News


దేశ ఆర్థిక మూలాలు పటిష్టం

Friday 10th January 2020
Markets_main1578626936.png-30812

- ఎకానమీకి పుంజుకునే సత్తా ఉంది
- 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరగలం
- సమిష్టి కృషితో సాధ్యమే
- నీతి ఆయోగ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
- ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలతో భేటీ

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. గురువారం నీతి ఆయోగ్‌లో పలువురు ఆర్థికవేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ .. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులు మొదలైన వారితో బడ్జెట్ ముందస్తు సమవేశంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో వివిధ రంగాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. విధానకర్తలు, వివిధ వర్గాలు సమన్వయంతో కలిసి పనిచేసేందుకు ఇవి తోడ్పడగలవని మోదీ చెప్పారు. 5 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదని.. దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీన్ని నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. "దేశాన్ని ముందుకు నడిపించేందుకు, ఉద్యోగాలను కల్పించేందుకు అవసరమైన సత్తా..  టూరిజం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మొదలైన రంగాల్లో పుష్కలంగా ఉంది" అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి వేదికల్లో జరిగే మేథోమధనాలు దేన్నైనా సాధించగలమనే స్ఫూర్తి నింపగలవని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న మోదీ.. సోమవారం పలువురు వ్యాపార దిగ్గజాలతో సమావేశమైన సంగతి తెలిసిందే. 

రుణ వితరణ పెరగాలి..
రుణ వితరణ పెంచాలని .. ఎగుమతుల వృద్ధికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గవర్నెన్స్‌ మెరుగుపడటానికి, వినియోగానికి డిమాండ్ పెంచేందుకు, ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వల్పకాలికంగా తీసుకోతగ్గ చర్యలపై సత్వరం నిర్ణయం తీసుకుంటామని, దీర్ఘకాలిక అంశాలకు సంబంధించి వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమైనందున కాలక్రమేణా అమలు చేయగలమని మోదీ హామీ ఇచ్చారు. "ఆర్థిక వృద్ధి, స్టార్టప్స్‌, నవకల్పనలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది" అని నీతి ఆయోగ్‌ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఆర్థిక మంత్రి గైర్హాజరు..
దాదాపు 40 మంది పైగా నిపుణులు, ఆర్థిక వేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి పియుష్ గోయల్‌, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్ కాంత్‌ తదితరులు దీనికి హాజరయ్యారు. అయితే, బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ వర్గాలతో ప్రి-బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నందున.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి హాజరు కాలేదు. ఫిబ్రవరి 1న ఆమె రెండోసారి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. You may be interested

భారత్‌ బ్యాంకింగ్‌ రుణ వృద్ధి అంతంతే!

Friday 10th January 2020

- 2019-2020లో వృద్ధిరేటు కేవలం 5 శాతం - ప్రపంచబ్యాంక్‌ అంచనా - 2020-21లో 5.8 శాతానికి పెరిగే అవకాశం - 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి 2.5 శాతమే! వాషింగ్టన్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌-2020 మార్చి) 5 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్‌ అంచనావేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021)లో వృద్ధిరేటు 5.8 శాతానికి రికవరీ అయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది.

ఫ్లాట్‌ ఓపెనింగ్‌?!

Friday 10th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 6 పాయింట్లు వీక్‌ గురువారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌ నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి ఉదయం  8.40 ప్రాంతం‍లో 6 పాయింట్లు తక్కువగా 12,265 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,271 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాన్‌- అమెరికా

Most from this category