.11 మధ్యంతర డివిడెండ్‌  రూ.9,708 కోట్లకు పెరిగిన అమ్మకాలు  మాంద్యంలోనూ మంచి వృద్ధి సాధించాం: సీఎండీ న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,848 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ2లో ఆర్జించిన నికర లాభం(రూ.1,525 కోట్లు)తో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. గృహ సంరక్షణ, సౌందర్య, వ్యక్తిగత

మూడేళ్ల కనిష్టానికి టోకు ధరలు

Tuesday 15th October 2019

సెప్టెంబర్‌లో 0.33 శాతం ‘తయారీ’లో ధరల క్షీణత ఇంధనం, విద్యుత్‌లోనూ ఇదే ధోరణి ఆర్థిక మందగమనానికి సంకేతం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం  తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని సూచిస్తున్నాయి.  సెప్టెంబర్‌లో సూచీ 0.33 శాతంగా నమోదయ్యింది. మూడు సంవత్సరాల తర్వాత టోకు సూచీని ఈ స్థాయిలో చూడ్డం ఇదే తొలిసారి. 2016 జూన్‌లో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదలలేకపోగా -0.1 శాతం క్షీణించింది. 2019 ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం

Most from this category