News


ఎయిరిండియా విక్రయం.. టేకాఫ్‌

Tuesday 28th January 2020
news_main1580179487.png-31245

(అప్‌డేటెడ్‌...)

  • 100 శాతం వాటా అమ్మకానికి సై...
  • బిడ్డింగ్‌ పత్రాన్ని విడుదలచేసిన కేంద్రం
  • ఆసక్తి వ్యక్తీకరణకు మార్చి 17 డెడ్‌లైన్‌...
  • రూ.23,287 కోట్ల అప్పు భరించాల్సిందే..
  • బిడ్డింగ్‌ నిబంధనల్లోనూ పలు మార్పులు

న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయి... ఎగరడానికి ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను పూర్తిగా వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని నిర్ణయించింది. బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక విధివిధానాలను సోమవారం విడుదల చేసింది. కొనుగోలుకు ముందుకొచ్చే సం‍స్థలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 17ను గడువుగా (డెడ్‌లైన్‌) నిర్ధేశించింది. బిడ్డింగ్‌ పత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం... చౌక ధరల ఎయిర్‌లైన్స్‌ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో తనకున్న 100 శాతం వాటాలను అదేవిధంగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్‌ వెంచర్‌(జేవీ) ఏఐఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం వాటాను కూడా ఎయిరిండియా విక్రయించనుంది. ఈ జేవీ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలందిస్తోంది. బిడ్డింగ్‌లో విజయం సాధించిన సంస్థకు ఎయిరిండియాతో పాటు ఈ మూడు సంస్థల్లో మొత్తం యాజమాన్య నియంత్రణను బదలాయించనున్నారు. 
వాటికి మాత్రం మినహాయింపు...
ఎయిరిండియాకు ఇతర అనుబంధ సం‍స్థల్లో కూడా వాటాలు ఉన్నాయి. ప్రధానంగా ఎయిరిండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, ఎయిరిండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌, ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీసెస్‌, హాటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాల్లో తనకున్న కీలకమైన వాటాలను మాత్రం తాజాగా ప్రతిపాదించిన వాటా అమ్మకం నుంచి మినహాయిస్తున్నట్లు బిడ్డింగ్‌ పత్రంలో పేర్కొంది. ఈ సంస్థల్లోని వాటాలను ప్రత్యేక సంస్థ ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(ఏఐఏహెచ్‌ఎల్‌)కు బదలాయించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. కాగా, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లకు ప్రస్తుతం ఉన్న రుణభారంలో రూ.23,287 కోట్లను వీటిని కొనుగోలు చేసే సంస్థలే భరించాల్సి ఉంటుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మిగిలిన రుణాన్ని(దాదాపు రూ.36,760 కోట్లు) ఏఐఏహెచ్‌ఎల్‌కు కేటాయించనున్నారు. మొత్తం బకాయిలు, రుణాలు కలిసి రూ.56,334 కోట్లను ఈ సంస్థకు బదలాయిస్తారు. దీంతో పాటు రూ.17,000 కోట్ల ఆస్తులు కూడా దీనికి దక్కుతాయి.
ఉద్యోగులకు ఎసాప్స్‌...
వ్యూహాత్మక వాటా విక్రయంలో భాగంగా ఎయిరిండియా ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌ ప్రోగ్రామ్‌(ఎసాప్స్‌) కింద తక్కువ ధర(డిస్కౌంట్‌)కు షేర్లను ఇవ్వనున్నట్లు ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న వర్గాల్లోని ఒక వ్యక్తి తెలిపారు. ఎయిరిండియా షేర్లలోని 3 శాతాన్ని(సుమారు 98 కోట్ల షేర్లు) ఎసాప్స్‌ కింద పక్కనబెట్టనున్నట్లు ఆయన వివరించారు. 2019 నవంబర్‌ 1 నాటికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో మొత్తం 17,984 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 9,617 మంది పర్మినెంట్‌ సిబ్బంది. ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాదాపు రూ.1,384 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. కాగా, ఈ వాటా అమ్మకం(డిజిన్వెస్ట్‌మెంట్‌) లావాదేవీలను అంతర్జాతీయ అడ్వయిజరీ సేవల సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌(ఈవై) నిర్వహించనుంది. ఎయిరిండియాలో అవసరానికి మించి సిబ్బంది ఎవరూలేరని.. రిటైర్‌ అయ్యే ఉద్యోగుల మెడికల్‌ ప్రయోజనాలకు సబంధించిన అంశాన్ని త్వరలోనే పరిష్కరించనున్నట్లు ఎయిరిండియా సీఎండీ ఆశ్వనీ లోహానీ పేర్కొన్నారు. ఇక ప్రతిపాదిత ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్‌ను చాలా పకడ‍్బందీగా చేపడుతున్నామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే చెప్పారు. 

అమ్మకానికి మూడోసారి...
ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదనను ప్రకటించడం గడిచిన రెండేళ్లలో ఇది రెండోసారి కావడం గమనార్హం. సంస్థలోని 76 శాతం వాటాను విక్రయించడంతోపాటు యాజమాన్య నియంత్రణను కూడా బిడ్డింగ్‌లో నెగ్గిన ప్రైవేటు సంస్థలకు కట్టబెడతామంటూ ప్రభుత్వం 2018లో తొలిసారిగా ప్రతిపాదించింది. అయితే, ఇందుకు బిడ్డర్లు ఎవరూ ముందుకురాకపోవడంతో తాజాగా 100 శాతం వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. కాగా, వాస్తవానికి 2001-02లోనే అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విడివిడిగా ఉన్నప్పుడే అమ్మకానికి ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. అంటే ప్రస్తుత ప్రతిపాదన మూడోసారిగా లెక్క.

నిబంధనల సడలింపు...
ఎట్టిపరిస్థితుల్లోనూ ఎయిరిండియాను అమ్మేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం తాజాగా బిడ్డింగ్‌ నిబంధనలను కూడా సడలించింది. ప్రధానంగా కొనుగోలుకు ముందుకొచ్చే బిడ్డర్లకు కనీస నెట్‌వర్త్‌(వ్యాపార విలువ)ను రూ.3,500 కోట్లుగా నిర్ధారించింది. అదేవిధంగా ఒకరుకంటే ఎక్కువమంది కన్నార్షియంగా బిడ్డింగ్‌ వేసేవారికి కూడా భాగస్వామ్య సంస్థకు కేటాయించాల్సిన కనీస వాటాను 10 శాతానికి తగ్గిస్తున్నట్లు బిడ్డింగ్‌ పత్రంలో పేర్కొంది. 2018లో అమ్మకం ప్రతిపాదన సందర్భంగా దీన్ని రూ.5,000 కోట్లు, 26 శాతంగా కేంద్రం నిర్ధేశించింది. కాగా, తాజా బిడ్డింగ్‌ ప్రకారం కన్సార్షియంలో ప్రధాన భాగస్వామ్య సంస్థ(లీడ్‌ మెంబర్‌)కు నెట్‌వర్త్‌లో 26 శాతం వాటా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇక కన్సార్షియంలో వ్యక్తులు(ఇండివిడ్యువల్స్‌) కూడా చేరొచ్చు. ఇక కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న బిడ్డర్లకు డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ముసాయిదా వాటా కొనుగోలు ఒప్పందంతో పాటు  ఎయిరిండియాకు చెందిన అన్ని రికార్డులను అందుబాటులో ఉంచనున్నట్లు బిడ్డింగ్‌ పత్రంలో పేర్కొన్నారు. అయితే ఇందుకు ఆయా సంస్థలు రూ. కోటిని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

ఎయిరిండియా ఎంతో విలువైంది...
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో కలిపితే ఎయిరిండియా అనేది చాలా విలువైనదని..  ‘గొప్ప ఆస్తి’గా పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వ్యాఖ్యానించారు. బిడ్డింగ్‌లో దీన్ని చేజిక్కించుకునే సంస్థ ఎయిరిండియా బ్రాండ్‌ను నిరాటంకంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎయిరిండియాకు ఉన్న మొత్తం భూములు, భవనాలు ఇతరత్రా స్థిరాస్తులతో పాటు పెయింటింగ్స్‌ తదితర కళాకృతులు ఈ అమ్మకంలోకి రావని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లోన్ని కొన్ని భవనాలు, స్థలాలు, కార్పొరేట్‌ ఆఫీసులను కొత్త ఇన్వెస్టర్లకు ఎయిర్‌లైన్‌ నిర్వహన నిమిత్తం కొంతకాలం పాటు వినియోగించుకోవడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ అమ్మకంపై బీజేపీకి చెందిన సుబ్రమణ్య స్వామి, యశ్వంత్‌ సిన్హా వ్యతిరేకతపై మాట్లాడుతూ.. వాళ్లిద్దరివీ వ్యక్తిగత అభిప్రాయాలన్నారు. ప్రభుత్వానికి దాంతో సంబంధం లేదన్నారు. ‘ఎయిరిండియా విక్రయం పూర్తిగా దేశ వ్యతిరేఖ చర్య. దీనిపై కోర్టుకెళ్తా’ అంటూ సుబ్రమణ్య స్వామి సోమవారం ట్వీట్‌ చేశారు.
 

  • ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లకు మార్చి 31, 2019 నాటికి ఉన్న మొత్తం రుణ భారం రూ.60,074 కోట్లుగా అంచనా. దీనికోసం ఏడాదికి రూ.4000 కోట్లకు పైగానే వడ్డీని ఇవి చెల్లిస్తున్నాయి.
  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా నిర్వహణ నష్టాలు రూ.4,800 కోట్లు.You may be interested

మారుతీ కార్ల ధరలు పెరిగాయ్‌

Tuesday 28th January 2020

మోడల్‌ ఆధారంగా రూ. 10,000 వరకు పెంపు న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచినట్లు సోమవారం ప్రకటించింది. మోడల్‌ ఆధారంగా రూ. 10,000 వరకు పెంచింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా పలు మోడళ్ల ధరలను పెంచుతున్నామని, ఈ పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గరిష్టంగా 4.7 వరకు పెంపు

5 శాతం పెరిగిన రుచీ సోయా

Monday 27th January 2020

లిస్టింగ్‌లో 5 శాతం పెరిగిన రుచీ సోయా పతంజలి గ్రూపుకు చెందిన రుచీ సోయా ఇండస్ట్రీస్‌ షేర్లు సోమవారం తిరిగి ట్రేడ్‌ అయ్యాయి. బీఎస్‌ఈలో 5 శాతం పెరిగి రూ.16.90 వద్ద లాక్‌ అయ్యాయి. 2017లో ఎన్‌సీఎల్‌టీ ప్రతిపాదనల మేరకు 2019 సెప్టెంబర్‌లో హరిద్వార్‌ కేంద్రంగా పనిచేస్తోన్న పతంజలి గ్రూపు చెందిన పతంజలి ఆయుర్వేద రూ.4,500 కోట్లకు రుచీ సోయాను సొంతం చేసుకుంది. 2017లో రుచీ సోయా కంపెనీ చార్టెడ్‌​ బ్యాంక్‌, డీబీఎస్‌

Most from this category