News


బొగ్గులో సంస్కరణల బాజా

Thursday 9th January 2020
news_main1578540983.png-30779

  • ఇతర సంస్థలూ బిడ్‌ చేసేందుకు అవకాశం
  • అంతిమ వినియోగంపై ఆంక్షల తొలగింపు
  • ఈ నెలలోనే 40 దాకా బ్లాకుల వేలం
  • ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు మరింతగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్‌ ప్రొవిజన్స్‌) చట్టం 2015లో సవరణలను సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు  వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. కేంద్ర క్యాబినెట్‌ భేటీ అనంతరం బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కనీస అర్హత గల ఏ కంపెనీ అయినా బొగ్గు గనుల వేలంలో పాల్గొనవచ్చు. ఈ కొత్త నిబంధనల కింద జనవరిలోనే తొలి విడత వేలం నిర్వహించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ జైన్‌ చెప్పారు. మొదటి విడతలో 40 బొగ్గు బ్లాకుల దాకా వేలం వేయనున్నట్లు వివరించారు.  మరోవైపు, మార్చి 31తో మైనింగ్‌ లీజు ముగిసిపోయే ముడి ఇనుము, ఇతర ఖనిజాల గనుల వేలాన్ని గడువులోగా నిర్వహించే ప్రతిపాదనకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 

కోల్‌ ఇండియాకూ మద్దతు ఉంటుంది...
అవకతవకల ఆరోపణల కారణంగా.. 2014లో సుప్రీం కోర్టు 204 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. అయితే, అంతిమంగా వినియోగించే అంశానికి సంబంధించి పరిమితుల కారణంగా వాటిలో కేవలం 29 బ్లాకులను మాత్రమే వేలం వేయడం జరిగింది. తాజాగా ఆంక్షలను ఎత్తివేయడంతో మిగతా బ్లాకుల వేలానికీ మార్గం సుగమం అవుతుందని జోషి చెప్పారు. ఈ రంగంలో పోటీని పెంచేందుకు, బొగ్గు దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ రంగ కోల్‌ ఇండియా గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కూడా ఈ చర్యలు ఉపయోగపడనున్నట్లు జైన్‌ చెప్పారు. అలాగని కోల్‌ ఇండియా ప్రాధాన్యాన్ని తగ్గించే యోచనేదీ లేదని, దాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. 2023 నాటికి 1 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు దానికి తగినన్ని బ్లాక్‌లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.  మరోవైపు, 334 నాన్‌-క్యాప్టివ్‌ ఖనిజ గనుల లీజు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోనుంది. ఇవి మూతబడితే దాదాపు 60 మిలియన్‌ టన్నుల ముడి ఇనుము కొరత ఏర్పడవచ్చని జోషి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉత్పత్తికి కోత పడకుండా గడువులోగా ఖనిజాల గనుల వేలాన్ని కూడా నిర్వహించాలని .. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు ఇతరత్రా అటవీ, పర్యావరణ అనుమతులు కూడా బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. దీని వల్ల రెండేళ్ల సమయం ఆదా అవుతుందని, ఎలాంటి అవరోధాలు లేకుండా ఉత్పత్తి యథాప్రకారంగా కొనసాగుతుందని చెప్పారు. 

అత్యంత భారీ సంస్కరణలు: మంత్రి ప్రధాన్‌
వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్‌ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు. తాజాగా చేసిన మార్పులు, చేర్పులు బొగ్గు పరిశ్రమలో అత్యంత భారీ సంస్కరణలని చమురు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అభివర్ణించారు. మరోవైపు, కేంద్ర నిర్ణయాన్ని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సీఎండీ సజ్జన్‌ జిందాల్‌ స్వాగతించారు. "ఏటా 15 బిలియన్‌ డాలర్ల పైగా ఉంటున్న బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడానికి ఇది గణనీయంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో.. ఇంధన రంగంలో భారత్‌ స్వయం సమృద్ధి స్థాయిని సాధించేందుకు ఇది తోడ్పడుతుంది" అని జిందాల్‌ చెప్పారు. అటు ముడి ఇనుము గనుల అనుమతుల కొనసాగింపు కూడా మరో గొప్ప సంస్కరణగా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ఆయన అభివర్ణించారు. అంతిమ వినియోగంపై ఆంక్షల ఎత్తివేత నిర్ణయం.. దేశీయంగా బొగ్గు నిల్వల వెలికితీతకు, మరిన్ని విదేశీ సంస్థలు ఇన్వెస్ట్‌ చేసేందుకు ఉపయోగపడగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ చెప్పారు. 

నీలాచల్‌ ఇస్పాత్‌ విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్‌...
ఉక్కు సంస్థ నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ (ఎన్‌ఐఎన్‌ఎల్‌)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి కూడా కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. ఎన్‌ఐఎన్‌ఎల్‌లో ఎంఎంటీసీ, ఎన్‌ఎండీసీ, బీహెచ్‌ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్‌ కార్పొరేషన్‌లకు వాటాలు ఉన్నాయి. మరోవైపు, నీలాచల్‌ ఇస్పాత్‌లో వాటాల విక్రయ ప్రతిపాదనను ఉక్కు రంగ కార్మికుల సమాఖ్య ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ ఖండించింది. భూషణ్‌ స్టీల్, ఆధునిక్‌ స్టీల్‌ వంటి ప్రైవేట్‌ రంగ సంస్థలు మూతబడుతుంటే ప్రభుత్వ రంగంలోని సంస్థలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.కె. దాస్‌ చెప్పారు. వాటాల విక్రయ ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధమని తెలిపారు. 

మరోవైపు బొగ్గు మైనింగ్‌ ఆర్డినెన్స్‌ను ఉక్కు పరిశ్రమ స్వాగతించింది. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది తోడ్పడగలదని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సంస్కరణల ఊతంతో దేశీ ఉక్కు పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పోటీపడగలదని తెలిపింది. You may be interested

ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్‌ షేర్లు

Thursday 9th January 2020

టాటా మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌ శైలేష్‌ జైన్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చౌక వేల్యుయేషన్స్‌కు లభిస్తున్న మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లు .. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయని టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌ శైలేష్‌ జైన్‌ తెలిపారు. గతంలో భారీ ప్రీమియం పలికిన ఈ స్టాక్స్‌.. ప్రస్తుతం లార్జ్‌క్యాప్‌ షేర్లతో పోలిస్తే 10 శాతం పైగా డిస్కౌంట్‌తో లభిస్తున్నాయన్నారు. కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 10 శాతం పైగా నమోదు కావొచ్చని, జూన్‌

బ్యాంక్‌ సేవలపై  భారత్ బంద్ ప్రభావం 

Thursday 9th January 2020

వాహన ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికం  న్యూఢిల్లీ/ముంబై/చెన్నై:  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్‌ బంద్... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభాం పాక్షికంగానే  ఉంది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎమ్‌ఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్‌ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి.  ఆర్‌బీఐ కార్యలయాల్లోనూ

Most from this category