News


ఫెడ్‌ నిర్ణయం, వాణిజ్య చర్చలే కీలకం..

Monday 17th June 2019
news_main1560748248.png-26334

  •  బుధవారం వెల్లడికానున్న ఫెడ్‌ వడ్డీరేట్ల నిర్ణయం
  • గురువారం ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి
  • ఈవారంలోనే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం
  • వాణిజ్య యుద్ధం, ముడిచమురుపై ఇన్వెస్టర్ల దృష్టి

ముంబై: ఎన్నికల ర్యాలీ అనంతరం పరిమిత శ్రేణిలో కదలాడుతున్న దేశీయ స్టాక్‌ సూచీలు.. ఇక్కడ నుంచి ఏదిశగా ప్రయాణించనున్నాయనే అంశానికి అంతర్జాతీయ పరిణామాలే కీలకమని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈవారంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశంకానుండగా.. వడ్డీరేట్ల కోతకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనే అంశంపైనే ప్రధానంగా మార్కెట్‌ గమనం ఆధారపడిఉందని అంచనావేస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో సమావేశంకానున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ).. బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఉద్యోగాల వృద్ధి, రిటైల్ అమ్మకాల వంటి గణాంకాల ఆధారంగా ఈసారి వడ్డీరేట్లు తగ్గేందుకు ఆస్కారం లేదని మార్కెట్‌ వర్గాలు అంచనాకడుతున్నాయి. అయితే, ఇందుకు భిన్నంగా ఎఫ్‌ఓఎంసీ మెతక వైఖరితో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించేందుకు 33 శాతం అవకాశం ఉందని సీఎంసీ గ్రూప్‌ ఫెడ్‌ వాచ్‌టూల్‌ ఆధారంగా తెలుస్తోంది. ‘భవిష్యత్ అంచనాలకంటే తక్కువ ఆర్థిక వృద్ధి నమోదుకావడం.. పెరుగుతున్న నిరుద్యోగ ప్రయోజనాలు, బడ్జెట్ లోటు వంటి అంశాల నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీరేట్ల కోత నిర్ణయం తీసుకోవాలనే సూచనలు పెరిగాయి’ అని ఆనంద్‌ రాఠీ రీసెర్చ్‌ అనలిస్ట్‌ జిగర్ త్రివేది అన్నారు. ఈనెల్లో వడ్డీ రేట్లు తగ్గించపోయినప్పటికీ.. మెతక వైఖరిని ప్రదర్శిస్తే ఇది జూలైలో రేట్ల కోతకు సంకేతంగా ఉండనుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ విశ్లేషకులు అమిత్‌ గుప్తా అన్నారు.

ఈవారంలోనే ఆర్‌బీఐ మినిట్స్‌...
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈనెల 6న ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిర్వహించగా.. ఇందుకు సంబంధించిన మినిట్స్‌ను ఈనెల 20న (గురువారం) విడుదలచేయనుంది. భవిష్యత్ రేట్ నిర్ణయాల పరంగా కేంద్ర బ్యాంక్‌ ఏవిధంగా ఉండనుందనే అంశం ఈ మినిట్స్‌ ద్వారా వెల్లడయ్యే అవకాశం ఉన్నందున మార్కెట్‌ వర్గాలు ఈ అంశంపై మరింత దృష్టిసారించాయి.

అమెరికా వస్తువులపై సుంకాలు పెంచిన భారత్‌..
భారత్‌ నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఇటీవలే అమెరికా ప్రభుత్వం పన్నులు విధించిన విషయం తెలిసిందే కాగా, ఇందుకు ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే 28 వస్తువులపై భారత్‌ భారీగా సుంకాలు పెంచింది. పలు వస్తువులపై సుంకాన్ని 30 శాతం ఏకంగా 120 శాతానికి పెంచి.. ఆదివారం నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరితే ఇది మార్కెట్‌ పతనానికి దారితీసేందుకు ఆస్కారం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. 

జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ఈవారంలోనే..
గురువారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంకానుంది. బిజినెస్‌ టూ బిజినెస్‌ (బీ2బీ) అమ్మకాలకు సంబంధించి ఈ-ఇన్వాయిస్ టర్నోవర్‌ పరిమితిని ఈ సమావేశంలో ప్రకటించనుంది. ఇన్వాయిస్ దుర్వినియోగం, పన్ను ఎగవేతలను అరికట్టడం వంటి చర్యల్లో భాగంగా ఈ పరిమితి రూ.50 కోట్లుగా ఉండేందుకు అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. కౌన్సిల్‌ నిర్ణయాలు పలు రంగాల షేర్లపై ప్రభావం చూపనున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి..
మార్చితో ముగిసిన త్రైమాసికానికి కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్‌ సోమవారం.. జూన్ 14 తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వల డేటా, జూన్‌ 7నాటికి డిపాజిట్ & బ్యాంక్ రుణాల వృద్ధి సమాచారం శుక్రవారం వెల్లడికానున్నాయి.

ముడిచమురు ధరల ప్రభావం..
గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో చమురు ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్‌ వారాంతాన ఒకశాతం పెరిగి 62.01 వద్ద ముగిసింది. అయితే, వారం మొత్తం మీద చూస్తే.. 2 శాతం పతనమైంది. ఇక ఈ నెల చివరి వారంలో వియన్నాలో ఒపెక్‌ సమావేశం ఉన్నందున ఈవారంలో భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని జిగర్ త్రివేది విశ్లేషించారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం సెంటిమెంట్‌ను దెబ్బతీసే అంశంగా ఉందన్నారు. 

జూన్‌లో రూ.11,132 కోట్ల విదేశీ పెట్టుబడులు
భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. జూన్‌లో ఇప్పటివరకు వీరు రూ.11,132 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 3-14 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ.1,517 కోట్లు.. డెట్‌ మార్కెట్లో రూ.9,616 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. ఈ ఏడాది మేలో రూ.9,031 కోట్లు, ఏప్రిల్‌లో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు పెట్టుబడిపెట్టారు. ఎన్‌డీఏ ఘన విజయం, అమెరికా ఫెడ్‌ మెతక వైఖరి కారణంగా భారత మార్కెట్లలోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీ కే విజయకుమార్‌ అన్నారు. వాణిజ్య యుద్దం సమసిపోయే సూచనలు మొదలైతే ఈ పెట్టుబడుల ప్రవాహం మరింత ఊపందుకుంటుందని విశ్లేషించారు. You may be interested

సెన్సెక్స్‌ కీలక మద్దతు 39,200 పాయింట్లు

Monday 17th June 2019

అమెరికా....వివిధ దేశాలతో జరుపుతున్న వాణిజ్య యుద్ధాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతూ ఉండగా, ఈ అంశానికి తోడు ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సంక్షోభం, కార్పొరేట్‌ డిఫాల్ట్‌లు, కార్పొరేట్‌ దుర్వినియోగాలతో దేశీయ సూచీలు గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. కానీ, మరో రెండు వారాల్లో కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు పార్లమెంట్‌ ముందుకు రానున్న నేపథ్యంలో బడ్జెట్‌ ర్యాలీకి బీజం పడుతుందో ? లేక అంతర్జాతీయ, దేశీయ ప్రతికూలాంశాలకు మార్కెట్‌ తలొగ్గుతుందో

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 17th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఆస్టర్‌ డీఎం:- ఇక్రా రేటింగ్‌ సంస్థ రుణ రేటింగ్‌ ఎ(-) నుంచి బిబిబి(+)కు పెంచింది. కంపెనీ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి పాజిటివ్‌కు సవరించింది. సింజన్‌ ఇంటర్నేషనల్‌:- 1:1 నిష్పత్తిలో షేర్లు బోనస్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.  భెల్‌:- గుజరాత్‌ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్‌, ఎన్‌టీపీసీ సంస్థల నుంచి రూ.800ల కోట్ల విలువైన రెండు మౌలిక ప్రాజెక్ట్‌లను దక్కించుకుంది. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌:- గుజరాత్‌ పొల్యూషన్‌ బోర్డు

Most from this category