News


వాహనదారులకు యాక్సిస్‌ బ్యాంక్‌ ఆఫర్‌

Thursday 28th November 2019
news_main1574911890.png-29910

  • ఉచితంగా ట్యాగ్స్‌ పంపిణి

ముంబై: జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే డిసెంబరు ఒకటి నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్‌ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని నెలలపాటు ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌ బుధవారం ప్రకటించింది. ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడంలో భాగంగా టోల్‌ప్లాజాలు, పార్కింగ్‌ ప్రాంతాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుండగా.. ఈ టెక్నాలజీకి సేవలందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బ్యాంక్‌ ప్రకటించింది. దీంతో పాటు బ్యాంక్‌లో ఖాతాల సంఖ్య కూడా పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తోంది. ఇందుకోసం ప్రతి ఒక్క ట్యాగ్‌కు రూ. 100 వరకు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. కస్టమర్‌ను ఆన్-బోర్డింగ్ చేయడం, ట్యాగ్ ఖర్చు, కొరియర్ ఛార్జీలతో కలుపుకుని ఈ మొత్తం అవుతుంది. ఆ తరువాత వచ్చే లావాదేవీల వ్యాపారాన్ని అందుకోవడం కోసం ట్యాగ్‌ను ఉచితంగా అందిస్తున్నామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్ చెప్పారు. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తుండగా, ప్రాసెసింగ్ ఛార్జీలను ఎత్తివేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల చివరివరకు మాత్రమే ఈ సేవలు అందిస్తామని ఇరు బ్యాంకులు ప్రకటించాయి. పెరిగిన పోటీ వాతావరణంలో తాము కూడా కొన్నాళ్ల పాటు ట్యాగ్స్‌ పంపిణి చేసి ఉచిత సేవలందిస్తామని యాక్సిస్‌ బ్యాంక్‌ పేర్కొంది. 

60 టోల్‌ప్లాజాల్లో చిప్‌ రీడర్ల ఏర్పాటు
దేశవ్యాప్తంగా 500పైగా చిప్‌ రీడర్లను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉండగా.. వీటిలో 60 టోల్‌ప్లాజాల వద్ద తమ రీడర్ల ఏర్పాటు పూర్తి అయ్యిందని యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 95 లక్షల ట్యాగ్స్‌ అవసరం ఉందని, ఇందులో ఇప్పటికే 10 లక్షల ట్యాగ్స్‌ వాటా కలిగి ఈ వ్యాపారంలో 4వ అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థగా ఉన్నట్లు వెల్లడించింది. 



You may be interested

భారత్‌లో మాంద్యం లేదు

Thursday 28th November 2019

ఆర్థికమంత్రి సీతారామన్‌ స్పష్టీకరణ బడ్జెట్‌ చర్యలు సత్ఫలితాలు  ఇస్తున్నట్లు వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌ బుధవారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి వుండవచ్చుకానీ మాంద్యంలోకి మాత్రం జారిపోదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్‌లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు

ఫోన్ టారిఫ్‌లలో మరింత పారదర్శకత

Thursday 28th November 2019

యూజర్ల వినియోగానికి తగ్గ ప్లాన్ సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ కొత్త, పాత ప్లాన్ల వివరాలన్నీ టెల్కోలు అందుబాటులో ఉంచాలి ట్రాయ్ ప్రతిపాదనలు.. అభిప్రాయ సేకరణ న్యూఢిల్లీ: ఫోన్‌ సర్వీస్‌ రేట్ల విషయంలో మరింత పారదర్శకత తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు అనువైన ప్లాన్‌ సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ ప్రవేశపెట్టడం తదితర ప్రతిపాదనలు చేసింది. టెలికం ఆపరేటర్లు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టినప్పుడు.. పాత పథకాల

Most from this category