News


డాక్టర్‌ రెడ్డీస్ లాభం 44 శాతం అప్‌

Saturday 18th May 2019
news_main1558152490.png-25810

  • క్యూ4లో రూ.434 కోట్లు
  • ఆదాయం 14 శాతం వృద్ధి
  • రూ. 4,017 కోట్లు
  • రూ.20 తుది డివిడెండు

హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్‌) నికర లాభం 44 శాతం ఎగిసింది. రూ. 434.4 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 302.2 కోట్లు. మరోవైపు, తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం 14 శాతం వృద్ధి చెందింది. రూ.3,535 కోట్ల నుంచి రూ.4,017 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20 తుది డివిడెండు ఇవ్వాలని కంపెనీ బోర్డు  నిర్ణయించింది. శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్‌ఎల్‌ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి ఈ విషయాలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 ఔషధాలు మార్కెట్లోకి ప్రవేశపె‍ట్టామని, ఈసారి కూడా సుమారు అదే స్థాయిలో కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికాలో మూడు డెర్మటాలజీ బ్రాండ్స్‌ విక్రయాలకు సంబంధించి నాలుగో త్రైమాసికంలో ఎన్‌కోర్‌ డెర్మటాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. 
మరోవైపు,  గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పనితీరును గణనీయంగా మెరుగుపర్చుకోగలిగినట్లు సంస్థ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంలోనూ పురోగతి సాధించినట్లు ఆయన వివరించారు. "రాబోయే రోజుల్లో లాభదాయక వృద్ధిని సాధించడంతో పాటు కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్దేశించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేషంట్లకు అధిక ప్రయోజనం చేకూర్చే నూతన ఆవిష్కరణలపైనా దృష్టి పెడతాం" అని ప్రసాద్‌ చెప్పారు. సుబాక్సోన్ జనరిక్ ఔషధ విక్రయాలను నిలిపివేయాలంటూ అమెరికా కోర్టులో కేసు వేసిన ఇండీవియర్ సంస్థ.. ఒకవేళ కేసు వీగిపోయిన పక్షంలో పరిహారంగా చెల్లించేందుకు 72 మిలియన్ డాలర్ల బాండు సమర్పించినట్లు పేర్కొన్నారు. తుది తీర్పు గానీ తమకు అనుకూలంగా వచ్చిన పక్షంలో అంతకు మించి పరిహారం కోరనున్నట్లు ఆయన తెలిపారు. 
జనరిక్స్‌కు వర్ధమాన మార్కెట్ల ఊతం...
యూరప్‌, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం నాలుగో త్రైమాసికంలో మెరుగైన పనితీరు కనపర్చింది. వార్షికంగా తొమ్మిది శాతం వృద్ధితో ఆదాయం రూ. 3,038 కోట్లకు పెరిగింది. అటు కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ కేవలం మూడు శాతం వృద్ధికి పరిమితమైంది. ఈ మార్కెట్ నుంచి క్యూ4లో ఆదాయం రూ. 1,449 కోట్ల నుంచి రూ. 1,496 కోట్లకు పెరిగింది. నాలుగో త్రైమాసికంలో కొత్తగా 5 ఉత్పత్తులను ఉత్తర అమెరికా మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటిలో యాడ్‌సిర్కా, సయాలిస్‌ ప్రధానమైనవని సంస్థ తెలిపింది.  మరోవైపు, నాలుగో త్రైమాసికంలో ఫార్మాస్యూటికల్ సర్వీసెస్‌, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం దాదాపు ఎనిమిది శాతం వృద్ధితో రూ. 676.50 కోట్లకు చేరింది. 
వార్షికంగా రూ. 1,880 కోట్ల లాభం...
2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను డీఆర్‌ఎల్‌ ఆదాయం రూ. 15,385 కోట్లు కాగా.. లాభం రూ. 1,880 కోట్లుగా నమోదైంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతమున్న ఉత్పత్తుల మార్కెట్ వాటా పెరగడంతో పాటు సానుకూల విదేశీ మారక రేటు తదితర అంశాలు ఉత్తర అమెరికా మార్కెట్‌ నుంచి ఆదాయాలు మెరుగుపడటానికి దోహదపడినట్లు చక్రవర్తి తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అ౾ండ్‌డీ) కార్యకలాపాలపై రూ. 1,560 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. 2019 మార్చి ఆఖరు నాటికి మొత్తం 110 జనరిక్‌ ఔషధాలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌ఽడీఐ నుంచి అనుమతులు రావాల్సి ఉందని పేర్కొంది. భారత మార్కెట్‌ నుంచి క్యూ4లో ఆదాయాలు 6 శాతం పెరిగి రూ. 650 కోట్లకు, వార్షికంగా 12 శాతం వృద్ధితో రూ. 2,620 కోట్లకు పెరిగాయి. 



You may be interested

కార్పొరేషన్‌ బ్యాంకు భారీ నష్టాలు

Saturday 18th May 2019

ముంబై: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్‌ బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. మొండి బకాయిలకు పెద్ద మొత్తంలో చేసిన కేటాయింపులతో నష్టాలు భారీగా రూ.6,581 కోట్లకు పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,838 కోట్ల నష్టాలతో  పోలిస్తే మూడున్నర రెట్లు పెరిగాయి. ఆదాయం సైతం ముందటేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.4,642 కోట్ల నుంచి రూ.4,187 కోట్లకు తగ్గిపోయింది. స్థూల ఎన్‌పీఏలు మాత్రం 17.35 శాతం

వచ్చే క్వార్టర్‌కల్లా మెరుగుపడతాం

Saturday 18th May 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆశాభావం న్యూఢిల్లీ: నిధుల లభ్యతపరంగా ప్రస్తుతం తీవ్ర ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికానికల్లా పరిస్థితులు మెరుగుపడగలవని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆశిస్తోంది. లిక్విడిటీ సమస్యల నుంచి బైటపడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్‌) ఎస్‌కే గుప్తా వెల్లడించారు. వివిధ సర్కిల్స్‌లో చీఫ్ జనరల్‌ మేనేజర్స్‌ (సీజీఎం)కు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. టారిఫ్‌ల పరమైన పోరుతో టెలికం రంగంలో గతంలో

Most from this category