News


‘నల్లబంగారం’ ఇక జిగేల్‌!

Thursday 2nd January 2020
news_main1577936787.png-30605

  • వేగం పుంజుకోనున్న బొగ్గు ఉత్పత్తి...
  • వచ్చే ఐదేళ్లలో వేలానికి 200 బొగ్గు బ్లాకులు
  • ప్రైవేటు రంగానికి భారీ అవకాశాలు...
  • 2024 నాటికి దిగుమతులకు చెక్‌...


న్యూఢిల్లీ: దేశంలో అపారంగా బొగ్గు నిక్షేపాలు ఉండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కోల్‌ ఇండియా ఒక్కటీ దేశ అవసరాల్లో అధిక శాతం తీరుస్తోంది. అయినా, అవసరానికంటే ఉత్పత్తి తక్కువగానే ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా దిగుమతుల భారానికి కళ్లెం వేసేందుకు ప్రైవేటు రంగాన్ని ఇందులోకి అనుమతించాలని కేంద్ర సర్కారు లోగడే నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్ల కాలంలో 200 బొగ్గు గనులను (బ్లాకులు) వాణిజ్య ప్రాతిపదికన తవ్వితీసేందుకు వేలం వేయనుంది. గరిష్టంగా 400 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా 2024 నాటికి విద్యుత్‌ సంస్థలు బొగ్గు దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నది అంచనా. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. 
త్వరలోనే వేలం...
పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు గాను మొదటి విడతగా 40 బొగ్గు బ్లాకులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం వేలానికి తీసుకురానుంది. వీటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1-50 మిలియన్‌ టన్నుల మధ్య ఉండనుంది. వాణిజ్య బొగ్గు గనుల వేలానికి సంబంధించి బిడ్డింగ్‌ నిబంధనలను ఈ నెలాఖరుకు విడుదల చేసి, వచ్చే నెలలో భాగస్వాముల అభిప్రాయాలను స్వీకరించనున్నట్టు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వేలానికి వచ్చే బ్లాకుల్లో కొన్నింటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 30-50 మిలియన్‌ టన్నుల మధ్య ఉంటుందని తెలిపారు. కొన్ని బ్లాకుల్లో నిల్వల సమాచారం కచ్చితంగా గుర్తించగా, మరికొన్నింటిలో పాక్షికంగానే అది జరిగిందన్నారు. వీటి వల్ల దేశీయంగా బొగ్గు ఉత్పత్తి లోటు కొంత వరకు తీరుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో 235 మిలియన్‌ టన్నుల బొగ్గు దిగుమతులు జరిగాయి. వీటిల్లో 125 మిలియన్‌ టన్నుల మేర థర్మల్‌ బొగ్గు (54 శాతం) దిగుమతులే కావడం గమనార్హం. ఐరన్‌, స్టీల్‌ తయారీకి కోకింగ్‌ కోల్‌ అవసరం అవుతుంది. మన దేశంలో కోకింగ్‌ కోల్‌ లభ్యత లేనందున ఐరన్‌, స్టీల్‌ కంపెనీలకు దిగుమతే మార్గం. కానీ, విద్యుత్‌ తయారీకి వినియోగించే థర్మల్‌ బొగ్గును దిగుమతి చేసుకోకుండా దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవచ్చు.
ఆదాయంలో వాటా...
వేలానికి పరిగణిస్తున్న వాటిల్లో చెండిపడ-1, 2, మదన్‌పూర్‌ నార్త్‌, ఫతేపూర్‌, ఫతేపూర్‌ ఈస్ట్‌, మహానంది, మచ్చకట బ్లాకులు ఉన్నట్టు ఆ అధికారి వెల్లడించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి నిర్దేశిత వాటాను లీజుదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈ బొగ్గు బ్లాకుల ఉత్పత్తిని త్వరంగా ఆరంభించేందుకు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనుంది. నాలుగు, ఐదో దశ వేలంలో పరిశ్రమల నుంచి స్పందన ఆశించిన మేర లేదు. దీంతో మాజీ సీవీసీ ప్రత్యూష్‌ సిన్హా సిఫారసుల మేరకు ఆదాయంలో వాటా ప్రాతిపదికన బొగ్గు బ్లాకులను వేలం వేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. వేలంలో బొగ్గు గనులను సొంతం చేసుకున్న సంస్థలు, నిర్దేశిత కాల వ్యవధి కంటే ఏడాది ముందే ఉత్పత్తిని ప్రారంభిస్తే అందుకు ప్రోత్సాహకంగా ఆదాయంలో వాటాను 10 శాతం ప్రభుత్వం తగ్గించుకోనుంది. అదే విధంగా షెడ్యూల్‌ కంటే రెండేళ్ల ముందే ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొ‍స్తే ఈ తగ్గింపు 20 శాతంగా ఉండనుంది. బొగ్గు బ్లాకుల నుంచి కనీస ఉత్పత్తికి షరతులు విధించడంతోపాటు, అందుకు అనుగుణంగా బ్యాంకు గ్యారంటీలను కూడా తీసుకోనుంది. అలాగే, ఈ బ్లాకుల నుంచి ఉత్పత్తి చేసే బొగ్గు ధరలు, విక్రయాలు, మార్కెటింగ్‌ను ప్రభుత్వం నియంత్రించబోదు.
125 టన్నులకు కోల్‌ ఇండియా ఉత్పత్తి...
ప్రభుత్వరంగ సంస్థ కోల్‌ ఇండియా గత ఏడాది కాలంలో 16 బొగ్గు బ్లాకులను సొంతం చేసుకోగా, వీటి సాయంతో సంస్థ ఉత్పత్తి 125 మిలియన్‌ టన్నులకు చేరనుందని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఈ బ్లాకుల్లో ఉత్పత్తి మూడు నుంచి ఆరేళ్లలో ప్రారంభమవుతుందని చెప్పారు. ‘‘2023-24 నాటికి ఒక బిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు కంపెనీకి సాయపడుతుంది. ఇటీవలి కేటాయించిన వాటిల్లో కొన్నింటిలో 2-3 ఏళ్లు, ఇతర బ్లాకుల్లో ఉత్పత్తికి మరింత సమయం తీసుకుంటుంది’’ అని కోల్‌ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఈ బ్లాకుల్లో వెలికితీత కార్యకలాపాలను కోల్‌ ఇండియా త్వరగా ప్రారంభించాలని కేంద్రం కోరుకుంటోంది. You may be interested

గురువారం వార్తల్లోని స్టాక్స్‌

Thursday 2nd January 2020

కొత్త ఏడాది(2020) ప్రారంభం​సందర్భంగా అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సెలవుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఆసియాలో జపాన్‌ మినహా మిగిలిన మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వాణిజ్య వివాదాల పరిష్కారానికి వీలుగా ఈ నెల 15న చైనాతో​ ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో చైనాసహా పలు ఆసియా మార్కెట్లు 1.3-0.3 శాతం మధ్య ఎగశాయి. దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం సానుకూలం‍గా

స్వల్ప లాభాలతో ప్రారంభం

Thursday 2nd January 2020

ఆసియా ట్రెండ్‌ను అనుసరిస్తూ గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప లాభంతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 41,340 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల పెరుగుదలతో 12,198 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. న్యూఇయర్‌ సెలవుల అనంతరం ఈ రోజు ట్రేడింగ్‌ను ప్రారంభించిన చైనా, హాంకాంగ్‌, తైవాన్‌ మార్కెట్లు 1.2 శాతం జంప్‌చేశాయి. జనవరి 15న ట్రేడ్‌డీల్‌పై సంతకాలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌

Most from this category