News


బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభం

Tuesday 21st January 2020
news_main1579576510.png-31062

  • సంప్రదాయ హల్వా రుచులతో
  • కీలక ఘట్టానికి శ్రీకారం
  • ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఫైనాన్స్‌ బిల్లు

న్యూఢిల్లీ: సాంప్రదాయక హల్వా రుచుల ఆస్వాదనతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021) బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్‌ 2020-21 ఫైనాన్స్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.  నరేంద్రమోదీ రెండవసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సమర్పిస్తున్న రెండవ బడ్జెట్‌ ఇది. ఫైనాన్స్‌ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌, రెవెన్యూ సెక్రటరీ అజయ్‌ భూషన్‌ పాండే, ఆర్థిక వ్యవహారాల ​కార్యదర్శి అతను చక్రవర్తి, డీఐపీఏఎం సెక్రటరీ తుహిన్‌ కాంత పాండే, వ్యయ వ్యవహారాల కార్యదర్శి టీవీ సోమనాథన్‌ తదితరులు హల్వా రుచుల ఆరగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

బయటి ప్రపంచంతో సంబంధాలు కట్‌...
కీలక హల్యా కార్యక్రమం అనంతరం బడ్జెట్‌ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడ్డానికి వీలుండదు.   నార్త్‌ బ్లాక్‌ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్‌ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది.

అంత గోప్యత ఎందుకు?
ఎంతో పకడ్బందీగా తయారయ్యే ఈ బడ్జెట్‌ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను  కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్‌ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్‌ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా  ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్‌ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్‌ కింద ఉండే బడ్జెట్‌ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్‌ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేస్తారు. అంతేకాక మొబైల్‌ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్‌ చేస్తారు.  అలాగే ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటుచేస్తారు. ఇక ఈ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పెద్ద ఎక్స్‌రే స్కానర్‌ను ఏర్పాటుచేసి, దానిని కంప్యూటర్‌తో అనుసంధానిస్తారు. ఈ పరికరాల వల్ల ఏ చిన్న వస్తువు తీసుకువెళ్తున్నా ఇట్టే తెలిసిపోతుంది. దీనివల్ల ఎలాంటి అవకతవకలకూ ఆస్కారం ఉండదు.  అలాగే బడ్జెట్‌ను ముద్రించే సమయంలో ఆర్థికశాఖ కార్యదర్శి... ప్రధానితోను, ఆర్థిక మంత్రితోను సమన్వయం చేస్తూ సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ముద్రణ సమయంలో అనునిత్యం ఐబీ అధికారులు, ఢిల్లీ పోలీసులు కునుకులేకుండా కాపలాకాస్తుంటారు. మధ్య మధ్యలో సెక్యూరిటీని పరీక్షించేందుకు ‘మాక్‌ డ్రిల్‌’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని గనుక సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు.  పార్లమెంటు ఆమోదం తెలపడంతో బడ్జెట్‌ అమల్లోకి వస్తుంది. 1947 నవంబర్‌ 26వ తేదీన ఆర్‌కే షణ్ముకం శెట్టి భారత్‌ తొలి బడ్జెట్‌ను సమర్పించారు.

మరికొన్ని ముఖ్యాంశాలు...

  • తొలినాళ్లలో రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్‌ డాక్యుమెంట్ల ముద్రణ జరిగేది. డాక్యుమెంట్లు 1950లో లీక్‌ అవడంతో ఈ ప్రక్రియను మింటో రోడ్‌కు మార్చారు. అటు తర్వాత 1980లో నార్త్‌బ్లాక్‌కు మార్చారు. 
  • 1999కు ముందు బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి తేదీ సాయంత్రం 5 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగేది. ఆర్థికమంత్రిగా యశ్వంత్‌ సిన్హా ఈ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. 2016లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి చివరితేదీ నుంచి మొదటితేదీకి మార్చారు. 
  • బడ్జెట్‌ ప్రసంగం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ఆర్థికవ్యవస్త,  ప్రధాన విధాన చొరవలు వంటి అంశాలతో ఉంటుంది. రెండవ భాగంలో పన్ను ప్రతిపాదనలు ఉంటాయి. అయితే వస్తు, సేవల పన్ను ప్రవేశపెట్టిన తర్వాత, రెండవ భాగంలో పన్నుల అంశాలు పరిమితమైపోయాయి. పలు పరోక్ష పన్ను ప్రతిపాదనల నిర్ణయాలను బడ్జెట్‌ వెలుపలే తీసుకుంటుండడం దీనికి కారణం. You may be interested

గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌ నేడు

Tuesday 21st January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 66 పాయింట్లు డౌన్‌ నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 66 పాయింట్లు పతనమై 12,200 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,266 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా ప్రపంచ ఆర్థిక

అమెజాన్‌ డెలివరీ విభాగంలోకి 10వేల ఎలక్ట్రిక్‌ వాహనాలు

Tuesday 21st January 2020

2025 నాటికి ప్రవేశపెడతామని ప్రకటన న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ అమేజాన్‌ ఇండియా తన డెలివరీ విభాగంలో 2025 నాటికి 10వేల ఎలక్ట్రిక్‌ వాహనాలను చేర్చుకోనుంది. ప్రయోగాత్మకంగా భారత్‌లోని పలు పట్టణాల్లో 2019లో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టామని, ఇప్పుడు దేశవ్యాప్తంగా డెలివరీ నెట్‌వర్క్‌లోకి మరిన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలను చేర్చుకోనున్నట్టు అమేజాన్‌ ఇండియా సోమవారం ప్రకటించింది. మూడు చక్రాలు, నాలుగు చక్రాల వాహనాలు ఇందులో ఉంటాయని పేర్కొంది. 2020లో హైదరాబాద్‌, బెంగళూరు, నాగ్‌పూర్‌,

Most from this category