News


వాహనాల తయారీకి కరోనా బ్రేక్‌..

Monday 23rd March 2020
news_main1584931265.png-32619

  • ఉత్పత్తి నిలిపివేస్తున్న ఆటోమొబైల్ కంపెనీలు
  • జాబితాలో మారుతీ, హోండా, ఫియట్‌ తదితర సంస్థలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) గురుగ్రామ్‌, మానెసర్‌లోని (హర్యానా) తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి. అటు రోహ్‌తక్‌లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. షట్‌డౌన్ ఎన్నాళ్ల పాటు ఉంటుందనేది ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుందని వివరించింది. అటు హోండా కార్స్‌ ఈ నెలాఖరు దాకా తమ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. గ్రేటర్ నోయిడా (ఉత్తర్‌ ప్రదేశ్‌), తాపుకరా (రాజస్థాన్‌)లోని ప్లాంట్లలో మార్చి 23 నుంచి 31 దాకా తాత్కాలికంగా తయారీ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. తప్పనిసరి సర్వీసుల విభాగాల సిబ్బంది మినహా మిగతా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని హెచ్‌సీఐఎల్ ప్రెసిడెంట్ గకు నకానిషి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నప్పటికీ .. ప్రభుత్వ ఆదేశాలు, మార్కెట్ పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుందని వివరించారు. 
    మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మహారాష్ట్రలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాగ్‌పూర్‌ ప్లాంట్‌లో ఇప్పటికే ఆపివేశామని, చకన్‌ (పుణె), కాండివిలి (ముంబై) ప్లాంట్లలో సోమవారం నుంచి నిలిపివేస్తామని పేర్కొంది. అటు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్‌ సైతం తమ ప్లాంట్లో ఈ నెలాఖరుదాకా ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. "మహారాష్ట్రలో .. ముఖ్యంగా పుణెలో కొవిడ్‌-19 కేసులు బైటపడిన నేపథ్యంలో తయారీ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం" అని వివరించింది. ప్లాంటు మూతబడిన వ్యవధిలో ఉద్యోగుల తొలగింపు ఉండబోదని, సిబ్బంది అందరికీ యధాప్రకారం జీతభత్యాలు అందుతాయని స్పష్టం చేసింది. ఎంజీ మోటార్ ఇండియా సంస్థ గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంటును మార్చి 25 దాకా మూసివేస్తున్నట్లు తెలిపింది. 

ఇతర దేశాల్లోను: హీరో మోటోకార్ప్‌
ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌తో పాటు కొలంబియా, బంగ్లాదేశ్‌ తదితర విదేశీ ప్లాంట్లలో కూడా కార్యకలాపాలు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ వెల్లడించింది. మార్చి 31 దాకా ఇది అమలవుతుందని పేర్కొంది. జైపూర్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సహా ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు నివాసాల నుంచే విధులు నిర్వర్తిస్తారని వివరించింది. అత్యవసర సర్వీసుల సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు హాజరవుతారని పేర్కొంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) భారత్‌లోని మొత్తం నాలుగు ప్లాంట్లలోనూ కార్యకలాపాలు తక్షణమే నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

మహీంద్రా ఫండ్‌...
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొద్ది వారాల పాటు లాక్‌డౌన్ చేయాలంటూ ప్రతిపాదించారు. పెద్ద ఎత్తున తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, ఆర్మీకి తమ గ్రూప్ ప్రాజెక్ట్ టీమ్ పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. "మా మహీంద్రా హాలిడేస్ సంస్థ తరఫున మా రిసార్ట్‌లను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చి, సేవలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం" అని ఆనంద్ మహీంద్రా తెలిపారు.  వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్నందున.. తమ ఉత్పత్తి ప్లాంట్లలో వాటిని తయారు చేయడంపై తక్షణం కసరత్తు ప్రారంభించామని తెలిపారు. అత్యంత ప్రతికూల ప్రభావాలెదుర్కొనే చిన్న వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి పొందేవారికి తోడ్పాటు అందించేందుకు మహీంద్రా ఫౌండేషన్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుందని ఆనంద్ మహీంద్రా చెప్పారు. తన పూర్తి వేతనాన్ని ఫండ్‌కు విరాళమిస్తున్నట్లు.. ఇతర ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళమివ్వొచ్చని ఆయన తెలిపారు.You may be interested

కరోనాపై ఆర్‌బీఐ యుద్ధం!!

Monday 23rd March 2020

ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు వ్యాపార విపత్తు ప్రణాళిక అమలు  వార్‌ రూమ్ ఏర్పాటు ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో వార్ రూమ్ అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్‌బీఐ

సంక్షోభాన్ని అధిగమించేందుకు చేయూత కావాలి : కేంద్రానికి పరిశ్రమల వినతి

Monday 23rd March 2020

ఆర్థిక ఉద్దీపనలు.. రుణ చెల్లింపులపై మారటోరియం న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని దేశీయ పరిశ్రమలు కేంద్రాన్ని కోరాయి. రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం, పన్నుల తగ్గింపు, ప్రజలకు రూ.2లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు అందించాలని సూచించాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్‌ రాకముందే మందగమనంలో ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయి 4.7 శాతానికి

Most from this category