News


5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం సాధ్యమే

Friday 4th October 2019
news_main1570161131.png-28705

  • 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం సాధ్యమే
  • పటిష్టమైన ప్రభుత్వ విధానాల ఊతం
  • వ్యాపారాల నిర్వహణకు అనువైన వాతావరణం 
  • డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో డీపీఐఐటీ కార్యదర్శి మహాపాత్ర వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు భారత్‌లో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మహాపాత్ర వెల్లడించారు. పటిష్టమైన విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సారథ్యంలో ఈ లక్ష్యం సులభసాధ్యమేనని గురువారం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం భారత ఆర్థిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. "అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టిన భారత్‌.. 2024 నాటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లు, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకుంది. ఇది కచ్చితంగా సాధ్యమే. ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం స్థాయిలో ప్రభుత్వాలు పటిష్టమైన విధానాలు అమలు చేస్తుండటంతో ఇందుకు పూర్తి అనువైన పరిస్థితులు ఉన్నాయి. పరిశ్రమకు కూడా దిశానిర్దేశం చేస్తున్న.. ప్రభుత్వం కచ్చితంగా లక్ష్యసాధన దిశగా దేశాన్ని ముందుకు నడిపించగలదు" అని ఆయన చెప్పారు. గడిచిన అయిదేళ్లలో వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని మహాపాత్ర తెలిపారు. ఈ విషయంలో భారత్‌ చెప్పుకోతగ్గ విజయాలే సాధించిందని, ప్రస్తుతం దీనికి సంబంధించిన ర్యాంకింగ్‌లో 77వ స్థానానికి చేరిందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ర్యాంకింగ్స్‌ను మరింత మెరుగుపర్చుకోగలదని పేర్కొన్నారు. ఇక దేశీయంగా పటిష్టమైన స్టార్టప్‌ వ్యవస్థ ఉందని, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు మరిన్ని పెట్టుబడుల రాకకు మరింతగా తోడ్పడగలవని వివరించారు. 

మరిన్ని సంస్కరణలు...
అధిక వృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టబోతోందని నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. 2005 నుంచి ఇప్పటిదాకా 30 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బైటపడ్డారని, గడిచిన అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం మేర వృద్ధి నమోదు చేసిందని వివరించారు. జూన్‌ క్వార్టర్‌లో వృద్ధి మందగించినప్పటికీ ప్రభుత్వం, ఆర్‌బీఐ మళ్లీ ఎకానమీని గాడిన పెట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయని కాంత్‌ వివరించారు. మరోవైపు, చౌక ధరలు, డిస్కౌంట్లతో పోటీ సంస్థలను దెబ్బకొట్టేందుకు ఈ–కామర్స్‌ వేదికను విదేశీ కంపెనీలు ఉపయోగించరాదని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ సూచించారు. విదేశీ ఈ–రిటైల్‌ కంపెనీలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ఇటు చిన్న వ్యాపారులు, అటు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గోయల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సమస్యలను గురించి తెలుసుకునేందుకు తాను దేశీ, విదేశీ సంస్థలతో పలుమార్లు సమావేశమైనట్లు గోయల్‌ చెప్పారు. చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని మల్టీ బ్రాండ్‌ రిటైల్‌లో ఎఫ్‌డీఐలను 49 శాతానికి మాత్రమే పరిమితం చేసినట్లు వివరించారు. 

ప్రభుత్వం మరిన్ని ఊతం ఇవ్వాలి  ..
పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఊతం ఇవ్వాలని గోద్రెజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఆది గోద్రెజ్‌ చెప్పారు. మందగిస్తున్న ఎకానమీ వృద్ధి రేటుకు తోడ్పాటునిచ్చేలా వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇవి ద్రవ్య లోటును పెంచేవే అయినా తప్పక తీసుకోవాల్సిన చర్యలని గోద్రెజ్‌ చెప్పారు. అటు, ఇంటర్నెట్‌ సేవల ప్రయోజనాలు అందరికీ సమానంగా అందాలని, ప్రాంతీయ భాషల్లో మరింత కంటెంట్‌ అందుబాటులోకి రావాలని ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. 

హువావేకు ఎయిర్‌టెల్‌ మిట్టల్‌ బాసట..
భద్రతాపరమైన అంశాల పేరిట చైనా సంస్థ హువావేను ప్రపంచ దేశాలు నిషేధించేలా అమెరికా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ ఆ కంపెనీకి బాసటగా నిల్చారు. హువావే ఉత్పత్తులు అధునాతమనమైనవని, పోటీ సంస్థల ఉత్పత్తులతో పోలిస్తే ఎన్నో రెట్లు ఉత్తమమైనవని ఆయన చెప్పారు. 5జీ టెలికం సేవలకు సంబంధించి హువావే కచ్చితంగా బరిలో ఉండాల్సిందేనని మిట్టల్‌ చెప్పారు. అయితే, సిసలైన భద్రతాపరమైన రిస్కుల కారణంగానే హువావేని వ్యతిరేకిస్తున్నామని, రక్షణాత్మక ధోరణులకు.. దీనికి సంబంధం లేదని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ స్పష్టం చేశారు. You may be interested

పీఎంసీ కేసులో ఇరువురు హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

Friday 4th October 2019

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ కుంభకోణంలో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) డైరెక్లర్లు ఇరువురు అరెస్ట్‌ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు రుణ డిఫాల్ట్‌కు సంబంధించి రాకేష్‌ వాద్వాన్‌, ఆయన కుమారుడు సారంగ్‌ వాద్వాన్‌లను అరెస్ట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌డీఐఎల్‌కు చెందిన రూ.3,500 కోట్లను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల

టాటా ‘పులి’ స్వారీ ముగుస్తుందా?

Friday 4th October 2019

జేఎల్‌ఆర్‌ కొనుగోలు రేసులో బీఎండబ్లూ‍్య! టాటా మోటార్స్‌కు ఇది మంచి అవకాశం... బీఎండబ్ల్యూ విస్తరణకు అవకాశాలు పరిమితమే... జేఎల్‌ఆర్‌ రూపంలో మంచి విలువ సృష్టించొచ్చు జేఎల్‌ఆర్‌ విలువ రూ.82 వేల కోట్లుగా అంచనా... బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్‌ నివేదిక కష్టకాలంలో టాటాలను కామధేనువుగా ఆదుకున్న జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌)... ఇప్పుడు నష్టాలతో ఎదురీదుతోంది. బ్రెగ్జిట్‌ గండానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్‌ మందగమనం... జేఎల్‌ఆర్‌ అమ్మకాలకు గండికొడుతోంది. దీంతో మాతృసంస్థ టాటా మోటార్స్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒకపక్క దేశీయంగా

Most from this category