News


రక్షణ రంగానికి 3.37 లక్షల కోట్లు కేటాయింపు

Sunday 2nd February 2020
Markets_main1580617748.png-31425

గతం కంటే 5.8 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్‌
న్యూఢిల్లీ: బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పొరుగు దేశాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రక్షణ రంగం అధిక ఆర్థిక కేటాయింపుల కోసం ఎదురుచూస్తుండగా గత యేడాదికంటే రక్షణ బడ్జెట్‌ కేటాయింపులను కేంద్రం ఆరుశాతం కూడా పెంచకపోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం రక్షణ రంగానికి రూ.3.18 లక్షలకోట్లు కేటాయించింది. ఈ యేడాది అది రూ.3.37 లక్షలకు పెంచారు.
        కొత్త ఆయుధాల కొనుగోలు, యుద్ధ విమానాలూ, యుద్ధనౌకలు, ఇతర సైనిక పరికరాలు కొనుగోలు చేయడానికి మూలధన వ్యయం కోసం రూ. 1.13 లక్షల కోట్లు కేటాయించినట్టు నిర్మలా సీతారామన్‌ చెప్పారు.
    గత ఏడాది బడ్జెట్‌ అంచనా 3.18 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కేటాయింపులు 5.63 శాతం పెరిగింది. 2019–20 సవరించిన రూ. 3.31 లక్షల కోట్ల అంచనా ప్రకారం అయితే ఈ పెంపుదల కేవలం 1.8 శాతం మాత్రమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చైనా-భారత్‌ యుద్ధం1962 తరువాత రక్షణ రంగానికి జరిపిన అతితక్కువ బడ్జెట్‌ కేటాయింపులు. ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణకు రూ.2.09 లక్షల కోట్లు అవుతుంది. రక్షణ రంగ ఉద్యోగులకు పెన్షన్లకు కేటాయించిన రూ.1.33 కోట్లు కలుపుకుంటే ఈ మొత్తం కేటాయింపులు 4.71 లక్షల కోట్ల రూపాయలకు చేరతాయి.
    చైనా తన రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేసుకుంటున్న నేపథ్యంలోనూ, మారుతున్న దేశభద్రత రీత్యా, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో రక్షణ రంగ ఆధునికీకరణకు ఇంకా ఎక్కువ నిధులు అవసరమవుతాయి. గత ఏడాది బాలకోట్‌ దాడుల అనంతరం బడ్జెట్‌ కేటాయింపులు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం అయ్యింది. అయితే ఊహించిన దానికంటే భిన్నంగా తక్కువ నిధులు కేటాయించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్రివిధ దళాల అవసరాలను అనుగుణంగా కేటాయింపులు లేకపోయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే రక్షణ రంగ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయన్న వాదన కూడా వనిపిస్తోంది. 
    ‘‘రక్షణ రంగానికి కేటాయించిన ని«ధులు సరిపోక పోయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేటాయించిన నిధులను సైతం ఎలా ఖర్చు చేస్తున్నారన్నది కూడా గమనించాల్సిన విషయం’’అని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ ఎనాలసిస్‌ కి చెందిన డాక్టర్‌ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. 
    గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.1,03,394 కోట్లను రూ.1,13,734 కోట్లకు పెంచారు. ఇది గతం కంటే 10,340 కోట్ల రూపాయలు అధికం. 
    ఇక ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణ విభాగాలను కలిపితే రూ.2,09,319 కోట్ల రూపాయలవుతుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం 2019–20 లో వేతనాలూ, తదితరాలకు 2,01,901 కోట్ల రూపాయలు కేటాయించారు. 
    దేశ భద్రత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యానం రక్షణ రంగ కేటాయింపులపై దృష్టి సారించేలా చేసింది. గత పదేళ్లలో రక్షణ రంగానికి చేస్తున్న కేటాయింపులు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. దేశ భద్రత, పొరుగు దేశాల నుంచి పొంచి వున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు దేశపరిరక్షణకు దేశాన్ని అన్ని కోణాలనుంచి సమర్థవంతంగా తయారుచేయడమే లక్ష్యంగా బడ్జెట్‌ ప్రణాళికని తయారుచేశారు నిర్మలా సీతారామన్‌. 

గత పదేళ్ళలో ప్రభుత్వాలు రక్షణ రంగానికి చేసిన కేటాయింపులు కోట్లల్లో ... 

ఏడాది        రక్షణ రంగ కేటాయింపులు    క్యాపిటల్‌ వ్యయం        శాతంలో
2009–10            1,80,018            51,112        28 శాతం
2010–11            1,94,606            62,056        32 శాతం
2011–12            2,13,673            67,092        32 శాతం
2012–13            2,30,642            70,499        31 శాతం        
2013–14            2,54,133            79.125        31 శాతం
2014–15            2,85,005            73,401        26 శాతం
2015–16            2,93,920            71,675        24 శాతం
2016–17            3,51,550            86,375        25 శాతం
2017–18            3,79,704            90,438        24 శాతం
2018–19            4,05,199            93,982        23 శాతం
2019–20            4,31,011            1,03,394        24 శాతం
రక్షణ రంగానికి కేటాయిస్తోన్న నిధుల్లో దేనికెంత?
2019–20 బడ్జెట్‌ కేటాయింపుల్లో పెన్షన్లు, వేతనాలకు కలిపి మొత్తం 51 శాతం ఖర్చు చేస్తున్నారు. అంటే గత బడ్జెట్‌లో 2,20,541 కోట్లరూపాయలు కేవలం పెన్షన్లు, వేతనాలకు సంబం«ధించినవి. 
రక్షణ రంగబడ్జెట్‌ కేటాయింపుల్లో వేతనాలకు – 25 శాతం
పెన్షన్లు                – 26 శాతం
క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌    – 24 శాతం
స్టోర్స్‌                – 11 శాతం
ఇతరములు            – 14 శాతం
ప్రతియేటా సుమారు రక్షణ రంగం నుంచి దాదాపు 60,000 మంది పదవీ విరమణ చేస్తున్నందున ఈ రంగంలో పెన్షన్లకు కేటాయించే నిధుల శాతం పెరుగుతున్నట్టు 2019లో స్టాండింగ్‌ కమిటీ పేర్కొన్నది. దీంతో సాయుధ దళాల ఆధునీకరణకు వెచ్చించాల్సిన నిధులు తగ్గుతున్నాయి. గత పదేళ్ళలో రక్షణరంగంలోని ఉద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్న మొత్తం యేటా 12 శాతానికి పెరిగింది.
 ప్రభుత్వం పెన్షన్‌ బిల్లును, కొన్ని ఇతర పెన్షన్‌ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా లేదా ముందస్తు పదవీ విరమణ ద్వారా ప్రభుత్వం పెన్షన్‌ బిల్లుని తగ్గిస్తుందని స్టాండింగ్‌ కమిటీ పేర్కొంది.



You may be interested

ఎగుమతిదారులకు ప్రత్యేక పథకం

Sunday 2nd February 2020

పన్నులు, సుంకాల రీయింబర్స్‌మెంట్‌ న్యూఢిల్లీ:  మందగించిన ఎగుమతులకు ఊతమిచ్చే దిశగా బడ్జెట్‌లో కేంద్రం చర్యలు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల స్థాయుల్లో ఎగుమతిదారులు చెల్లించే వివిధ సుంకాలు, పన్నులను రీయింబర్స్ చేసేందుకు ఈ ఏడాది ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. విలువ ఆధారిత పన్నులు (వ్యాట్‌), విద్యుత్ సుంకాలు, రవాణా కోసం ఉపయోగించే ఇంధనాల వ్యయాలు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి వాటికి మినహాయింపులు గానీ రీఫండ్‌ గానీ

విదేశీ బొమ్మలు, పాదరక్షలు ప్రియం

Sunday 2nd February 2020

- దిగుమతి సుంకాలు పెంపు - ఫర్నిచర్‌, వాల్‌ ఫ్యాన్లపై కూడా న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి తోడ్పాటునిచ్చేలా దేశీయంగా తయారీ రంగానికి మరింత ప్రోత్సాహమిచ్చే దిశగా కేంద్రం పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. వీటిలో బొమ్మలు, పాదరక్షలు, ఫర్నిచర్ తదితర ఉత్పత్తులు ఉన్నాయి. దిగుమతి సుంకం .. పాదరక్షలపై 25 శాతం నుంచి 35 శాతానికి, ఆటబొమ్మలు.. పజిల్స్‌ మొదలైన వాటిపై 20 శాతం నుంచి 60

Most from this category