STOCKS

News


బీపీసీఎల్‌.. మళ్లీ ‘విదేశీ’ పరం!

Saturday 14th September 2019
news_main1568434633.png-28362

  • 53.3 శాతం వాటా విక్రయించనున్న కేంద్రం 
  • ఆసక్తి చూపుతున్న విదేశీ చమురు దిగ్గజాలు 
  • జాబితాలో సౌదీ ఆరామ్‌కో, బీపీ తదితర కంపెనీలు

న్యూఢిల్లీ: భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దేశంలోనే రెండో అతి పెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్‌ సం‍స్థ, బీపీసీఎల్‌లో తనకున్న నియంత్రిత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బీపీసీఎల్‌లో తన వాటా(53.3 శాతం)ను విదేశీ సం‍స్థలకు విక్రయించాలని, తద్వారా భారత ఇంధన రిటైల్‌ రంగంలోకి బహుళ జాతి సంస్థలను ఆకర్షించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రంగంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ రంగ సంస్థలే పెత్తనం చెలాయించాయని, దీనికి స్వస్తి చెప్పడానికి, మరోవైపు ఈ రంగంలో పోటీని పెంచడానికి ఈ చర్య ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. 

ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సంరలో 1,05 లక్ష కోట్ల నిధులు సమీకరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీపీసీఎల్‌లో వాటా విక్రయం కారణంగా ఈ లక్ష్యంలో 40 శాతం మొత్తాన్ని సమీకరించే అవకాశముందని అంచనా. (శుక్రవారం నాటి ముగింపు ధరతో పోల్చితే) అలాగే ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేసుకోవాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆర్థిక మందగమనం కారణంగా రెవెన్యూ వసూళ్లు తగ్గడంతో మౌలిక, సంక్షేమ పథకాలకు నిధుల లభ్యత దుర్లభమవుతోంది.  ఇలాంటి ప్రతికూల వాతావరణంలో బీపీసీఎల్‌ వాటా విక్రయం ఒకింత ఊరటనివ్వగలదని నిపుణుల అంచనా. 

ప్రారంభ స్థాయిలోనే చర్చలు ...
అయితే విదేశీ సంస్థకు వాటా విక్రయ చర్చలు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయని, ఈ చర్చలు పూర్తవ్వడానికి ఎంతకాలం పడుతుందో స్పష్టత లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్‌ను ఐఓసీకి విక్రయించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. అయితే బీపీసీఎల్‌ను కొనుగోలు చేయడానికి ఐఓసీ మళ్లీ నిధులు సమీకరించాల్సి రావడం తదితర తలనొప్పులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ ఆలోచనను అటకెక్కించింది. గతంలో హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌)లో తన వాటాను కేంద్రం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీకి విక్రయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఓఎన్‌జీసీ భారీగా నిధులను సమీకరించాల్సి వచ్చింది. ఇక బీపీసీఎల్‌ వాటా విక్రయానికి ఏ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుందో ఇంత వరకైతే స్పష్టత లేదని నిపుణులంటున్నారు. అయితే బీపీసీఎల్‌ ప్రైవేటీకరణకు పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంది. విదేశీ కంపెనీగా ఉన్న బర్మా షెల్‌ కంపెనీని కేంద్రం 1970లో జాతీయం చేసి బీపీసీఎల్‌గా పేరు మార్చింది. మళ్లీ బీపీసీఎల్‌ విదేశీ సంస్థల పరమయ్యే అవకాశాలుండటం విశేషం. 

భారత్‌పై చమురు దిగ్గజాల కన్ను ...
ఇక పలు బహుళ జాతి సంస్థలు భారత ఇంధన రిటైల్‌ రంగంపై ఆసక్తి చూపుతున్నాయి. సౌదీ ఆరామ్‌కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌ పీజేఎస్‌సీ, టోటల్‌  ఎస్‌, షెల్‌, ​బ్రిటిష్‌ పెట్రోలియమ్‌(బీపీ)లు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో ఇంధన డిమాండ్‌ 2040 కల్లా రెట్టింపవ్వగలదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది, వచ్చే ఏడాది... ఈ రెండేళ్లలో ప్రపంచంలోనే చమురుకు అత్యంత డిమాండ్‌ భారత్‌లోనే ఉండగలదని ఇటీవలే ఒపెక్‌ తన నెలవారీ ఆయిల్‌ డిమాండ్‌ నివేదికలో వెల్లడించింది. దీంతో భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చమురు బహుళ జాతి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విక్రయం ఆ సంస్థలకు ఆయాచిత వరంగా అందివచ్చింది. You may be interested

ఫార్మాను ఊరిస్తున్న మధ్యప్రాచ్య దేశాలు

Saturday 14th September 2019

టాప్‌-30 మార్కెట్లలో 3 దేశాలకు చోటు జూన్‌ ఎగుమతుల్లో 11 శాతం వృద్ధి ఈ ఏడాది రూ.1,54,000 కోట్ల ఎక్స్‌పోర్ట్స్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- భారత ఫార్మా రంగ సంస్థలకు మధ్యప్రాచ్య దేశాలు ఊరిస్తున్నాయి. 2018-19 టాప్‌-30 ఎక్స్‌పోర్ట్స్ మార్కెట్లలో మూడు మధ్యప్రాచ్య దేశాలు చోటు సంపాదించాయి. వీటిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 13వ స్థానం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ దేశానికి రూ.1,820 కోట్ల విలువైన ఎగుమతులు భారత్‌ నుంచి

అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌బీఐ చార్జీల్లో మార్పులు

Friday 13th September 2019

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ అక్టోబర్‌ 1 నుంచి పలు సేవల చార్జీల్లో సవరణలు తీసుకురానుంది. నగదు ఉపసంహరణలు, సగటు నెలవారీ బ్యాలన్స్‌ తదితర వాటిల్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కనుక ఎస్‌బీఐ ఖాతాదారులు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే...   ఎస్‌బీఐ ఖాతాదారులకు ఉపశమనం కల్పించే నిర్ణయంగా నెలవారీ కనీస బ్యాలన్స్‌ (ఏఎంబీ)ను తగ్గించడాన్ని చెప్పుకోవాలి. అక్టోబర్‌ 1 నుంచి పట్టణాల్లో సేవింగ్స్‌ ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌

Most from this category