News


నిర్మాణ రంగంలోనూ ద్వైపాక్షికం

Wednesday 7th August 2019
news_main1565154865.png-27593

  • భారత్‌తో వాణిజ్య బంధం ఇంకా పెరగాలి
  • ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆకాంక్ష

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండియా – ఇజ్రాయిల్‌ దేశాల మధ్య ఇన్నాళ్లుగా రక్షణ, వ్యవసాయ రంగాల్లో మాత్రమే ద్వైపాక్షి వాణిజ్యం జరిగిందని, ఇక నుంచి సాంకేతికత, మౌలిక, నిర్మాణ రంగాల్లో బలపడాల్సిన అవసరముందని ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో మాదిరిగా మౌలిక, నిర్మాణ రంగంలోనూ సాంకేతికత, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్సీ (ఏఐ), రోబోటిక్స్‌ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరగాలని చెప్పారాయన. అప్పుడే నిర్మాణాలు వేగవంతం కావటంతో పాటూ ఉత్పాదక వ్యయం తగ్గుతుందని, దీంతో ధరలు కూడా తగ్గే అవకాశముంటుందని తెలియజేశారు. ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవీవ్‌ నగరంలో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) న్యాట్‌కాన్‌ సదస్సు– 2019 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి  నెతన్యాహు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

  • 102 మిలియన్‌ డాలర్ల రియల్టీ...

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇజ్రాయిల్‌ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇఫత్‌ షాషా బిటోన్‌ మాట్లాడుతూ.. ‘‘1992లో ఇండియా– ఇజ్రాయిల్‌ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రారంభమైంది. మొదట్లో 200 మిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం.. ప్రస్తుతం 5.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇందులో రియల్‌ ఎస్టేట్‌ వాటా 102 మిలియన్‌ డాలర్లుగా ఉంది’’ అని తెలియజేశారు. మౌలిక, నిర్మాణ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి వాణిజ్యం మరింత బలపడాలని సూచించారు. ఇప్పటికే నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌ను రెండు సార్లు సందర్శించారని, వచ్చే నెలలో మరోసారి పర్యటించనున్నారని తెలియజేశారు.

  • ప్రతికూలంలో రియల్టీ...

రెరా, ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ వంటి కొత్త చట్టాల్ని రియల్టీ రంగంలో అమలు చేయటం అంత సులువైన విషయం కాదని, దీనికి కొంత సమయం పడుతుందని అప్పటివరకు ప్రతికూల పరిస్థితులు తప్పవని హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ రేణు సూద్‌ కర్నాడ్‌ చెప్పారు. స్వల్పకాలంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో శాశ్వత ప్రయోజనాలు దక్కుతాయని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్, మార్కెట్‌ వ్యవస్థలో నిధుల సమస్య ఉందని, అందుకే ప్రాజెక్ట్‌ ఫండింగ్‌ పూర్తి స్థాయిలో జరగట్లేదని తెలియజేశారు. అంతిమ కొనుగోలుదారుడిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్, కన్‌స్ట్రక్షన్, ఫండింగ్‌ ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెల్‌ అవీవ్‌ డెప్యూటీ మేయర్‌ అసఫ్‌ హరెల్, ఇండియా ఇజ్రాయిల్‌ అంబాసిడర్‌ పవన్‌ కపూర్, సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్‌ అండ్‌ సీఈఓ అన్షుమన్‌ మేగజైన్, క్రెడాయ్‌ చైర్మన్‌ జక్షయ్‌ షా, నేషనల్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ మగర్, న్యాట్‌క్యాన్‌ కన్వినర్‌ గుమ్మి రాంరెడ్డి, కో–కన్వినర్‌ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలోని 200కు పైగా క్రెడాయ్‌ చాప్టర్ల నుంచి 1,200 మందికి పైగా డెవలపర్లు పాల్గొన్నారు.



You may be interested

ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు ఆరంభం

Wednesday 7th August 2019

న్యూయార్క్‌: ఐఫోన్‌ యూజర్లు ‘ఆపిల్ కార్డ్’ సేవలను ఈ మంగళవారం నుంచి వినియోగించుకోవచ్చని టెక్ దిగ్గజం ఆపిల్ ప్రకటించింది. వాలెట్‌ యాప్‌ నుంచి క్రెడిట్‌ కార్డ్‌ కావాలని దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ భాగస్వామ్యంతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ.. ఆపిల్‌ బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ సేవలను తొలుత అమెరికాలో ప్రారంభించనున్నట్లు వివరించింది. వీలైనన్ని సైన్‌-అప్స్‌ను పెంచడం ద్వారా

రాయల్‌ జెల్లీ హనీ రూ.1.5 లక్షలు

Wednesday 7th August 2019

ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె రకం ఇదే అందుబాటులో 100కుపైగా రకాల వెరైటీలు రూ.1,560 కోట్లకు భారత హనీ మార్కెట్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- తేనె అంటే ఇష్టపడని వారుండరు. సహజసిద్ధమైంది కావడం, ఔషధ గుణాలు బోలెడు ఉడడం, అలాగే రుచిలో మేటి కారణంగా దీని స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. మినరల్స్‌, విటమిన్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌ నిండుగా ఉండడంతో ఫుడ్‌ సప్లిమెంట్స్‌, సౌందర్య సాధనాలతోపాటు ఔషధాల తయారీలో కూడా తేనెను విరివిగా వాడుతున్నారు. ఒక్క భారత్‌

Most from this category