News


పౌల్ట్రీకి రూ. 1,750 కోట్ల నష్టాలు

Tuesday 3rd March 2020
news_main1583206498.png-32232

  • వైరస్ వదంతులతో పౌల్ట్రీకి రూ. 1,750 కోట్ల నష్టాలు
  • ఆదుకోవాలంటూ కేంద్రానికి పరిశ్రమ వినతి

న్యూఢిల్లీ: చికెన్ వల్ల కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రబలుతోందన్న వదంతుల మూలంగా పౌల్ట్రీ పరిశ్రమ గణనీయంగా దెబ్బతింది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 1,750 కోట్ల మేర నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో తక్ష౾ణం సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖకు పౌల్ట్రీ రంగం విజ్ఞప్తి చేసింది. చికెన్‌కు డిమాండ్ తగ్గిపోవడంతో కోళ్ల ధరలు కేజీకి రూ. 10-30 స్థాయికి (ఫాం గేట్) పడిపోయినట్లు అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (ఏఐపీబీఏ) వెల్లడించింది. మరోవైపు సగటు ఉత్పత్తి ధర కేజీకి రూ. 80గా ఉంటోందని వివరించింది. "సోషల్ మీడియాలో పదే పదే వదంతులు వ్యాప్తి కావడంతో.. చికెన్‌పై వినియోగదారుల నమ్మకం సడలింది. చికెన్ ఉత్పత్తుల డిమాండ్ పడిపోయింది" అని ఏఐపీబీఏ చైర్మన్ బహదూర్ అలీ తెలిపారు. దీంతో జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి మూడో వారం మధ్య కాలంలో బ్రాయిలర్ రైతులు, బ్రీడింగ్ సంస్థల నష్టాలు దాదాపు రూ. 1,750 కోట్లకు చేరాయని ఆయన వివరించారు. ఈ భారీ సంక్షోభంతో పౌల్ట్రీ రంగం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగిన పక్షంలో ప్రతి నెలా రూ. 1,750 కోట్ల నష్టాల భారం పడుతుందన్నారు. దేశీ పౌల్ట్రీ రంగంలో దాదాపు 10 లక్షల మంది పైగా రైతులు ఉపాధి పొందుతున్నారు. 

సోయా రైతులకూ కష్టమే...
దేశీయంగా జొన్న, సోయాబీన్ల వినియోగం ఎక్కువగా పౌల్ట్రీ రంగంలోనే ఉంటోందని.. ఇది గానీ దెబ్బతిందంటే ఆయా రైతులకూ కష్టం తప్పదని అలీ తెలిపారు. గడిచిన కొద్ది రోజుల్లోనే జొన్నల ధర కేజీకి రూ. 25 నుంచి రూ. 15కి పడిపోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమకు అదనపు మూలధనం సమకూర్చాలని, పౌల్ట్రీ రైతులు.. కంపెనీల బాకీలు 90 రోజులు దాటినా మొండిపద్దుల కింద వర్గీకరించకుండా బ్యాంకులకు సూచించాలని ప్రభుత్వాన్ని ఏఐపీబీఏ కోరింది. అలాగే, 5 శాతం వడ్డీ రాయితీ వెసులుబాటును పౌల్ట్రీ రంగ రుణాలకు కూడా వర్తింపచేయాలని, ప్రస్తుతం తీసుకున్న టర్మ్ రుణాల చెల్లింపునకు ఏడాది పాటు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇక ప్రభుత్వం వద్ద ఉన్న నిల్వల నుంచి పౌల్ట్రీ పరిశ్రమకు కనీసం 30 లక్షల టన్నుల మేర బియ్యం, గోధుమలు.. కేజీకి రూ. 10 చొప్పున సబ్సిడీ రేటుపై ఇవ్వాలని కోరింది. 



You may be interested

అమెరికా స్టాక్స్‌ జోరు- యాపిల్‌ దూకుడు

Tuesday 3rd March 2020

5 శాతం జంప్‌చేసిన ఇండెక్సులు 2009 తదుపరి రికార్డ్‌ లాభం ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సైతం​రికార్డ్స్‌ సహాయక ప్యాకేజీలపై అంచనాలు కోవిడ్‌-19 భయాలతో పతన బాటలో సాగుతున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లలో ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌ కాలుదువ్వింది. కొమ్ములతో బేర్‌ ట్రెండ్‌ను కుమ్మేసింది. దీంతో డోజోన్స్‌ 2009 తదుపరి అత్యధికంగా లాభపడింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న ఆందోళనలకు చెక్‌ పెడుతూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, జపాన్‌, చైనా తదితర దేశాల కేంద్ర

వజ్రాల ఎగుమతులకు వైరస్‌..!

Tuesday 3rd March 2020

ముంబై: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 వైరస్ మరింతగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత వజ్రాల ఎగుమతులు గణనీయంగా తగ్గనున్నాయి. 2020-21 ఆఖరు నాటికి 19 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోనున్నాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలోనూ ఎగుమతులు తగ్గడమో లేదా అదే స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. 2018-19లో భారత్‌ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో

Most from this category