News


పన్నుల తగ్గింపునకు ఎఫ్‌పీఐల లాబీ యత్నాలు

Saturday 13th July 2019
news_main1562957892.png-27027

కేంద్ర బడ్జెట్‌లో అధిక ఆదాయ వర్గాల (సంపన్నులు) వారిపై ప్రభుత్వం ఆదాయపన్ను సర్‌చార్జీని పెంచేయడం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లనూ (ఎఫ్‌పీఐ) ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావమే బడ్జెట్‌ రోజు, ఆ తర్వాత ట్రేడింగ్‌ సెషన్‌లోనూ మార్కెట్లు భారీగా నష్టాలపాలవడం. ఎఫ్‌పీఐలు పెరిగిన పన్నుల భారాన్ని చూసి అమ్మకాలు దిగారన్నది విశ్లేషకుల అంచనా. అయితే, ఎఫ్‌పీఐలనే ఉద్దేశించి సర్‌చార్జీ పెంచలేదని, అధిక ఆదాయ వర్గాలు అందరికీ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. కానీ, ఎఫ్‌పీఐలు మాత్రం, ఈ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. భారత క్యాపిటల్‌ మార్కెట్ల పోటీతత్వాన్ని ఇది దెబ్బతీస్తుందన్నది వారి హెచ్చరికగా ఉంది.

 

రూ.2-5 కోట్ల మధ్య ఆదాయం కలిగిన వారి సర్‌చార్జీని 3 శాతానికి, రూ.5కోట్లకుపైగా ఆదాయం ఉన్న వారిపై 7 శాతానికి పెంచుతూ బడ్జెట్లో మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రతిపాదించారు. దీంతో అస్సెట్‌ మేనేజర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎంఆర్‌ఐ) అనే ఎఫ్‌పీఐల లాబీ, ప్రభుత్వ చర్య పెద్ద సైజు విదేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌పై ప్రభావం చూపిస్తుందని, స్థిరమైన పన్నుల వ్యవస్థగా భారత్‌కు ఉన్న పేరు దెబ్బతింటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు ‍ప్రభుత్వ నిర్ణయం ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ పోటీతత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో ఏఎంఆర్‌ఐ ప్రెసిడెంట్‌ నందితా అగర్వాల్‌ పార్కర్‌ తెలిపారు. 

 

అయితే, ఈ లేఖపై కేంద్ర ఆర్థిక శాఖ అధికార ప్రతినిధి మాత్రం స్పందించలేదు. అధిక సంపన్నులపై అదనపు సర్‌చార్జీ అన్నది దేశ నిర్మాణం విషయంలో వారి బాధ్యతను పెంచడం కోసమేనని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌సీ గార్గ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం గమనార్హం. అయితే, ఏఎంఆర్‌ఐ లాబీ యత్నాలు ఫలించేట్టుగా సంకేతాలు ఏవీ కనిపించడం లేదు. ఎందుకంటే ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రతిపాదనల విషయంలో చాలా కచ్చితత్వంతో, స్పష్టతతో ఉన్నారు. సర్‌చార్జీని తగ్గించేది లేదని, ఈ భారం తగ్గించుకోవాలనుకుంటే, ఎఫ్‌పీఐలు కార్పొరేట్‌ సంస్థలుగా నమోదు చేసుకుని, తక్కువ పన్ను రేట్ల ప్రయోజనం పొందొచ్చని ఆమె సూచన కూడా చేశారు. మనదేశంలో ప్రస్తుతం 9,400 ఎఫ్‌పీఐలు ట్రస్ట్‌లుగా ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. మిగిలిన ఎఫ్‌పీఐలు ఇప్పటికే కార్పొరేట్లుగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇరు వర్గాలు కలసి మన ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌ సాధనాల్లో 50 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేసి ఉన్నారు.

 

అధిక పన్ను రేట్లు కొంత మంది ఇన్వెస్టర్లను నిరుత్సాహపరచొచ్చని, ఈ రేట్లు వాటి మాతృ దేశాల్లో కంటే ఎక్కువని ఏషియా సెక్యూరిటీస్‌ ఇండస్ట్రీ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ అసోసియేషన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ యూజెనీషేన్‌ అన్నారు. ‘‘భారత్‌ ఇటీవలి కాలంలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఆకర్షించేందుకు ఎంతో చేస్తోంది. కానీ, ప్రస్తుత పన్ను పెంపు అన్నది ఆయా ప్రయత్నాలను దెబ్బతీస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉచిత సలహాకు అనుగుణంగా పన్నుల భారం తగ్గించుకునేందుకు ఎఫ్‌ఫీఐలు కార్పొరేట్లుగా మారితే, అప్పుడు తమ దేశంలో చట్టబద్ధమైన, పన్ను పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది పన్ను నిపుణుల విశ్లేషణ.You may be interested

మెప్పించిన ఇన్ఫీ!

Saturday 13th July 2019

- క్యూ1 లాభం రూ.3,802 కోట్లు; 5.2 శాతం వృద్ధి - ఆదాయం 13.9 శాతం అప్‌; రూ.21,803 కోట్లు - ఈ ఏడాది గైడెన్స్‌ పెంపు;  ఆదాయ వృద్ధి 8.5-10 శాతంగా అంచనా బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఆశావహ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2019-20, క్యూ1) కంపెనీ రూ.3,802 కోట్ల కన్సాలిడేటెడ్‌ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం

ఐదేళ్లలో 47 బిలియన్‌ డాలర్ల సమీకరణ!

Saturday 13th July 2019

ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం రూపంలో వచ్చే ఆదాయంపై కేంద్ర ‍ప్రభుత్వం ఆధారపడడం అంతకంతకూ పెరిగిపోతోంది. వచ్చే ఐదేళ్ల కాలలో ఏకంగా 47.4 బిలియన్‌ డాలర్లను (రూ.3.25 లక్షల కోట్లు) సమీకరించాలన్నది మోదీ సర్కారు ప్రణాళిక. ప్రభుత్వరంగ బ్లూచిప్‌ కంపెనీల్లో 40 శాతానికి వాటాలు తగ్గించుకోవడం ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోనుంది. రెండు దశాబ్దాల కాలంలో కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద ప్రైవేటైజేషన్‌గా దీన్ని పరిగణిస్తున్నారు. కొన్ని ప్రభుత్వరంగ కంపెనీల్లో

Most from this category