News


తప్పనిసరై జాతీయం

Friday 19th July 2019
news_main1563521986.png-27175

- బ్యాంకుల జాతీయీకరణకు 50 ఏళ్లు
- వ్యవసాయం, చిన్న సంస్థలకు పెరిగిన రుణాలు
- నలు దిశలా విస్తరించిన బ్యాంకు శాఖలు
- అందరికీ అందుబాటులోకి బ్యాంకింగ్‌...
- ప్రభుత్వ అజమాయిషీతో తప్పుడు నిర్ణయాలు
- మొండిబాకీలతో కుదేలవుతున్న పీఎస్‌బీలు
- ప్రైవేటీకరణే సరైన పరిష్కారమంటూ సూచనలు!!

(సాక్షి, బిజినెస్‌ విభాగం)
సాగుకు రుణాల్లేవు. చిన్న సంస్థలను పట్టించుకునే వారే లేదు. అలాంటి దశలో బ్యాంకుల్ని జాతీయీకరించి... వాటి రుణ ప్రాధాన్యాలను పునఃనిర్వచించింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. చాలా వర్గాలు వద్దన్నాయి. ఆర్‌బీఐ కూడా సరికాదని చెప్పింది. అయినాసరే... 50 ఏళ్ల కిందట ఇందిర తను అనుకున్నదే చేశారు. ప్రత్యేక ఆర్డినెన్స్‌తో 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు. నిజానికి ఈ జాతీయీకరణ ఆశించిన మేర కొన్ని ప్రయోజనాలనైతే ఇచ్చింది. కానీ... ఆ ప్రయాణంలో బ్యాంకులు ప్రభుత్వం చేతిలో ఆటబొమ్మల్లా మారిపోయాయి. చివరికిపుడు శక్తికి మించిన మొండి బాకీల్ని మోస్తూ కుదేలవుతున్నాయి. చివరికి వీటిని ప్రైవేటీకరించాలన్న సలహాలూ వస్తున్నాయి. అంటే... మళ్లీ మొదలెట్టిన చోటికే చేర్చమని!!. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? జాతీయీకరణ ఎందుకు జరిగింది? ఇపుడు దారేంటి? వీటిన్నిటి సమాహారమే ఈ ప్రత్యేక కథనం...
బ్యాంకుల జాతీయీకరణ వెనక రాజకీయాలు పక్కనపెడితే ఇతరత్రా కారణాలూ ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన చాన్నాళ్ల దాకా బ్యాంకులు స్పెక్యులేటివ్, వాణిజ్య కార్యకలాపాలకు తప్ప ఎక్కువగా పరిశ్రమకు, వ్యవసాయ రంగానికి రుణాలివ్వటంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అటు నియంత్రణ సంస్థగా రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయింది. దీంతో 300 పైచిలుకు ఉన్న బ్యాంకులను అదుపు చేయడం కష్టంగా మారింది. 1960ల్లో పాలయ్‌ సెంట్రల్‌ బ్యాంక్, లక్ష్మి కమర్షియల్‌ బ్యాంక్‌ దివాలా తీయడంతో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ ఒత్తిడితో బ్యాంకుల సంఖ్యను తగ్గించడంపై ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. 1960లో 328 పైచిలుకు ఉన్న బ్యాంకుల సంఖ్యను విలీనాలు, మూసివేతలుతో 1965 నాటికి 94 స్థాయికి తెచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 1969 జూలై 19న కనీసం రూ.50 కోట్ల మేర డిపాజిట్లున్న బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దాని అనుబంధ బ్యాంకులతో పాటు 14 బ్యాంకులు ప్రభుత్వ రంగ పరిధిలోకి వచ్చాయి. అప్పటి బ్యాంకింగ్‌ రంగంలోని మొత్తం డిపాజిట్లలో వీటి వాటా ఏకంగా 85 శాతం!!. మళ్లీ 1980లో రూ.200 కోట్ల పైగా డిపాజిట్లున్న మరో 6 బ్యాంకులను జాతీయీకరించారు.
ఆర్‌బీఐని తోసిరాజని.. 
బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియలో ఆర్‌బీఐ గవర్నర్‌ను కూడా ప్రభుత్వం పెద్దగా లెక్క చేయలేదనే చెప్పాలి. ఇందిరా గాంధీతో పాటు ప్రధాని ప్రిన్సిపల్‌ కార్యదర్శి పీఎన్‌ హక్సర్, ఆర్‌బీఐ డెప్యూటీ గవర్నర్‌ ఎ.బక్షి, డీఎన్‌ ఘోష్‌ అనే జూనియర్‌ స్థాయి అధికారి మాత్రమే ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. ఆర్‌బీఐ వర్గాల కథనం ప్రకారం.. బ్యాంకులు అప్పటికే సమగ్రమైన సామాజిక నియంత్రణ పరిధిలో పనిచేస్తున్నాయని, వాటి జాతీయీకరణ వల్ల ఎలాంటి లాభం ఉండకపోగా ప్రభుత్వం, ఆర్‌బీఐపై అనవసర బాధ్యతలు పెరుగుతాయంటూ ఆర్‌బీఐ గవర్నరు ఎల్‌కే ఝా అప్పటికే ఒక నోట్‌ను సిద్ధం చేసుకుని ప్రధానికి తెలిపేందుకు వెళ్లారు. అయితే, ఆయన్ను చూసిన ప్రధాని ఇందిరాగాంధీ ‘మీ చేతిలో భారీ నోట్‌ ఏదో కనిపిస్తోంది. దాన్ని ఈ పక్కన టేబుల్‌ మీద ఉంచండి. పక్క గదిలో ప్రైవేట్‌ బ్యాంకుల జాతీయీకరణ ఆర్డినెన్స్‌పై కసరత్తు చేస్తున్న టీమ్‌కు కాస్త సాయం అందించండి‘ అని సూచించడంతో ఝా తప్పనిసరై ఆ ప్రక్రియలో భాగమయ్యారు.
బ్యాంకింగ్‌ విస్తరణకు ఊతం..
జాతీయీకరణకు ముందు 18 ఏళ్లతో (1951–1969) పోలిస్తే ఆ తర్వాత 18 ఏళ్ల కాలంలో బ్యాంకుల శాఖల సంఖ్య అయిదు రెట్లు పెరిగింది. 8,262 బ్రాంచీల నుంచి 53,840కి చేరాయి. 1969లో రూ.4,646 కోట్లుగా ఉన్న డిపాజిట్లు ఆ తర్వాత 18 ఏళ్లలో 200 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం బ్యాంకు శాఖల సంఖ్య 1,41,756కి, డిపాజిట్ల పరిమాణం రూ.125 లక్షల కోట్లకు చేరాయి. రుణాల పరిమాణమైతే రూ.3,599 కోట్ల నుంచి రూ. 96.5 లక్షల కోట్లకు పెరిగింది. జాతీయీకరణకు ముందు బ్యాంకులిచ్చే రుణాల్లో దాదాపు 78 శాతం పెద్ద, మధ్య స్థాయి పరిశ్రమలు, హోల్‌సేల్‌ వ్యాపారాలకే కాగా... వ్యవసాయం వాటా 2.2 శాతం మాత్రమే. 1969లో రూ.162 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు 2011 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరాయి. చిన్న పరిశ్రమలకు బ్యాంకు రుణాలు కూడా రూ.251 కోట్ల నుంచి రూ. 3.6 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకులిచ్చే మొత్తం రుణాల్లో ప్రాధాన్యతా రంగ రుణాల వాటా 1969లో 15 శాతంగా ఉంటే 2011 నాటికి 41 శాతానికి పెరిగింది. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమకు నిర్దేశించిన లక్ష్యాల సాధనలో మెరుగైన పనితీరే కనపర్చాయి. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జన్‌ ధన్‌ ఖాతాల్లో 80 శాతం అకౌంట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులే (పీఎస్‌బీ) ఇచ్చాయి. వ్యవసాయం, చిన్న తరహా సంస్థలకు ప్రాధాన్యతా రంగ రుణాల్లో 68 శాతం వాటా వీటిదే ఉంది.
మొండిబాకీలతో కుదేలు..
ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. తాజా పరిస్థితి చూస్తే మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. మొండిబాకీలతో బ్యాంకులు కుదేలవుతున్నాయి. 2014 మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ చూస్తే పీఎస్‌బీల విలువ దాదాపు రూ.2.97 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. బ్యాంకింగ్‌ రంగ మార్కెట్‌ క్యాప్‌లో వీటి వాటా 40 శాతం నుంచి 26కు పడిపోయింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో ప్రైవేట్‌ బ్యాంకుల రుణ వృద్ధి 21 శాతంగా ఉంటే పీఎస్‌బీలది కేవలం 9.6 శాతమే. ప్రైవేట్‌ బ్యాంకుల డిపాజిట్లు 17.5 శాతం పెరిగితే పీఎస్‌బీలవి 6.5 శాతమే పెరిగాయి. ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు 3.7 శాతం స్థాయిలో ఉంటే పీఎస్‌బీలవి ఏకంగా 12.6 శాతం మేర ఉన్నాయి. దీంతో కేంద్రం దఫదఫాలుగా పీఎస్‌బీలకు అదనపు మూలధనం సమకూరుస్తూ కుప్పకూలకుండా చూస్తోంది.
తప్పెవరిదంటే..
పీఎస్‌బీలు పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారడానికి బాధ్యులెవరంటే.. ఇటు స్వయంగా బ్యాంకులు అటు ప్రభుత్వం కూడానని చెప్పాలి. ప్రత్యేక ఫైనాన్స్‌ సంస్థల స్థానంలో భారీ ప్రాజెక్టులకు పీఎస్‌బీలు రుణాలివ్వాల్సి వచ్చింది. ఇలాంటి అంశాల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ దీర్ఘకాలిక రుణాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయాయి. ఇవే నేటి మొండిబాకీలకు మూలకారణం. పీఎస్‌బీల్లో కేంద్రం వాటాలు తగ్గించుకుంది కానీ ఆజమాయిషీ మాత్రం దాని చేతుల్లోనే ఉంది. బ్యాంకింగ్‌తో సంబంధంలేని పనులకూ ఒకోసారి వాటిని ఉపయోగిస్తోంది. ఇక, పీఎస్‌బీ బ్యాంకర్లకు మార్కెట్‌ స్థాయిలో జీతభత్యాలు లేకపోవడం, నిరంతరం వారిపై దర్యాప్తు సంస్థల నిఘా ఉండటం వంటి అంశాలు సైతం వారిని సాహసోపేత నిర్ణయాలు తీసుకోనివ్వకుండా చేతులు కట్టేసినట్లుగా ఉంటున్నాయి.
జాతీయీకరణ జరిగి 50 సంవత్సరాలవుతున్న ఈ తరుణంలోనైనా పీఎస్‌బీలపై కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవి ఎదగకుండా చేతులు కట్టేసి.. మూలధనాన్ని అందిస్తూ కూర్చోవడమా.. లేక వాటి మానాన వాటిని వదిలేయడమా లేక ప్రైవేటీకరించడమా అన్నది ప్రభుత్వం తేల్చుకోవాలనేది బ్యాంకింగ్‌ వర్గాల మాట. 



You may be interested

ఈబే చేతికి పేటీఎమ్‌ మాల్‌లో 5.5 శాతం వాటా

Friday 19th July 2019

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే స్టోర్‌  న్యూఢిల్లీ: భారత ఈ కామర్స్‌ ప్లాట్‌ఫార్మ్‌, పేటీఎమ్‌ మాల్‌లో 5.5 శాతం వాటాను అమెరికా ఈ-టైలర్‌ ఈబే కొనుగోలు చేసింది.  ఈ వాటా కొనుగోలుకు సంబంధించి ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. ఈ డీల్‌లో భాగంగా పేటీఎమ్‌ మాల్‌లో ఒక స్టోర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఈబే ప్రెసిడెంట్‌, సీఈఓ డెవిన్‌ వెన్‌ చెప్పారు. భారత ఈ కామర్స్‌ రంగంలో ఈబేకు ఇది మూడో పెట్టుబడి. గతంలో

స్మాల్‌క్యాప్స్‌పై తప్పుగా అంచనా వేశా: పొరింజు వెలియత్‌

Friday 19th July 2019

ఎన్నికలు టర్నింగ్‌ పాయింట్‌గా భావించా. బడ్జెట్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రేట్‌ కట్‌ పాలసీలు, బడ్జెట్‌... స్మాల్‌ క్యాప్‌లను ఆదుకోలేకపోయాయి : పొరింజు వెలియత్‌ స్మాల్‌ క్యాప్‌లలో ఇన్వెస్ట్‌ చేసి ప్రస్తుత పరిస్థితులలో వీటిని అమ్మడానికి లేదా హోల్డ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న వారు నాలుగు ముఖ్య విషయాలను గమనించాలని స్మాల్‌ క్యాప్‌ ఇన్వెస్టింగ్‌ నిపుణుడు పొరింజు వెలియత్‌ అన్నారు.  ఆయన పోర్ట్‌ఫోలియోలో ఇంకా కొన్ని అండర్‌ పెర్ఫార్మ్‌ స్టాకులున్నాయని తెలిపారు.   ఇవి గమనించాల్సి అవసరం ఉంది...    

Most from this category