News


2019: ఐపీఓ నిధుల సమీకరణ. అంతంతే !

Friday 27th December 2019
news_main1577417945.png-30465

  • మందగమనం ప్రభావం 
  • ఈ ఏడాది 60 శాతం తగ్గిన ఐపీఓ నిధులు 
  • మెరుగుపడ్డ  ఓఎఫ్‌ఎస్‌ 
  • అధ్వానంగా డిజిన్వెస్ట్‌మెంట్‌
  • ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడి 


ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న ప్రభావం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిధుల సమీకరణపై పడింది. ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు 60 శాతం మేర తగ్గాయి. గత ఏడాది ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్లుగా ఉన్న ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ ఈ ఏడాది రూ.12,362 కోట్లకు తగ్గింది. గత ఏడాది 24 కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ ఏడాది 16 కంపెనీలే ఐపీఓకు వచ్చాయి. ఈ వివరాలను క్యాపిటల్‌ మార్కెట్‌ సంబంధిత గణాంకాలను అందించే ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించింది. మరిన్ని వివరాలు....

  • ఈ ఏడాది క్యూ2 జీడీపీ ఏడేళ్ల కనిష్ట స్థాయి, 4.5 శాతానికి పడిపోయింది. జీడీపీ మెరుగుపడుతున్న సూచనలు ఏమీ లేవు. రూ.51,000 కోట్ల సమీకరణ నిమిత్తం సెబీ ఆమోదం పొందిన 47 కంపెనీల ఐపీఓల గడువు తీరిపోవడం ఈ విషయాన్ని మరింతగా ప్రతిబింబిస్తోంది. 
  • ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ 60 శాతం తగ్గినా, ఆఫర్‌ ఫర్‌ సేల్(ఓఎఫ్‌ఎస్‌), క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ)ల ద్వారా నిధుల సమీకరణ మాత్రం మెరుగ్గానే ఉంది. ఈ రెండు మార్గాల ద్వారా గత ఏడాది వివిధ కంపెనీలు రూ.63,651 కోట్లు సమీకరించాయి. ఇది ఈ ఏడాది రూ.81,174 కోట్లకు పెరగింది. అయితే 2017తో పోల్చితే(రూ.1,60,032 కోట్లు) ఇది 49 శాతం తక్కువ. 
  • ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా స్టెర్లింగ్‌  అండ్‌ విల్సన్‌ సోలార్‌ నిలిచింది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.2,850 కోట్లు. 
  • ఈ ఏడాది వచ్చిన మొత్తం 16 ఐపీఓల్లో ఏడు కంంపెనీల ఐపీఓలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ ఐపీఓలు 10 రెట్లకు పైగా సబ్‌స్క్రైబయ్యాయి. 
  • ఐఆర్‌సీటీసీ ఐపీఓ 109 రెట్లు, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంక్‌ వంద రెట్లకు మించి సబ్‌స్క్రైబయ్యాయి. 
  • ఒక్క ఐపీఓ మాత్రం మూడు రెట్లకు మించి ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌కాగా, మిగిలిన ఐపీఓలు ఒకటి నుంచి మూడు రెట్ల రేంజ్‌లో ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి. 
  • లిస్టింగ్‌ లాభాల పరంగా చూస్తే, ఈ ఏడాది ఐపీఓలు అదరగొట్టాయి. ఇప్పటివరకూ 15 కంపెనీలు లిస్టింగ్‌ కాగా, వీటిల్లో ఏడు కంపెనీలు 10 శాతానికి మించి రాబడులనిచ్చాయి. 
  • లిస్టింగ్‌ లాభాల పరంగా చూస్తే, 128 శాతం లాభంతో ఐఆర్‌సీటీసీ అగ్రస్థానంలో నిలిచింది. సీఎస్‌బీ బ్యాంక్‌ 54 శాతం, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 51 శాతం, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ 34 శాతం, నియోజెన్‌ కెమికల్స్‌ 23 శాతం, పాలీక్యాబ్‌ 22 శాతం, ఆఫిల్‌​ 17 శాతం చొప్పున లాభాలనిచ్చాయి. 
  • ఐపీఓకు వచ్చిన కంపెనీల షేర్లు వాటి ఇష్యూ ధరల కంటే దిగువకు పడిపోవడం గత కొన్నేళ్లో పరిపాటిగా ఉండేది. ఈ ఏడాది దీనికి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో రెండు కంపెనీల షేర్లు మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. మిగిలిన 13 కంపెనీల షేర్లు 21-170 శాతం రేంజ్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి. 
  • ఈ ఏడాది ఐపీఓ నిధుల సమీకరణ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రమోటర్లు బాగానే లాభపడ్డారు.  2018లో ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.10,672 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.25,811 కోట్లు వచ్చాయి. 
  • ఇక క్యూఐపీ(క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌) ద్వారా 11 కంపెనీలు రూ.35,238 కోట్లు సమీకరించాయి. ఇది గత ఏడాది క్యూఐపీ నిధులు(రూ.16,587 కోట్లు) కంటే 112 శాతం అధికం. 
  • ఇక రీట్స్‌, ఇన్విట్స్‌ ద్వారా సమీకరించిన నిధులు 127 శాతం పెరిగాయి. 
  • ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌కు అంతగా కలిసిరాలేదు. ప్రభుత్వ వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా రూ.1,05,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటిదాకా రూ.17,744 కోట్లు (17 శాతం మాత్రమే) సమీకరించింది. 
  • ఈ ఏడాది ఐపీఓలు అంతంతమాత్రంగానే ఉన్నా, వచ్చే ఏడాది ఐపీఓలు ఆశావహంగానే ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ 21 కంపెనీలు ఐపీఓల కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం పొందాయి. ఈ కంపెనీలు రూ.18,700 కోట్లు సమీకరించనున్నాయి. మరో 13 కంపెనీలు సెబీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవి రూ.18,000 కోట్ల సమీకరించడం కోసం సెబీకి దరఖాస్తు చేశాయి.  


ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫార్మ్‌...ఐదేళ్ల కనిష్టం...
ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫార్మ్‌ మొదలై ఈ ఏడాదికి ఐదేళ్లు పూర్తవుతాయి. కానీ ఈ ఏడాది ఈ ప్లాట్‌ఫార్మ్‌పై ఐపీఓ కార్యకలాపాలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఈ ఏడాది 50 ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓలు రూ.621 కోట్లు మాత్రమే సమీకరించాయి. గత ఏడాది 141 ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓలు రూ.2,287 కోట్లు సమీకరించడం విశేషం. 



You may be interested

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌ 27-12-19

Friday 27th December 2019

దేశీ స్టాక్‌ మార్కెట్లలో వార్తల ఆధారంగా శుక్రవారం(27-12) కొన్ని స్టాక్స్‌ యాక్టివ్‌గా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా వార్తలలో నిలిచిన ఆయా కంపెనీల వివరాలు చూద్దాం. హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) నుంచి హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(HAM)లో రూ. 522 కోట్ల విలువైన రహదారి కాంట్రాక్టు లభించినట్లు మౌలిక సదుపాయాల సంస్థ హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ తెలియజేసింది. దీనిలో భాగంగా హార్యానాలోని రేవరీ బైపాస్‌ను నిర్మించవలసి ఉంటుందని

రిలయన్స్‌ రిటైల్‌ @ రూ. 2.4 లక్షల కోట్లు

Friday 27th December 2019

డిమార్ట్‌ కంటే డబుల్‌  షేర్ల మార్పిడి స్కీమ్‌ ఆధారంగా విలువ మదింపు  న్యూఢిల్లీ: రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ.2.4 లక్షల కోట్లు(3,400 కోట్ల డాలర్లు) అని అంచనా. రిలయన్స్‌ రిటైల్‌ వాటాదారుల కోసం రిలయన్స్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్‌ ఆధారంగా చూస్తే, రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ.2.4 లక్షల కోట్లుగా తేలుతుంది. దేశంలో అతి పెద్ద సూపర్‌ మార్కెట్‌  చెయిన్‌, డిమార్ట్‌ను ను నిర్వహించే అవెన్యూ

Most from this category