News


మొత్తం బాకీలన్నీ మాఫీ చేయండి

Saturday 2nd November 2019
news_main1572667316.png-29297

  • లేకపోతే జరిమానాలు, వడ్డీల భారమైనా తగ్గించండి
  • బకాయిల చెల్లింపునకు 2 ఏళ్ల మారటోరియం ఇవ్వండి
  • స్పెక్ట్రం, లైసెన్సు ఫీజులపై కేంద్రానికి సీవోఏఐ మరో లేఖ

న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌-ఐడియాలతో పాటు మిగతా టెల్కోల మొత్తం పాత బకాయీలు (సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) మాఫీ చేసేయాలని కోరింది. అలా కుదరకపోతే కనీసం వడ్డీలు, పెనాల్టీలైనా రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. గతంలో రాసిన లేఖకు అనుబంధంగా కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్‌ అక్టోబర్ 31న తాజా లేఖ రాశారు. 
    కేంద్రం చెబుతున్నట్లుగా ఏజీఆర్‌ (సవరించిన స్థూల ఆదాయం) ఫార్ములాకు తగ్గట్లు పాత బకాయిలన్నింటిని లెక్కగట్టి, కేంద్రానికి చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు అక్టోబర్ 24న టెల్కోలను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం భారతి ఎయిర్‌టెల్ ఏకంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ - ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు పైగా కట్టాల్సి రావొచ్చని అంచనా. ఈ నేపథ్యంలోనే బాకీలను మాఫీ చేయాలంటూ సీవోఏఐ కేంద్రాన్ని కోరుతోంది. అటు టెలికం రంగం సంక్షోభ పరిస్థితుల పరిష్కారంపై కేంద్రం కూడా దృష్టి సారించింది. అయితే, కొత్త తరం టెలికం సంస్థ జియో మాత్రం బకాయీల మాఫీని వ్యతిరేకిస్తోంది. టెల్కోల ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని, వాటికి ప్రజల డబ్బును ప్యాకేజీగా ఇవ్వనక్కర్లేదని టెలికం మంత్రికి లేఖ కూడా రాసింది. కానీ ఈ అభ్యంతరాలను పట్టించుకోకుండా సీవోఏఐ కొత్తగా మరో లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

పదేళ్ల వ్యవధైనా ఇవ్వండి ...
"మొత్తం బకాయీలను మాఫీ చేసే అవకాశం లేకపోతే.. వడ్డీలు, జరిమానాలు, పెనాల్టీపై వడ్డీలనైనా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వివాదాస్పద బకాయిలు ఏకంగా 14 ఏళ్ల నుంచి పోగుపడినవి కావడంతో.. అసలు బాకీని తీర్చేందుకు కనీసం 10 ఏళ్ల వ్యవధి, రెండేళ్ల మారటోరియం ఇవ్వాలని కోరుతున్నాం" అని లేఖలో మాథ్యూస్ పేర్కొన్నారు. స్పెక్ట్రం యూసేజి చార్జీలకు సంబంధించి 2020 ఏప్రిల్ నుంచి 2022 మార్చి దాకా మారటోరియం ఇవ్వాలని కోరారు. తద్వారా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం రంగానికి కాస్త ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.  అటు భారతి ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్‌, ఆయన సోదరుడు రాజన్ మిట్టల్‌ .. కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు ఇచ్చిన వినతిపత్రంలో అంశాలే ఈ లేఖలో కూడా ఉండటం గమనార్హం. 

ఐయూసీ చార్జీలు ఎత్తేయాలి: టెలికం యూజర్ల సంస్థ విజ్ఞప్తి
ముందుగా ప్రతిపాదించినట్లుగా జనవరి 1 నుంచి ఇంటర్‌కనెక్షన్‌ యూసేజ్ చార్జీలను (ఐయూసీ) ఎత్తివేయాలంటూ టెలికం వినియోగదారుల సంస్థ టీయూజీ కేంద్రాన్ని కోరింది. ఈ చార్జీల వల్ల బలహీన వర్గాలు.. మెరుగైన కొత్త తరం టెలికం సర్వీసులను పొందలేకపోతున్నారని పేర్కొంది. పరిశ్రమవర్గాల గణాంకాల ప్రకారం.. ఐయూసీ కింద యూజర్లు ఏటా రూ. 200 కోట్లు చెల్లిస్తున్నట్లు టీయూజీ తెలిపింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించిందుకు టెల్కోలు పరస్పరం చెల్లించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం నిమిషానికి ఆరు పైసలుగా ఉన్న ఐయూసీని జనవరి 1 నుంచి ఎత్తివేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ప్రతిపాదించినప్పటికీ.. తాజాగా దీని గడువును పొడిగించే అంశం పరిశీలిస్తోంది. ఈ అంశంపై కూడా పాత టెల్కోలు (ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా), కొత్త టెల్కో జియోకి మధ్య వివాదం నడుస్తోంది. జియో దీన్ని వ్యతిరేకిస్తుండగా.. పాత టెల్కోలు ఐయూసీని కొనసాగించాలని కోరుతున్నాయి. 

రింగ్ వ్యవధి 30 సెకన్లు...
టెలిఫోన్‌ రింగ్ అయ్యే వ్యవధిని నిర్దేశిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లకైతే ిది 30 సెకన్లుగాను, ల్యాండ్‌లైన్‌ ఫోన్లకైతే 60 సెకన్లుగాను నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత నిబంధనలకు సవరణ చేసింది. ఇప్పటిదాకా భారత్‌లో రింగింగ్‌ వ్యవధిపై ఇలాంటి పరిమితులేమీ లేవు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి రివర్స్ కాల్స్‌ వస్తే ఐయూసీ రూపంలో ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతో.. టెలికం సంస్థలు ఫోన్ రింగ్ అయ్యే వ్యవధిని తగ్గించేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఫోన్‌ ఎక్కువ సేపు మోగకపోవడం వల్ల మిస్డ్‌ కాల్‌ అయి ఉంటుందనే ఉద్దేశంతో .. ఇతర టెల్కో యూజరు తిరిగి ఆ నంబరుకు కాల్ చేస్తారు. ఇందుకు గాను సదరు యూజరుకు సేవలు అందించే టెలికం సంస్థ.. ఆ కాల్ స్వీకరించిన రెండో టెలికం సంస్థకు ఐయూసీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆయా కంపెనీలకు లాభసాటిగా ఉంటోందని ఆరోపణలు ఉన్నాయి. You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు

Saturday 2nd November 2019

న్యూఢిల్లీ: రుణాల సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)లో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కేంద్రం దృష్టి సారించింది. నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆధారాలు బైటపడుతుండటంతో.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ (ఎస్‌ఎఫ్‌ఐవో)ను ఆదేశించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో దాదాపు రూ. 31,000 కోట్లను డొల్ల కంపెనీల ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు మళ్లించేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని క్షుణ్నంగా

ఆశాజనకంగా అక్టోబర్‌ ఆటో అమ్మకాలు

Saturday 2nd November 2019

7 నెలల తరువాత పెరిగిన మారుతీ విక్రయాలు పుంజుకుంటున్న మహీంద్ర, టయోటా న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ అమ్మకాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆటో రంగం అక్టోబర్‌ నెల్లో ఆశాజనక వాతావరణాన్ని నమోదుచేసింది. ఈ రంగంలోని దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ ఇండియా వంటి సంస్థలు అమ్మకాల్లో పురోగతిని చూపాయి. దాదాపు 7 నెలల అనంతరం మారుతీ 4.5 శాతం వృద్ధి రేటుతో సానుకూల సంకేతాలను ఇచ్చింది. ప్యాసింజర్‌, వాణిజ్య విక్రయాలు గతంతో పోల్చితే అక్టోబర్‌లో

Most from this category