STOCKS

News


భారత్‌పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్‌!

Thursday 10th October 2019
news_main1570680532.png-28794

- ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా
- ఒకేసారి మందగమనంలోకి
 జారిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
- 90 శాతం ప్రపంచ వృద్ధిపై ప్రభావం

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఆర్థిక మందగమన ప్రభావం భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒక్కింత ఎక్కువగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు ఒకేసారి మందగమనంలోకి జారిన పరిస్థితులను మనం చూస్తున్నామని పేర్కొన్నారు. అంటే ప్రపంచ ఆర్థిక వృద్ధి 90 శాతం ఈ ఏడాది మందగమనంలోకి జారిపోనుందని వివరించారు. ఇంకా చెప్పాలంటే, వృద్ధి రేటు ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలను చూడనుందని తెలిపారు. 2019, 2020 వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ వచ్చే వారంలో విడుదల కానుందని పేర్కొన్న ఆమె, ఈ అవుట్‌లుక్‌లో వృద్ధి రేట్ల అంచనాలకు కోత పడే అవకాశం ఉందనీ సూచించారు. వచ్చేవారం ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంక్‌ వార్షిక సమావేశం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఇక్కడ కీలక ముందస్తు ప్రసంగం ఒకటి చేశారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

- పలు దేశాల ఆర్థిక గణాంకాలను చూస్తే, క్లిష్టమైన పరిస్థితి కనిపిస్తోంది.
- మొత్తంగా వృద్ధి మందగమనం ఉన్నప్పటికీ, 40 వర్థమాన దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతం పైనే ఉంది. ఆయా దేశాల్లో 19 సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలూ ఉన్నాయి. 
- అమెరికా, జర్మనీల్లో నిరుద్యోగ సమస్య తగ్గింది. అయితే అమెరికాసహా జపాన్‌, యూరో ప్రాంత దేశాల్లో ఆర్థిక క్రియాశీలత మందగమనంలోనే ఉంది.
- భారత్‌, బ్రెజిల్‌ వంటి కొన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలపై ఈ ఏడాది మందగమన నీలినీడల ప్రభావం కొంచెం తీవ్రంగానే ఉండనుంది. చైనాను తీసుకుంటే పలు సంవత్సరాలుగా వృద్ధి క్రమంగా మందగమనంలోకి జారింది. 
- పలు దేశాలు ఇప్పటికే ఆర్థిక తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం ఆర్థిక స్థిరత్వం పటిష్టత లక్ష్యంగా ద్రవ్య, పరపతి విధానాలను అనుసరించాలి.  తక్కువ వడ్డీరేట్ల ఆర్థిక వ్యవస్థల్లో అదనపు నిధలు వ్యయాలకు కొంత అవకాశం ఉంది. 
- వ్యవస్థాగత సంస్కరణలతో ఉత్పాదకత పెంపు తద్వారా ఆర్థిక క్రియాశీలత మెరుగుదలకు అవకాశం ఉంది. తద్వారా అధిక వృద్ధి సాధించడం అవసరం. దీనిపై ఆయా ఆర్థిక వ్యవస్థలు మదింపు జరుపుకోవాలి. 
- ప్రపంచ ఆర్థిక వృద్ధి విషయంలో అంతర్జాతీయ పరస్పర సహకారం అవసరం. వాణిజ్య సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ఇదే సమయంలో అక్రమ ధనార్జన, తీవ్రవాదానికి ఆర్థిక సహకారం వంటి ప్రతికూలాంశాలకు అడ్డుకట్టవేయాలి. 
- ఇక వాతావరణ మార్పులు ఆందోళనకు కారణమైన ఒక అంశం. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో సమస్య పరిష్కార దిశలో పనిచేయాలి. కాలుష్య నియంత్రణకు ప్రతి దేశం తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కార్బన్‌ ఉద్ఘారాల నియంత్రణలకు సగటున టన్నుకు 2 డాలర్లు వెచ్చించాలి. అయితే వ్యయాలు ఈ స్థాయిలో లేవు. 
- బెల్జియం ఆర్థికవేత్త క్రిస్టాలినా జార్జివా గత నెల్లో ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు ఒక వర్థమాన దేశానికి చెందిన ఆర్థికవేత్త చీఫ్‌గా నియమితులు కావడం ఇదే తొలిసారి. You may be interested

పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్‌!

Thursday 10th October 2019

అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో 68వ స్థానం క్రితం ఏడాది 58వ స్థానం నంబర్‌ 1 స్థానానికి సింగపూర్‌ రెండో స్థానానికి వెళ్లిపోయిన అమెరికా న్యూఢిల్లీ: అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్‌ వెనుకబడింది.  అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన ‘గ్లోబల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌’లో క్రితం ఏడాది 58వ స్థానంలో నిలిచిన భారత్‌, ఈ ఏడాది 68కి పరిమితమైంది. ప్రధానంగా ఇతర ఆర్థిక వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉండడం భారత్‌ వెనక్కి వెళ్లిపోవడానికి కారణం. కొలంబియా, దక్షిణాఫ్రికా,

కస్టమర్లకు జియో షాక్‌..

Thursday 10th October 2019

- ఇతర నెట్‌వర్క్‌లకు కాల్‌ చేస్తే ఇకపై చార్జీల విధింపు - నిమిషానికి ఆరు పైసలు వడ్డన - కాల్ టెర్మినేషన్ నిబంధనలే కారణమంటూ వివరణ న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ సదుపాయం అందిస్తున్న టెలికం సంస్థ రిలయన్స్ జియో (జియో) తాజాగా చార్జీల వడ్డనకు తెరతీసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది.

Most from this category