News


ఐపీఓ నిధులు.....నాలుగేళ్ల కనిష్టానికి

Thursday 4th July 2019
news_main1562225023.png-26790

-ఈ ఏడాది తగ్గిన ఐపీఓల జోరు 
-తొలి ఆరు నెలల్లో  8 ఐపీఓలు 
-రూ.5,509 కోట్లు సమీకరణ 
-ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి

ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)ల జోరు ఈ ఏడాది అర్థభాగంలో అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఏడాది జనవరి-జూన్‌ కాలానికి 8 కంపెనీలు(ఇటీవలే ముగిసిన ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ను కూడా కలుపుకుంటే) రూ.5,509 కోట్లు సమీకరించాయి. ప్రతి ఏడాది తొలి ఆరునెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే  ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి. 2015లో కూడా జనవరి-జూన్‌ కాలంలో 8 కంపెనీలు రూ.3,849 కోట్లు మాత్రమే సమీకరించాయి. ఇక గత ఏడాది తొలి ఆరు నెలల కాలంలో మొత్తం 18 కంపెనీలు రూ.23,452 కోట్ల మేర నిధులు సమీకరించాయి. 

సెంటిమెంట్‌ బలహీనం...
మార్కెట్‌ సెంటిమెంట్‌ అంతంతమాత్రంగానే ఉండటంతో ఐపీఓల జోరు పెద్దగా లేదని నిపుణులంటున్నారు. మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ సెగ్మెంట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. ఎన్నికల కారణంగా అనిశ్చితి చోటు చేసుకోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంతో పలు కంపెనీలు ఐపీఓలకు దూరంగా ఉన్నాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు కొత్త కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపరనే ఉద్దేశంతో కంపెనీలు కూడా ఐపీఓలపై ఆసక్తి చూపలేదు. మరీ ముఖ్యంగా వినియోగ రంగంలో మందగమనం చోటు చేసుకోవడం కూడా తీవ్ర ప్రభావమే చూపించింది. నరేంద్ర మోదీ భారీ మెజిరిటీతో మళ్లీ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఈ నెల 4న సెన్సెక్స్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, 40,312ను తాకింది. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 2 శాతం పతనమైంది. మరోవైపు ఈ ఏడాది జనవరిలోనే బీఎస్‌ఈ మిడ్‌-క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు తమ తమ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అప్పటి నుంచి చూస్తే, జూన్‌లో ఈ సూచీలు 20-30 శాతం మేర పతనమయ్యాయి. ముడి చమురు ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకోవడం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ​ఉద్రిక్తతల నివారణ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, తాజాగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగడం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. 

జూలై నుంచి జోరుగా...
ఈ ఏడాది రెండో అర్థభాగంలో ఐపీఓల జోరు పెరుగుతుందని నిపుణులంటున్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం నెలకొనడంతో సంస్కరణలు కొనసాగుతాయనే అంచనాలు బలపడ్డాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. వృద్ధి జోరును పెంచే చర్యలు బడ్జెట్‌లో ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయని, ఫలితంగా ఐపీఓల జోరు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా 56 కంపెనీలు ఐపీఓల కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి ఆమోదాలు పొందాయి. ఈ కంపెనీలన్నీ కలిసి రూ.54,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నాయి. మరోవైపు ఏడు కంపెనీలు ఐపీఓ ఆమోదాల కోసం సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ కంపెనీలు రూ.13,300 కోట్లు​ సమీకరించనున్నాయి. 

 You may be interested

ఎవరి రూటు వారిదే!!

Thursday 4th July 2019

కాలాన్ని బట్టి మారుతున్న బడ్జెట్లు సంక్షేమ పథకాలపైనే కాంగ్రెస్‌ ఫోకస్‌ ఎన్డీయే పాలనలో పన్ను సంస్కరణలు న్యూఢిల్లీ: కాలంతో పాటు బడ్జెట్‌ లక్ష్యాలు కూడా మారిపోతున్నాయి. 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు చూస్తే అప్పటి ప్రభుత్వ ప్రాధమ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. 1991 నుంచి బడ్జెట్‌లను గమనిస్తే.. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేయగా, ఆ తర్వాత 2000 నుంచి 2010 మధ్య కాలంలో ద్రవ్య స్థిరీకరణకు

మార్కెట్లోకి ‘ఎల్‌జీ’ సీలింగ్‌ ఫ్యాన్లు

Thursday 4th July 2019

ప్రారంభ ధర రూ.13,990 వై-ఫైతో నియంత్రించగలిగిన టెక్నాలజీ చెన్నై: దక్షిణ కొరియాకు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ.. ‘సీలింగ్ ఫ్యాన్’ విభాగంలోకి ప్రవేశించింది. తొలుత చెన్నైలో విక్రయాలను ప్రారంభించింది. ప్రీమియం శ్రేణిలో మొత్తం ఐదు ఫ్యాన్లను ఇక్కడ విడుదల చేయగా.. వీటి ప్రారంభ ధర రూ.13,990గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. త్వరలోనే వీటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ నోయిడాలోని ఎల్‌జీ ఇండియా ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేస్తోంది. వై- ఫై

Most from this category