STOCKS

News


డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రెట్టింపు..

Saturday 2nd November 2019
news_main1572668722.png-29304

  • క్యూ2లో రూ. 1,093 కోట్లు
  • పన్ను ప్రయోజనాలు, వన్‌ టైమ్‌ ఆదాయాల ఊతం
  • ఆదాయంలో 26 శాతం వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,093 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 504 కోట్లతో పోలిస్తే 117 శాతం అధికం. క్యూ2లో ఆదాయం రూ. 3,798 కోట్ల నుంచి 26 శాతం పెరిగి రూ. 4,801 కోట్లకు చేరింది. పన్నులపరమైన సర్దుబాట్లు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి మూడు ఉత్పత్తుల హక్కులను విక్రయించడం వంటి వన్‌టైమ్‌ అంశాలు.. ఆదాయాలు, లాభాలు పెరగడానికి కారణమయ్యాయని సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ, సీఎఫ్‌వో సౌమెన్‌ చక్రవర్తి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. మూడు ఔషధాల విక్రయ హక్కుల బదలాయింపునకు గాను అప్‌షర్‌–స్మిత్‌ లాబరేటరీస్‌ నుంచి రూ. 720 కోట్లు లైసెన్సు ఫీజు కింద రాగా, సుమారు రూ. 326 కోట్ల మేర ఆదాయపు పన్నుపరమైన ప్రయోజనం లభించినట్లు చక్రవర్తి తెలిపారు. ఈ క్వార్టర్‌లో అత్యధిక లాభాలు, ఆదాయాలు నమోదు చేసినట్లు వివరించారు. నిర్దిష్ట మలినాల కారణంగా .. రానిటిడిన్‌ ఔషధాన్ని అమెరికా మార్కెట్ల నుంచి స్వచ్ఛందంగా రీకాల్‌ చేశామని, ప్రస్తుతం దీన్ని ఎక్కడా విక్రయించడం లేదని చక్రవర్తి వివరించారు. చైనా మార్కెట్లో క్యాన్సర్‌ ఔషధాలతో పాటు 70 ఉత్పత్తులు ప్రవేశపెట్టడంపై దృష్టి సారిస్తున్నామని ఇజ్రేలీ తెలిపారు. ద్వితీయార్థంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు కేటాయింపులు పెరగనున్నట్లు చెప్పారు. 

వృద్ధి లేని ఉత్తర అమెరికా ...
యూరప్, వర్ధమాన మార్కెట్లు, భారత్‌ తదితర దేశాల ఊతంతో గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయం వార్షికంగా 7 శాతం వృద్ధితో రూ. 3,280 కోట్లుగా నమోదైంది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో వృద్ధి లేకపోగా.. ధరలు తగ్గించాల్సి రావడం, విక్రయాలు తగ్గడం వంటి అంశాల కారణంగా సీక్వెన్షియల్‌గా చూస్తే 13 శాతం క్షీణించి రూ. 1,430 కోట్లకు పరిమితమైంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఉత్తర అమెరికా మార్కెట్లో ఎనిమిది కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టామని, ప్రస్తుతం 99 జనరిక్‌ ఔషధాలకు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చక్రవర్తి చెప్పారు. 

మెరుగ్గా యూరప్‌ ...
కొత్త ఉత్పత్తులు, అమ్మకాల వృద్ధి ఊతంతో యూరప్‌ మార్కెట్‌ ద్వారా ఆదాయం 44 శాతం వృద్ధి చెంది రూ. 280 కోట్లుగా నమోదైంది. ఇక, దేశీ మార్కెట్లో ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 750 కోట్లకు చేరినట్లు చక్రవర్తి తెలిపారు. రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో కొత్తగా 5 ఉత్పత్తులు ప్రవేశపెట్టినట్లు వివరించారు. మరోవైపు వర్ధమాన మార్కెట్ల ద్వారా ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. 

పీఎస్‌ఏఐ విభాగం 18 శాతం అప్‌..
ఫార్మా సర్వీసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం వార్షికంగా 18 శాతం, సీక్వెన్షియల్‌గా 57 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఉత్పత్తుల విక్రయాలు పెరగడం ఇందుకు దోహదపడింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 370 కోట్లు వెచ్చించగా.. పెట్టుబడి వ్యయాల కింద ప్రథమార్ధంలో మొత్తం రూ. 214 కోట్లు వెచ్చించినట్లు చక్రవర్తి తెలిపారు. You may be interested

అమెరికా మార్కెట్ల రికార్డుల హోరు

Saturday 2nd November 2019

కొత్త జీవికాల గరిష్టాలకు ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు  కలిసొచ్చిన అక్టోబర్‌ ఉపాధి కల్పన గణాంకాలు అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ రికార్డు ర్యాలీ చేశాయి. అక్టోబర్‌లో ఉపాధి కల్పన అంచనాలకు జరగడం, చైనా తయారీ రంగ గణాంకాలు మూడేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ చర్చల్లో భాగంగా మొదటి దశ ఒప్పందంపై సానుకూల వార్తలు వెలువడటం తదితర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం

97 విమానాలకు ఇంజన్లు మార్చాల్సిందే

Saturday 2nd November 2019

లేదంటే వాటిని నిలిపివేయాల్సిందే ఇండిగోకు జనవరి వరకు గడువిచ్చిన డీజీసీఏ ఇంజన్లలో తరచూ సమస్యలే కారణం న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో, తన నిర్వహణలో ఉన్న 97 ఏ320 నియో విమానాలకు ప్రస్తుత ‘ప్రట్‌ అండ్ విట్నీ’ (పీడబ్ల్యూ) ఇంజన్లను (రెండు రెక్కల్లోనూ) వచ్చే జనవరి 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశించింది. లేదంటే వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇండిగో

Most from this category