STOCKS

News


కొందిరికి మోదం .. కొందరికి ఖేదం

Sunday 2nd February 2020
news_main1580614948.png-31417

మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను చూస్తే పదకొండేళ్ల కనిష్టానికి పడిపోయిన దేశ ఆర్ధిక వృద్ధిని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉంది. తాజా బడ్జెట్‌తో మళ్లీ ఒకప్పటి ఆర్థిక పరిపుష్టత సాధనపై కేంద్రం దృష్టి పెట్టిందనే అభిప్రాయం కలుగుతోంది. ఆదాయాలు, కొనుగోలు శక్తి పెంపుదలే ప్రస్తుత బడ్జెట్‌ లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదనలు కొన్ని రంగాలకు ఆశలు రేకెత్తిస్తే, మరికొన్నిటికి నిరాశ మిగిల్చాయి. ఈ బడ్జెట్‌తో ఎవరు లబ్ధి పొందే అవకాశం ఉంది, ఎవరిపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చనే అంశాలు ఒకసారి పరిశీలిస్తే..

లబ్ధికి అవకాశం ఉన్న రంగాలు

రవాణా మౌలిక సదుపాయాలు:
రవాణా మౌలిక సదుపాయాలకు రూ.1.7 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా సీతారామన్‌ దేశంలో రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. దీంతో కీలక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ లబ్ధి పొందే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఎలక్ట్రానిక్స్‌ తయారీ:
మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, సెమీ కండక్టర్ల తయారీ, అదే విధంగా వైద్యోపకరణాల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం భావించింది. ఇది ఆయా తయారీ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే అంశమని ఇండియా నివేష్‌లో ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అధిపతి వినయ్‌ పండిట్‌ చెప్పారు.
గ్రామీణ భారతం:
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు కేటాయించారు. అదే సమయంలో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.15 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. అలాగే మత్స్య పరిశ్రమల విస్తరణతో పాటు, 500 మత్స్యకార ఉత్పత్తి సంస్థలను నెలకొల్పాలనే ప్రభుత్వ ప్రతిపాదనల వల్ల ఆయా సంస్థలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎయిర్‌ కండిషన్డ్‌ ఫ్రైట్‌ కార్స్‌తో కూడిన రైలు సర్వీసులు అందుబాటులోకి తెస్తామని, వేర్‌ హౌసింగ్‌కు నిధులు సమకూరుస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించిన నేపథ్యంలో కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ అత్యధికంగా లబ్ధి పొందేందుకు రంగం సిద్ధమయ్యింది. 
నీళ్లు:
నీటి సమస్య ఉన్న జిల్లాల్లో వ్యవసాయ రంగ వృద్ధికి తోడ్పడే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించిన నేపథ్యంలో.. నీరు, మురుగు శుద్ధి ప్లాంట్లను డిజైన్‌ చేయడంతో పాటు నిర్మించే సంస్థల షేర్లు పుంజుకునేందుకు అవకాశం ఏర్పడింది. రైతులు సౌర మోటార్‌ పంపులు ఏర్పాటు చేసుకునేందుకు సహాయపడేలా చేసిన ప్రతిపాదనలు ఆయా కంపెనీలకు లబ్ధి చేకూర్చనున్నాయి. ఇక 2024 కల్లా దేశంలోని ఇళ్లన్నిటికీ పైపు నీటి సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇందుకోసం రూ.3.6 లక్షల కోట్ల నిధులు సమకూర్చుతామని తెలిపింది. దీంతో ఈ రంగానికి చెందిన సంస్థలు లబ్ధి పొందనున్నాయి. స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు ఆర్థిక మంత్రి రూ.12,300 కోట్లు ప్రకటించడం పలు సంస్థలకు ప్రయోజనం చేకూర్చనుంది. 
టెల్కోస్‌:
గ్రామాలకు బ్రాడ్‌ బ్యాండ్‌ను అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం భారత్‌ నెట్‌ (భారత్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌)ను మరింత అభివృద్ధి చేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీని కోసం ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించనుంది. దీంతో సంబంధిత పరిశ్రమలు పుంజుకోనున్నాయి.
ఆన్‌లైన్‌ విద్య:
రూ.99,300 కోట్లు కేటాయించడం ద్వారా ప్రస్తుత బడ్జెట్‌లో విద్యకు పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ విద్యా కార్యక్రమాలు పెద్దయెత్తున నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆన్‌లైన్‌ విద్యను అందిస్తున్న సంస్థలు లబ్ధి పొందే అవకాశం ఏర్పడింది. 
ఐటీ సంస్థలు:
డేటా సెంటర్‌ పార్కులు నెలకొల్పేందుకు ప్రైవేటు రంగాన్ని అనుమతించాలనే విధాన ప్రకటనతో పెద్ద, మధ్య తరహా ఐటీ కంపెనీలు లబ్ధి పొందేందుకు అవకాశం ఏర్పడింది. జాతీయ గ్యాస్‌ గ్రిడ్‌ను 16,200 కిలోమీటర్ల నుంచి 27,000 కిలోమీటర్లకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించడంతో సంబంధిత సంస్థలకు మంచి అవకాశం లభించనుంది.

ప్రతికూల ప్రభావం

బీమా కంపెనీలు:
ఇక ప్రస్తుత బడ్జెట్‌ ప్రతికూల ప్రభావం చూపించేందుకు అవకాశం ఉన్న సంస్థలను పరిశీలిస్తే.. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో కొంత వాటాను విక్రయించాలనే ప్రభుత్వ యోచనతో ప్రైవేటు జీవిత బీమా కంపెనీల షేర్లు పతనమయ్యాయి. 
ప్రభుత్వ రంగ బ్యాంకులు:
2020-21లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్తగా మూలధనాన్ని సమకూర్చడంపై ఆర్థిక మంత్రి మౌనం వహించారు. ఒకవేళ తాజా మూలధనం కనుక సమకూర్చకపోతే.. ఇలా జరగడం మోదీ ప్రభుత్వ హయాంలో ఇదే తొలిసారి అవుతుంది. దీని ప్రభావం పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లపై పడవచ్చు. 
రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగం:
రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు వారు డిమాండ్‌ చేస్తున్నట్టుగా మంత్రి ఏ విధమైన ప్రత్యేక చర్యలు ప్రకటించలేదు. దీంతో పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల షేర్లు పడిపోయాయి. మధ్యతరగతి వారి కొనుగోలు శక్తిని పెంపొందించేలా చేసిన వ్యక్తిగత పన్ను రేట్ల కోత ప్రతిపాదన, గృహ నిర్మాణానికి ఊతమిచ్చే పన్ను ప్రయోజనాల కొనసాగింపు వంటివి రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపు నివ్వడంలో విఫలమయ్యాయి.
ఎరువుల కంపెనీలు:
ప్రోత్సాహకాల్లో మార్పుతో రసాయనిక ఎరువుల వినియోగాన్ని సమతూకం చేసేందుకు సీతారామన్‌ చేసిన ప్రతిపాదన ఎరువుల కంపెనీలకు శరాఘాతంలా తగిలింది. ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించే జీరో బడ్జెట్‌ వ్యవసాయంపై మళ్లీ దృష్టి సారిస్తామని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆయా నిర్ణయాలు ఎరువుల కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.
లాజిస్టిక్స్‌:
ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న జాతీయ లాజిస్టిక్స్‌ విధానం ప్రకటన ఆలస్యం కావడం ప్రధాన లాజిస్టిక్‌ సంస్థలకు తీవ్ర నిరాశను మిగిల్చింది.   You may be interested

మోదీ సర్కారు ‘వృద్ధి’ మంత్రం!

Sunday 2nd February 2020

ఇటు వేతనజీవులు అటు కార్పొరేట్లను మెప్పించే తంత్రం వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు, శ్లాబుల్లో భారీ మార్పులు కంపెనీలపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను పూర్తిగా తొలగింపు.... పడిపోతున్న వృద్ధిరేటుకు ఊతమిచ్చేలా వ్యయాన్ని పెంచాలని నిర్ణయం రాబడులు తగ్గడంతో ద్రవ్యలోటు అదుపుతప్పినా వెరవని వైనం ప్రభుత్వ ఖజానాకు చిల్లు.. ‘ఎల్‌ఐసీ’తో చెల్లు.. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా ఎల్‌ఐసీలో వాటా విక్రయానికి సై తద్వారా పెద్దమొత్తంలో నిధుల సమీకరణకు ప్రణాళిక... వ్యవసాయం, మౌలికవసతుల రంగాలకు భారీగా కేటాయింపులు రైల్వేల్లో మరింతగా ‘ప్రైవేటు’ కూతకు పచ్చజెండా విద్య, వైద్యంలో

విమానయాన రంగానికి రూ.3,797 కోట్లు

Sunday 2nd February 2020

న్యూఢిల్లీ :  పౌర విమానయాన రంగానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.3,797 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌ కంటే ఇది 2.62శాతం అధికం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో  ఈ రంగానికి రూ.3,700 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి, రాష్ట్ర్రపతి, ఉప రాష్ట్రపతి ప్రయాణాల కోసం  రెండు బి777 విమానాలను కొనుగోలు చేయడానికి రూ.810 కోట్లు  కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చి చూస్తే ఇది రూ.272 కోట్లు ఎక్కువ.  ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర్రపతి

Most from this category