News


ఏసీలు, ఫ్రిజ్‌లు రయ్‌రయ్‌!

Tuesday 8th October 2019
news_main1570509726.png-28766

  • క్యూ1లో ఎలక్ట్రికల్‌ ఉపకరణాల అమ్మకాల జోరు
  • ఏసీల విక్రయాలు 20 శాతం అప్‌
  • ఫ్రిజ్‌లు 12 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తుల విక్రయాలపై మందగమన ప్రభావాలు గణనీయంగా కనిపిస్తున్నప్పటికీ .. ఎలక్ట్రికల్‌ ఉపకరణాల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదుకావడంతో ఏసీలు, ఎయిర్‌ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి పలు రకాల కూలింగ్‌ ఉత్పత్తుల విక్రయాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ రంగంలోని మిగతా విభాగాలతో పోలిస్తే ఎలక్ట్రికల్‌ ఉపకరణాల విభాగం మెరుగైన పనితీరు కనపర్చినట్లు బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ ఈడీ అనుజ్‌ పొద్దార్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమపరంగా ఏసీల అమ్మకాలు 20 శాతం, ఫ్రిజ్‌ల విక్రయాలు 12 శాతం మేర వృద్ధి సాధించినట్లు గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మ్యాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది తెలిపారు. 

టీవీల కన్నా .. ఏసీలకే ఓటు..
వేసవి ఉష్ణోగ్రతలు ఈసారి ఎగబాకడంతో కొనుగోలుదారులు టీవీల కన్నా ఏసీల వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు నంది పేర్కొన్నారు. అంతే కాకుండా వీడియో కంటెంట్‌ చూసే విషయానికొస్తే.. టీవీల్లో కన్నా మొబైల్‌ ఫోన్స్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటం కూడా టీవీల అమ్మకాలపై ప్రభావం చూపిందన్నారు. దీంతో టీవీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని వివరించారు. ఆఖరికి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ కూడా టెలివిజన్ల అమ్మకాల వృద్ధికి ఉపయోగపడలేదు. మరోవైపు లో-బేస్‌ ఎఫెక్ట్‌ సైతం ఏసీల విక్రయాల్లో వృద్ధికి కొంత కారణమై ఉండొచ్చని బ్లూస్టార్‌ జాయింట్‌ ఎండీ బి. త్యాగరాజన్‌ తెలిపారు. గతేడాది అధిక కమోడిటీల ధరలు, కరెన్సీ మారకం రేటులో హెచ్చుతగ్గులు, కొంత సాధారణ ఉష్ణోగ్రతలు తదితర అంశాల కారణంగా ఏసీల విక్రయాల వృద్ధి పెద్దగా నమోదు కాలేదని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు, వరదల మూలంగా ఆగస్టులో ఏసీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉన్నా పండుగల సీజన్‌ మొదలవుతుండటంతో సెప్టెంబర్‌లో మళ్లీ వృద్ధి కనిపించవచ్చని పేర్కొన్నారు.

మందగమన ప్రభావాలూ ఉన్నాయి .. 
జూలై, ఆగస్టుల్లో మొత్తం కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ పరిశ్రమని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అమ్మకాలు అంత ఆశావహంగా ఏమీ లేవని నంది పేర్కొన్నారు. కొన్ని విభాగాల్లో క్షీణత కూడా నమోదైందని వివరించారు. చాలా రంగాల్లో ఆర్థిక మందగమనం మూలంగా.. వినియోగదారుల కొనుగోలు ధోరణులపై కూడా ప్రభావం పడిందని తెలిపారు. కొనుగోలు నిర్ణయాలను కస్టమర్లు వాయిదా వేసుకోవడం కూడా జరిగిందని క్రిసిల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ హేతల్‌ గాంధీ తెలిపారు. మరోవైపు, వర్షపాతం సరైన రీతిలో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పంటలు వేయడంలో జాప్యాలు జరగ్గా.. ఇంకొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో పంటలు కొట్టుకుపోవడం జరిగిందని నంది చెప్పారు. ఇలా వ్యవసాయోత్పత్తి మందగించి, ఆదాయాలు తగ్గడం వల్ల కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ పరిశ్రమ కూడా మిగతా రంగాల్లాగానే క్షీణత నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. 

 

రేట్ల కోత..వినియోగానికి ఊతం..
వినియోగదారులు, పరిశ్రమ సెంటిమెంటును మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని చర్యలు పరిస్థితి మెరుగుపడటానికి ఊతమివ్వగలవని భావిస్తున్నట్లు నంది చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మేర కేంద్రం నిధులు ప్రకటించడం, ఆర్‌బీఐ పాలసీపరంగా కీలకవడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలతో మార్కెట్లో నిధుల లభ్యత మెరుగుపడుతుందని, రుణ వితరణ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వినియోగదారుల సానుకూల సెంటిమెంటు, వర్షపాతం, ఉపాధి కల్పన.. ఈ మూడు అంశాలు పరిశ్రమకు కీలకంగా ఉంటాయని చెప్పారు. వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ఉదార విధానాలు, వ్యవస్థలో నిధుల లభ్యత మెరుగుపడటం మొదలైనవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వినియోగ వృద్ధికి ఊతమివ్వగలవని వివరించారు. ప్రథమార్ధం మందగించడంతో.. వినియోగ వస్తువుల తయారీ సంస్థలు.. ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రమోషనల్‌ ఆఫర్లను మరింతగా పెంచవచ్చని, పలు ఆకర్షణీయ ఫైనాన్సింగ్‌ స్కీములు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని హేతల్‌ గాంధీ చెప్పారు. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో ఏకంగా 21 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటోంది. అయినప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ అమ్మకాల పరిమాణం గతంలో అంచనా వేసిన 6–7 శాతం కన్నా 200–300 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గవచ్చని పేర్కొన్నారు. You may be interested

రూ. 10వేల కోట్ల సమీకరణలో ఓయో

Tuesday 8th October 2019

అమెరికా, యూరప్‌లో విస్తరణకు వినియోగం న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,650 కోట్లు) సమీకరించనున్నట్లు వెల్లడించింది. అమెరికాలో విస్తరణకు, యూరప్‌లో కార్యకలాపాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్.. ఆర్‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌ ద్వారా 700 మిలియన్ డాలర్లు సమకూర్చనుండగా, మిగతా 800 మిలియన్ డాలర్ల నిధులను ప్రస్తుతం ఉన్న

‘కాంటినెంటల్‌’ చేతులు మారుతుందా?

Tuesday 8th October 2019

‘పార్క్‌ వే’ ఎగ్జిట్‌కు ప్రమోటర్ల ప్రయత్నాలు అరబిందోతో చర్చలు... కుదరని డీల్‌ సొంతగా రుణాలు సమీకరించే అవకాశం తాజాగా చైనా హెల్త్‌కేర్‌ సంస్థ ఆసక్తి సింగపూర్‌, మలేసియాలకు చెందిన ‘పార్క్‌ వే పంటాయ్‌’ గ్రూపు నుంచి కాంటినెంటల్‌ ఆసుపత్రిని మళ్లీ తన చేతుల్లోకి తీసుకోవటానికి ప్రమోటరు డాక్టర్‌ గురునాథ్‌ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీన్లో భాగంగా ఇటీవల అరబిందో ఫార్మా ప్రమోటర్లను కలిసి చర్చించడంతో అంతా డీల్‌ కుదిరిందనే అనుకున్నా... సాకారం కాలేదు. తాజాగా

Most from this category