News


విలీన బాటలో ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, డిష్‌టీవీ

Friday 13th December 2019
news_main1576207922.png-30198

  • విలీన బాటలో ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, డిష్‌టీవీ
  • ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భావం
  • 4 కోట్ల చందాదారులతో 62 శాతం మార్కెట్‌వాటా

ముంబై: దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్‌ డీల్‌ విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ముందుగా డిష్‌ టీవీ తన డీటీహెచ్‌ వ్యాపారాన్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత భారతీ టెలీ మీడియాతో వీలీనం చేస్తుంది. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీకి భారతీ టెలీమీడియా మాతృ సంస్థగా ఉంది. ఇరు కంపెనీలు కలిస్తే 4 కోట్ల మంది టీవీ సబ్‌స్క్రయిబర్లతో ప్రపంచంలో అతిపెద్ద టీవీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ అవతరిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విలీన పథకానికి సంబంధించి తుది అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు వెల్లడించాయి.  
విలీన కంపెనీ లిస్టింగ్‌...
భారతీ టెలీమీడియాలో 20 శాతం వాటాను వార్‌బర్గ్‌ పింకస్‌ 2017 డిసెంబర్‌లో కొనుగోలు చేసింది. ఇందుకు 350 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తాజా విలీనం తర్వాత కూడా వార్‌బర్గ్‌పింకస్‌ తన పెట్టుబడులను కొనసాగించనుంది. డీల్‌ అనంతరం భారతీ టెలీమీడియాను స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ కూడా చేయనున్నారు. డిష్‌ టీవీ డీటీహెచ్‌ వ్యాపారాన్ని భారతీ టెలీమీడియాలో విలీనం తర్వాత.. నాన్‌ డీటీహెచ్‌ సేవలతో కొనసాగుతుంది. ఇందులో డిష్‌ ఇన్‌ఫ్రా సేవలు ఉంటాయి. అలాగే, సీఅండ్‌ఎస్‌ మీడియానెట్‌లో 51 శాతం వాటా కలిగి ఉంటుంది. ‘‘సెప్టెంబర్‌ నాటికే ఒప్పంద దశకు వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతా ఆగిపోయింది. మళ్లీ చర్చలు మొదలయ్యాయి’’అని ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ వ్యక్తి తెలిపారు. టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను మూడు నెలల్లోపు చెల్లించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన విషయం తెలిసిందే.
ఆధిపత్యం...
ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌టీవీలు కలవడం వల్ల డైరెక్ట్‌ టు హోమ్‌ (డీటీహెచ్‌) టీవీ ప్రసారాల పంపిణీ మార్కెట్లో ఆధిపత్యానికి అవకాశం వచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే అప్పుడు 87 శాతం మార్కెట్‌ కేవలం రెండు సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌, డిష్‌ టీవీ విలీన కంపెనీకి 4 కోట్ల కస్టమర్లు ఉంటారు. తద్వారా 62 శాతం మార్కెట్‌ వాటా ఈ సంస్థ చేతుల్లోనే ఉంటుంది. సెప్టెంబర్‌ నాటికి డిష్‌టీవీకి 23.94 మిలియన్‌ చందాదారులు, ఎయిర్‌టెల్ డిజిటల్‌కు 16.21 మిలియన్‌ చందాదారులు ఉన్నారు. టాటా స్కై 25 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. మిగిలిన వాటా సన్‌ టీవీకి చెందిన సన్‌ డైరెక్ట్‌ సొంతం. టెలికం మార్కెట్‌ మాదిరే డిటీహెచ్‌ మార్కెట్లోనూ ఒకప్పుడు ఆరుగురు ప్లేయర్లు ఉండేవారు. ఎస్సెల్‌గ్రూపునకు చెందిన డిష్‌ టీవీ, కొంత కాలం క్రితం వీడియోకాన్‌ డీటుహెచ్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్‌ డిజిటల్‌ టీవీని వేరొక సంస్థ కొనుగోలు చేసింది. కానీ, ఈ సంస్థ సేవలు చాలా నామమాత్రంగానే ఉన్నాయి. ‘‘విలీనం వల్ల యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) పరంగా ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పుడు రెండు దేశవ్యాప్త కంపెనీలు, ఒక ప్రాంతీయ కంపెనీయే ఉంటుంది’’ అని ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోహిత్‌డోకానియా తెలిపారు. 



You may be interested

ఎయిరిండియాలో పూర్తి వాటాల విక్రయం

Friday 13th December 2019

ఎయిరిండియాలో పూర్తి వాటాల విక్రయం కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టీకరణ న్యూఢిల్లీ: నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని (ఏఐఎస్‌ఏఎం) పునరుద్ధరించినట్లు, వ్యూహాత్మకంగా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆమోదముద్ర

పరిశ్రమలు మళ్లీ మైనస్‌

Friday 13th December 2019

అక్టోబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల నిరాశ వృద్ధిలేకపోగా - 3.8 శాతం క్షీణత వరుసగా మూడు నెలల నుంచీ ఇదే ధోరణి న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా -3.8 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలకన్నా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన తయారీరంగంసహా విద్యుత్‌, మైనింగ్‌ వంటి కీలక రంగాలన్నింటిలో క్షీణరేటే

Most from this category