STOCKS

News


ఆర్సెలర్‌ మిట్టల్ చేతికే ఎస్సార్‌ స్టీల్‌!!

Saturday 16th November 2019
news_main1573874276.png-29625

 •  టేకోవర్‌కు మార్గం సుగమం
 • ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు కొట్టేసిన సుప్రీం కోర్టు
 • వాటాలపై సీవోసీదే అంతిమ నిర్ణయం
 • బ్యాంకులకే మొదటి ప్రాధాన్యం
 • రుణదాతలందరినీ ఒకే గాటన కట్టలేమని 
 • అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరణ


న్యూఢిల్లీ: దివాలా తీసిన ఎస్సార్‌ స్టీల్‌ను ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించి ఆర్సెలర్‌ మిట్టల్‌ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. బిడ్‌ మొత్తాన్ని ఫైనాన్షియల్‌ రుణదాతలు (బ్యాంకులు మొదలైనవి), ఆపరేషనల్‌ రుణదాతలు (సరఫరాదారులు మొదలైన వర్గాలు) సమానంగా పంచుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. బాకీలు రాబట్టుకోవడంలో మొదటి ప్రాధాన్యత ఫైనాన్షియల్‌ రుణదాతలకే ఉంటుందని, రుణదాతల కమిటీ (సీవోసీ) తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి లేదని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్‌ పేర్కొంది. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్‌ రుణదాతలకు సమాన హోదా ఉండబోదని స్పష్టం చేసింది. 2018 అక్టోబర్‌ 23న ఆర్సెలర్‌మిట్టల్‌ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలంటూ న్యాయస్థానం.. పరిష్కార ప్రణాళికను సీవోసీకి తిప్పిపంపగలదే తప్ప, రుణదాతల కమిటీ తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయాన్ని మార్చజాలదని సుప్రీం కోర్టు తెలిపింది. పరిష్కార ప్రణాళికను రూపొందించేందుకు దివాలా కోడ్‌లో నిర్దేశించిన 330 రోజుల గడువును కూడా సడలించింది. సీవోసీ పరిష్కార ప్రణాళిక అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని సూచించింది. ఎస్సార్‌స్టీల్‌ వేలం ద్వారా వచ్చే నిధులను రుణదాతలంతా సమాన నిష్పత్తిలో పంచుకోవాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ బ్యాంకులు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 

వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తాం: ఆర్సెలర్‌మిట్టల్‌
సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించిన ఆర్సెలర్‌మిట్టల్‌.. సాధ్యమైనంత త్వరగా ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, బిడ్‌ చేసిన ఆర్సెలర్‌ మిట్టల్, దాని భాగస్వామ్య సంస్థ నిప్పన్‌ స్టీల్‌కు ఎస్సార్‌ స్టీల్‌ శుభాకాంక్షలు తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థను దక్కించుకుంటున్నాయని పేర్కొంది. 

బ్యాంకులకు ఊరట...
ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐడీబీఐ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్, ఎడెల్వీస్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ తదితర సంస్థలకు సుప్రీం కోర్టు తీర్పు ఊరటనివ్వనుంది. స్టాన్‌చార్ట్‌ డీబీఎస్‌ బ్యాంక్‌ వంటి ఆపరేషనల్‌ రుణదాతలకు ప్రాధాన్యం తగ్గనుంది. ఎస్‌బీఐకు ఎస్సార్‌ స్టీల్‌ అత్యధికంగా రూ. 15,430 కోట్లు బాకీ పడింది. రుణదాతల కమిటీ (సీవోసీ) నిర్ణయం ప్రకారం ఎస్సార్‌ స్టీల్‌ వేలం ద్వారా వచ్చే నిధుల పంపకాలకు సంబంధించి బ్యాంకుల్లాంటి సెక్యూర్డ్‌ రుణదాతలు తమకు రావాల్సిన బకాయీల్లో 90 శాతం దాకాను, రూ. 100 కోట్ల పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్‌ రుణదాతలు తమకు రావాల్సిన దాంట్లో 20.5 శాతం దాకా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కానీ దీన్ని తోసిపుచ్చిన ఎన్‌సీఎల్‌ఏటీ.. బ్యాంకులకు 60.7 శాతం మేర, రూ. 100 కోట్లు పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్‌ రుణదాతలు 59.6 శాతం దాకా క్లెయిమ్‌ చేసుకునే వీలు కల్పించింది. దీన్నే సవాలు చేస్తూ బ్యాంకులు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 

రెండేళ్ల తర్వాత ఒక కొలిక్కి..
ఎస్సార్‌ స్టీల్‌ సంస్థ బ్యాంకులకు, ఇతరత్రా రుణదాతలకు రూ. 54,547 కోట్ల మేర బకాయిపడింది. భారీ డిఫాల్టర్లకు సంబంధించి రెండేళ్ల క్రితం ఆర్‌బీఐ ప్రకటించిన తొలి జాబితాలోని 12 సంస్థల్లో ఇది కూడా ఉంది. దీంతో బాకీలను రాబట్టుకునేందుకు ఆర్థిక సంస్థలు.. దివాలా స్మృతి (ఐబీసీ) కింద అప్పట్నుంచి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ తర్వాత ఇది అనేక మలుపులు తిరిగింది. దివాలా తీసి, వేలానికి వచ్చిన తమ సంస్థ చేజారిపోకుండా తిరిగి దక్కించుకునేందుకు ప్రమోటర్లయిన రుయా కుటుంబం వివిధ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నించింది. ఆర్సెలర్‌మిట్టల్‌ ఆఫర్‌ చేసిన రూ. 42,000 కోట్ల కన్నా ఎక్కువగా రూ. 54,389 కోట్లు కడతాము, వేలాన్ని నిలిపివేయాలంటూ కోరింది. కానీ ఎన్‌సీఎల్‌టీ దీన్ని తోసిపుచ్చింది. దివాలా స్మృతికే సవాలుగా నిల్చిన ఈ కేసు ఫలితం .. ఇలాంటి మిగతా కేసులపైనా ప్రభావం చూపనుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


 కేసు పరిణామక్రమం ఇలా..

 • 2017 ఆగస్టు 8: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఎస్సార్‌ స్టీల్‌ దివాలా ప్రక్రియపై విచారణ ప్రారంభం.
 • 2017 నవంబర్‌ 23: డిఫాల్ట్‌ అయిన ప్రమోటర్లు, సంబంధీకులు.. వేలానికి వచ్చిన సంస్థల బిడ్డింగ్‌లో పాల్గొనకుండా నిరోధిస్తూ ఐబీసీలో సెక్షన్‌ 29ఏ నిబంధనను ప్రవేశపెట్టారు.–
 • 2018 ఫిబ్రవరి 12: న్యూమెటల్, ఆర్సెలర్‌ మిట్టల్‌ సంస్థలు బిడ్ల దాఖలు.–
 • 2018 మార్చి:  ఐబీసీ సెక్షన్‌ 29ఏకి అనుగుణంగా లేవంటూ బిడ్ల తిరస్కరణ
 • 2018 ఏప్రిల్‌: కొత్తగా బిడ్లకు ఆహ్వానం
 • 2018 సెప్టెంబర్‌: న్యూమెటల్‌ ప్రతిపాదించిన రూ. 37,000 కోట్లకన్నా అధికంగా రూ. 42,000 కోట్లకు సవరించిన బిడ్‌ను దాఖలు చేసిన ఆర్సెలర్‌మిట్టల్‌. ఆర్సెలర్‌మిట్టల్‌ బిడ్‌ను అనుమతించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన న్యూమెటల్‌.
 • 2019 మార్చి: రూ. 42,000 కోట్ల ఆర్సెలర్‌మిట్టల్‌ బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం.
 • 2019 జూలై: వేలం ద్వారా వచ్చే నిధుల్లో ఆపరేషనల్‌ రుణదాతలకు కూడా సమానవాటా దక్కేలా ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బ్యాంకులు. సుదీర్ఘంగా కొనసాగిన విచారణ.
 • నవంబర్‌ 2019: ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను పక్కనపెడుతూ సుప్రీం కోర్టు తీర్పు. వేలం ద్వారా వచ్చిన నిధుల పంపకాలపై సీవోసీదే తుదినిర్ణయమంటూ..బ్యాంకులకు అనుకూలంగా ఉత్తర్వులు. You may be interested

చెరో రూ.1,170 కోట్లు కట్టండి!

Saturday 16th November 2019

‘ర్యాన్‌బ్యాక్సీ’ సింగ్‌ సోదరులది కోర్టు ధిక్కారమే... దైచీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో షేర్ల అమ్మకం తగదని స్పష్టీకరణ ఎనిమిది వారాల్లో సొమ్ము కోర్టుకు జమచేయాలని ఆదేశం తరువాతే శిక్షను నిర్ణయిస్తామన్న సుప్రీం న్యూఢిల్లీ: దైచీ కేసులో ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌లు (సింగ్‌ సోదరులు) కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌లోని తమ నియంత్రిత షేర్లను మలేషియా సంస్థ-

ఫండ్‌ మేనేజర్లు ప్రధానంగా కొన్న షేర్లివే..

Friday 15th November 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తులు అక్టోబర్‌లో 7 శాతం పెరిగాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక మాత్రం 5 నెలల కనిష్టానికి చేరింది. మార్కెట్లలో ఇటీవలి కాలంలో అనిశ్చితులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. పైగా గత ఏడాదిన్నర కాలంలో చూసుకుంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో అధిక శాతం ఫండ్స్‌ ఇచ్చిన రాబడులు ఒక అంకెలోపే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడుల రాక తగ్గడం గమనార్హం. సెప్టెంబర్‌ నెలలో

Most from this category