News


వ్యాపార ని‘‘బంధనాలు’’ తొలగించండి

Friday 20th December 2019
news_main1576810717.png-30317

 • స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉండాలి
 • విలీనాలు, కొనుగోళ్లకు నిబంధనల అవరోధం తొలగించాలి
 • కేంద్ర ఆర్థిక మంత్రికి పారిశ్రామికవేత్తల వినతి

న్యూఢిల్లీ: దేశంలో వ్యాపారాలను మరింత సులభంగా నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కేంద్రాన్ని కోరారు. 2020-21 బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌, అసోచామ్‌ ప్రెసిడెంట్‌ బాలకృష్ణ గోయెంకా తదితర పారిశ్రామిక ప్రముఖులతోపాటు కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమైన సూచనలు, డిమాండ్లను ప్రభుత్వం ముందుంచడం గమనార్హం. 
మరింత స్వేచ్ఛ...
‘‘దేశంలో వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే విషయమై చర్చించేందుకే నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. నా డిమాండ్‌ ఇదే. వినియోగదారుల ప్రయోజనాన్ని, పెట్టుబడులను సమతౌల్యం చేయాల్సి ఉంది’’ అని సునీల్‌ భారతీ మిట్టల్‌ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు చెప్పారు. కంపెనీల కొనుగోళ్లు, విలీనాలు, వ్యాపార విభజన, ఎన్‌సీఎల్‌టీ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న ఆదాయపన్ను సెక్షన్లపై సూచనలు చేసినట్టు వెల్లడించారు. ‘‘పరిశ్రమలు మరింత స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాలన్నదే ఆలోచన. వాటిని ఆర్థిక మంత్రి చక్కగా స్వీకరించారు. భారత పారిశ్రామికవేత్తల శక్తిని ద్విగుణీకృతం చేసే విధంగా ఈ బడ్జెట్‌ ఉండాలని కోరుకుంటున్నాం’’ అని మిట్టల్‌ తెలిపారు. వ్యాపార సులభతర నిర్వహణ కీలక పాత్ర పోషిస్తుందని అసోచామ్‌ ‍ప్రెసిడెంట్‌ బాలకృష్ణగోయంకా పేర్కొనగా, చాలా పరిశ్రమలకు ఇదే ఆందోళనకర అంశమని సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ చెప్పారు. వ్యాపార సులభ నిర్వహణతోపాటుపై వృద్ధి ప్రేరణకు ఏం చేయగలమన్న దానిపై చర్చించినట్టు ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా గ్రూపు అధినేత సంజీవ్‌ గోయెంకా తెలిపారు. ‘‘అన్ని రకాల సలహాలను వారు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరహా స్పందనను ప్రభుత్వం నుంచి చూడడం ఇదే మొదటిసారి’’ అని గోయెంకా పేర్కొన్నారు. మందగమనం చాలా రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యం వినియోగంపై ప్రభావం చూపించిందన్నారు. ఇది సాధారణ స్థితికి రావడానికి మూడు, నాలుగు త్రైమాసికాల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. 
పన్ను భారం తగ్గించాలి...
‘‘రూ.20 లక్షల కంటే ఒక ఏడాదిలో తక్కువ ఆర్జించే వారికి ఆదాయపన్ను తగ్గించాలని సూచన చేశాం. దీనివల్ల వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరింత ఆదాయం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఈఎంఐలను తగ్గించాలని కూడా కోరడం జరిగింది. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తేనే ఇది సాధ్యపడుతుంది.  ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని మరింతగా వినియోగదారులకు బదిలీ చేస్తే ఈఎంఐల భారం తగ్గుతుంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమాని తెలిపారు. ‘‘నియంత్రణ వాతావరణం మెరుగుపరచడం, వ్యాపార సులభతర నిర్వహణ తదితర అంశాలపై ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో మాట్లాడారు. అలాగే, ఎగుమతుల విషయంలో పోటీతత్వం పెంపు, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకునేలా చర్యలు తీసుకోవడంపై సూచనలు చేశారు’’ అని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. వేగంగా ఎఫ్‌డీఐలకు అనుమతులు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం వేగవంతం చేయడం, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ పెంపుపైనా ఈ సమావేశంలో సూచనలు వచ్చాయి. జీఎంఆర్‌ గ్రూపు చైర్మన్‌ బీవీఎన్‌ రావు, అశోక్‌లేలాండ్‌ ఎండీ, సీఈవో విపిన్‌ సోంధి, విప్రో గ్లోబచ్‌ సీఎఫ్‌వో జతిన్‌దలాల్‌, పతంజలి ఆయుర్వేద్‌ చైర్మన్‌ ఆచార్య బాలకృష్ణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఆదాయపన్ను సీలింగ్‌ పెంచాలి...
కనీస వేతనాన్ని రూ.21,000 చేయాలని, ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ కింద కనీస పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని, వార్షికంగా రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారిని ఆదాయపన్ను నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిని కార్మిక సంఘాలు కోరాయి. బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా తమ డిమాండ్లను మంత్రి ముందుంచాయి. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంపై ఆందోళనను వ్యక్తం చేశాయి. ఉద్యోగ కల్పన దిశగా రానున్న బడ్జెట్‌లో ఉండాల్సిన చర్యలను సూచించాయి. 

 • మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాలు, వ్యవసాయంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేయడం ద్వారా ఉద్యోగాలను కల్పించొచ్చు.
 • అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, అదనపు పోస్టులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. 
 • నిత్యావసర వస్తువులను స్పెక్యులేటివ్‌ ఫార్వార్డ్‌ ట్రేడింగ్‌ నుంచి నిషేధించాలి. 
 • సామర్థ్యాలు ఉండి కూడా దెబ్బతిన్న ప్రభుత్వరంగ సంస్థలను పునరుద్ధరించేందుకు బడ్జెట్‌ నుంచి నిధుల సహకారం ఇవ్వాలి. 
 • 10 మంది ఉద్యోగులను కలిగిన కంపెనీలనూ ఈపీఎఫ్‌వో పరిధిలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఇది కనీసం 20 మంది ఉద్యోగులున్న కంపెనీలకు వర్తిస్తోంది.
 • గ్రాట్యుటీని ఏడాదిలో 15 రోజులకు కాకుండా కనీసం 30రోజులకు చెల్లించేలా చేయాలి. 
 • హౌసింగ్‌, మెడికల్‌, ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఇస్తున్న అలవెన్స్‌లపై పన్ను మినహాయింపు ఇవ్వాలి. 
 • స్టీల్‌, బొగ్గు, మైనింగ్‌, హెవీ ఇంజనీరింగ్‌, ఫార్మా, డ్రెడ్జింగ్‌, సివిల్‌ ఏవియేషన్‌, ఫైనాన్షియల్‌ రంగంలోని ప్రభుత్వరంగ సంస్థలను వ్యూహాత్మక విక్రయాలకు దూరంగా ఉంచాలి. 
 • గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పట్టణాలకూ విస్తరించి ఏడాదిలో 200 రోజులు ఉపాధి కల్పించాలి. 
 • రైల్వే, రక్షణ ఉత్పత్తి, ఫైనాన్షియల్‌, రిటైల్‌ ట్రేడ్‌లోకి ఎఫ్‌డీఐలను నిరోధించాలి.
 • కార్మికుల హక్కులకు భంగం కలిగించే కార్మిక చట్ట సవరణలను నిలిపివేయాలి.  You may be interested

క్రెడాయ్‌ రియాల్టీ పురస్కారాలు..28న

Friday 20th December 2019

క్రిసిల్‌ సంస్థద్వారా ప్రాజెక్టుల పనితీరు పరిశీలన నిర్మాణ రంగంలో నాణ్యతతో పాటు వినియోగదారుడి భద్రతకు పెద్దపీట వేసిన డెవలపర్‌ను ప్రోత్సహించేందుకే పురస్కారాలను ఆరంభించినట్లు కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలంగాణ శాఖ ఛైర్మన్‌ గుమ్మి రామిరెడ్డి, అధ్యక్షుడు సీహెచ్‌ రామచంద్రారెడ్డి చెప్పారు. గురువారమిక్కడ విలేకరులతో వారు మాట్లాడారు. ఈ నెల 28న క్రియేట్‌-2019 పేరిట హైదరాబాద్‌ ‘జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌’లో క్రెడాయ్‌ తెలంగాణ రియాల్టీ

యస్‌ బ్యాంకులో ఉన్నట్టుండి ఎందుకంత చలనం?

Thursday 19th December 2019

యస్‌ బ్యాంకు స్టాక్‌ గురువారం ఇన్వెస్టర్లను అయోమయానికి గురి చేసింది. ఉదయం సెషన్‌లో స్టాక్‌ 4 శాతం నష్టపోయి రూ.45 వరకు పడిపోగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటర్లో ఒక్కసారిగా యాక్టివిటీ పెరిగిపోయింది. అక్కడి నుంచి స్టాక్‌ ఏకంగా 10 శాతానికి పైగా పెరిగింది. రూ.50.90 వరకు వెళ్లి, చివరికి రూ.49.90 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. దీని వెనుక నిధుల సమీకరణ, ఎఫ్‌అండ్‌వోలో బ్యాన్‌ అంశాలు కారణమై ఉండొచ్చని

Most from this category