News


బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత భద్రత!

Wednesday 20th November 2019
news_main1574219589.png-29711

  • బీమా రూ.5 లక్షలకు పెంచే అవకాశం
  • ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో చట్టం
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలు
  • ఆర్థిక శాఖ ముందు పలు ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. త్వరలో ఇది మరింత భద్రంగా మారనుంది. ప్రస్తుతం డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమాను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై చెల్లింపుల్లో విఫలమైతే... అప్పుడు ఒక్కో డిపాజిట్‌ దారుడికి గరిష్టంగా రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు సంక్షోభం పాలవడంతో ఆ బ్యాంకుల్లో భారీగా డిపాజిట్‌ చేసుకున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిపాజిటర్ల ఆగ్రహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముంబై వెళ్లిన సందర్భంగా స్వయంగా చవి చూశారు కూడా. ఆర్‌బీఐ సైతం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని బలంగా చాటాయి. దీంతో కేంద్ర సర్కారు ఈ అవసరాన్ని గుర్తించడంతోపాటు అమలు దిశగా చర్యలు చేపట్టింది. ఈ శీతాకాల సమావేశాల్లో బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా పెంపునకు చట్టాన్ని తేనున్నట్లు మంత్రి సీతారామన్‌ రెండు రోజుల క్రితమే వెల్లడించారు. అయితే, ఎంత మొత్తానికి ఈ పెంపు అన్న విషయాన్ని ఆమె చెప్పలేదు. 
రెండు రకాలు..
బ్యాంకు డిపాజిట్లను రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. రిటైల్‌ డిపాజిట్‌ దారులకు రూ.లక్ష బీమాను రూ.5 లక్షలకు చేయనుండడం ఒకటి కాగా, హోల్‌సేల్‌ డిపాజిట్‌దారులకు ఈ మొత్తాన్ని రూ.25 లక్షలుగా చేయడం రెండోది. చివరిగా 1993 మే1న డిపాజిట్లపై బీమాను సవరించారు. 1992లో జరిగిన సెక్యూరిటీస్‌ స్కామ్‌ దెబ్బకు బ్యాంక్‌ ఆఫ్‌ కరద్‌ మూతపడడం నాడు డిపాజిట్లపై గరిష్ట బీమాగా ఉన్న రూ.30,000 మొత్తాన్ని రూ.లక్షకు పెంచడానికి కారణమైంది. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం మరో విడత సవరణ అవసరాన్ని గుర్తు చేసింది. అయితే, డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచితే బ్యాంకులు చెల్లిస్తున్న ప్రీమియం కూడా పెరుగుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మరో రెండు రకాల ప్రతిపాదనలను కూడా పరిశీలించొచ్చని విశ్వసనీయ సమాచారం. పెంచిన మేరకు డిపాజిట్లపై బీమా మొత్తాన్ని బ్యాంకులు సహజంగానే చెల్లించాలి. దీని‍్న డిపాజిట్‌ దారుల నుంచే వసూలు చేయొచ్చన్నది మరో ప్రతిపాదన. ఆర్‌బీఐ అనుబంధ విభాగమైన డీఐసీజీసీ విడిగా ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, పీఎంసీ బ్యాంకు తరహా సంక్షోభాల్లో చెల్లింపులకు వినియోగించడం మరొక ప్రతిపాదన. వీటిల్లో ఏది ఆచరణ రూపం దాల్చనుందనేది అతిత్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

రూ.10 లక్షలు చేయాలి
బ్యాంకు డిపాజిట్లపై బీమాను రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ఆర్‌బీఐ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ‘‘డిపాజిట్లపై బీమాను కనీసం రూ.10 లక్షలు చేయాలని గతంలో సూచించాం. మరోసారి దీన్ని పరిశీలించాలని కోరుతున్నాం’’ అని అఖిల భారత రిజర్వ్‌ బ్యాంకు ఉద్యోగుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. డాలర్‌ మారకంలో చూసుకుంటే రూ.10 లక్షల బీమా 14,000 డాలర్లకు సమానమని, చాలా దేశాల్లో ఉన్న బీమా కంటే ఇది ఎంతో తక్కువ మొత్తమని సంఘం పేర్కొంది. 



You may be interested

ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.95,760 కోట్ల మోసాలు

Wednesday 20th November 2019

ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య ప్రభుత్వ బ్యాంకింగ్‌ లెక్కలు రాజ్యసభలో ఆర్థికమంత్రి వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) రూ.95,760 కోట్లకుపైగా మోసాలు చోటుచేసుకున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి 5,743 కేసులు నమోదయ్యాయి. నిధులపరంగా చూస్తే,

ఈ కంపెనీల ప్రమోటర్ల వాటాల్లో మార్పులు

Tuesday 19th November 2019

మార్కెట్లు దాదాపు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ సమయంలో ఏ స్టాక్‌ను కొనుగోలు చేయాలన్న మీమాంసతో ఇన్వె‍స్టర్లున్నారు. మార్కెట్లో ర్యాలీ చేసే స్టాక్స్‌ మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాలని భావిస్తున్నారా..? అయితే, స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందుగా.. కంపెనీల ప్రమోటర్ల వాటా గణాంకాలపై ఓ సారి కన్నేయాల్సిందే. ఈ గణాంకాలు స్టాక్‌ ఎంపికలో మీకు సాయపడొచ్చు.    జూన్‌ త్రైమాసికం నుంచి సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి బీఎస్‌ఈ500 సూచీలోని 54 కంపెనీల్లో ప్రమోటర్ల

Most from this category