News


టెలికంను కష్టాల నుంచి గట్టెక్కించండి

Saturday 21st December 2019
news_main1576900065.png-30346

  • లైసెన్స్‌, స్పెక్ట్రమ్‌ చార్జీలు తగ్గించాలి
  • సీవోఏఐ వినతి

న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమ తాను ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 2020-21 బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల సమావేశం జరిగింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.47 లక్షల కోట్లను బకాయిలుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని పరిష్కరించాలని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ‘‘ఏజీఆర్‌ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాం. ప్రస్తుతం ఆదాయంలో 8 శాతంగా ఉన్న స్పెక్ట్రమ్‌ ఫీజును 3 శాతానికి తగ్గించాలని కోరాం. స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీని ప్రస్తుతమున్న 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని అడిగాం. తగిన వ్యవధిలోపు దీన్ని చేస్తారేమో చూడాలి. ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంకును ఏర్పాటు చేసి, పన్ను రహిత బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించి.. తక్కువ రేటుకు రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని కూడా కోరాం’’ అని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో స్పష్టత కోసం వేచి చూస్తున్నామని టెలికం శాఖ తమకు తెలిపినట్టు చెప్పారు. జీఎస్‌టీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ బకాయిలు రూ.36,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరినట్టు వెల్లడించారు. ‘‘స్పెక్ట్రమ్‌, లైసెన్స్‌ ఫీజుపై 18 శాతం పన్ను విధిస్తున్నారు. ఎందుకంటే వీటిని సేవలుగా పేర్కొన్నారు. అవి సేవలు కావని వివరించాం’’ అని మాథ్యూస్‌ తెలిపారు. టెలికం ఎక్విప్‌మెంట్‌ దిగుమతులపై అధిక సుంకాలు.. నెట్‌వర్క్‌ విస్తరణ, నూతన టెక్నాలజీలపై ప్రభావం చూపిస్తున్నందున వాటిని తొలగించాలని కోరినట్టు చెప్పారు. ఏజీఆర్‌ బకాయిల రూపేణా భారతీ ఎయిర్‌టెల్‌ ఒక్కటే రూ.35,586 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.53,038 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 
మౌలిక రంగం డిమాండ్లు...
క్యాప్టివ్‌ రెన్యువబుల్‌ పాలసీని (పరిశ్రమల సొంత అవసరాల కోసం ఏర్పాటు చేసే విద్యుత్‌ ప్లాంట్లు) తీసుకురావాలని, ఫ్యాక్టరీ సరిహద్దులకు వెలుపల శుద్ధ ఇంధనాలతో ప్లాంట్లు ఏర్పాటు చేయాలనుకుంటే, దాన్ని లాభసాటిగా మార్చేందుకు క్రాస్‌ సబ్సిడీ, ట్రాన్స్‌మిషన్‌ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని మౌలిక రంగం కోరింది. సిమెంట్‌, స్టీల్‌ వినియోగాన్ని పెంచేందుకు గాను రియల్‌ఎస్టేట్‌ రంగానికి, అందుబాటు ధరల ఇళ్లకు రుణాల లభ్యత ఉండేలా చూడాలని కోరింది. 12 నుంచి 15 గిగావాట్ల మేర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్టు సిమెంట్‌ కంపెనీలు ప్రభుత్వానికి తెలియజేశాయి. బయో ఫర్టిలైజర్‌ను ప్రోత్సహించాలని, పునరుత్పాదక ఇంధన నిల్వను ప్రోత్సహించేందుకు బ్యాటరీలకు వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ సమకూర్చాలనే డిమాండ్లను కూడా మౌలిక పరిశ్రమలు మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లాయి. 

సందేహాత్మక స్థితి నుంచి బయటకు రావాలి...
దేశీయ పరిశ్రమలు సందేహాత్మక స్థితి నుంచి బయటకు రావాలని, సహజ ఉత్సాహాన్ని ప్రదర్శించాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. బడ్జెట్‌ తర్వాత నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నట్టు ఆమె చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన అసోచామ్‌ సదస్సులో ఆమె మాట్లాడారు. ‘‘స్వీయ సందేహాత్మక ధోరణి నుంచి బయటకు రావాలి. మేం ఇది చేయగలమా? భారత్‌ ఇది చేయగలదా?.. ఎందుకీ ప్రతికూల భావన? ఈ అనుమానాల నుంచి బయటకు రండి. భారత వ్యవస్థను మార్చే విషయమై ప్రభుత్వం తన దృఢత్వాన్ని చూపించింది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పరిశ్రమల పట్ల స్పందిస్తుందని నమ్మకం కలిగించాం’’ అని చెప్పారు. దేశ వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరి, ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు, పరిశ్రమల నుంచి ఎన్నో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించడం గమనార్హం. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని, స్థూల ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయని, ఎఫ్‌డీఐల రాక బలంగా ఉందని, విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్టాల వద్ద ఉన్నాయని వివరించారు. ‘‘దేశ వృద్ధి పథంలో పాల్గొనాలి. తొలి బిడ్‌ వేయడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. వ్యాపారాలు మూతపడాలని ఈ ప్రభుత్వం కోరుకోవడం లేదన్నారు. శాసన, పాలనాపరమైన మార్పులతో వారికి సాయంగా ఉండాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ‘‘గత 100 ఏళ్లలో ఎంతో చేశారు. మరింత చేయాల్సి ఉంది. మీరు మార్పునకు ప్రతినిధులు. ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరొద్దు. అది మీలోనే ఉంది. దానిని బయటకు తీసుకురండి’’అని మంత్రి సూచించారు. You may be interested

జెట్ ఎయిర్‌వేస్‌ దివాలా పరిష్కార గడువు పెంపు

Saturday 21st December 2019

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌ వేస్‌ రుణ దాతల కమిటీ (సీవోసీ) దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ను కోరింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు కార్పొరేట్‌ దివాలా పరిష్కార గడువు

జనవరి 15లోగా తేల్చండి

Saturday 21st December 2019

'కార్వీ-యాక్సిస్‌ బ్యాంక్‌' షేర్ల వివాదంపై  సెబీకి శాట్ ఆదేశాలు న్యూఢిల్లీ: బ్రోకింగ్ సంస్థ కార్వీ తనఖా ఉంచిన షేర్ల స్వాధీనానికి సంబంధించి .. యాక్సిస్ బ్యాంకు పిటీషన్‌పై జనవరి 15లోగా తగు ఉత్తర్వులు ఇవ్వాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం సూచించింది. దీనిపై 15 రోజుల్లోగా తీర్పునివ్వాలంటూ డిసెంబర్ 17న ఇచ్చిన ఆదేశాలను తాజాగా సవరించింది. క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలున్న కార్వీపై (కేఎస్‌బీఎల్‌)

Most from this category