News


ఎఫ్‌పీఐలు కార్పొరేట్లలా మారొచ్చు!!

Thursday 11th July 2019
news_main1562822074.png-26970

  • చెల్లించే స్థోమత ఉంది కనకే వారిపై పన్నుభారం
  • ‘సర్‌చార్జీ’పై సీబీడీటీ చైర్మన్‌ పీసీ మోడీ వ్యాఖ్య
  • రూ.13.35 లక్షల కోట్ల వసూళ్లను సాధిస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) మినహాయింపు ఇవ్వటానికి అవకాశం లేదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ పీసీ మోడీ స్పష్టం చేశారు. ఎఫ్‌పీఐలు కావాలనుకున్న పక్షంలో కార్పొరేట్‌ సంస్థగా రిజిస్టర్‌ చేసుకుని, ఆ విభాగంలో ఉన్న తక్కువ రేట్ల పరిధిలోకి మారొచ్చని సూచించారు. రూ.2 కోట్లపైన ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జ్‌ పెంచాలన్న నిర్ణయాన్ని... దేశ నిర్మాణం కోసం వారు మరింత చెల్లించగలరన్న ఉద్దేశంతోనే తీసుకున్నామన్నారు. ‘‘బేస్‌ రేటులో మార్పు లేదు. మారింది సర్‌చార్జీ మాత్రమే. ఇది ఎఫ్‌పీఐలు, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌పై (ఏఐఎఫ్‌) ప్రభావం చూపిస్తుంది. కానీ, కార్పొరేట్‌ సంస్థగా మారే ఆప్షన్‌ వారికి ఉంది. ఈ విషయంలో ఏ విధమైన బేధభావం లేదు’’ అని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మోదీ పేర్కొన్నారు. ఆదాయపన్ను పరిధిలో దిగువ స్థాయిల్లో ఉన్న వారికి ప్రయోజనాలు అందించేందుకు అధికాదాయ వర్గాలపై సర్‌చార్జీ పెంచినట్టు మోడీ తెలిపారు. బడ్జెట్‌ 2019-20లో అధిక ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జీలను పెంచుతూ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన విషయం విదితమే. రూ.2-5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారిపై సర్‌చార్జీని 25 శాతానికి, రూ.5కోట్లు దాటిన వారిపై 37 శాతానికి పెంచేశారు. దాదాపు 40 శాతం మంది ఎఫ్‌పీఐలు నాన్‌ కార్పొరేట్‌ సంస్థల రూపంలో అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్‌ లేదా ట్రస్ట్‌గా ఇన్వెస్ట్‌ చేస్తున్నందున వారిపై తప్పనిసరిగా ఈ భారం పడనుంది. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారిని వ్యక్తులుగానే పరిగణిస్తున్నారు.
పన్నుల లక్ష్యాన్ని చేరుకుంటాం...
ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని రూ.13.35 లక్షల కోట్లకు సవరించామని, ఇది ఆచరణ సాధ్యమేనని పీసీ మోడీ తెలిపారు. కార్పొరేట్‌ పన్ను మరింత తగ్గించే అంశాన్ని, ఈ రంగంలో మినహాయింపులు, తగ్గింపులన్నవి తొలగిపోయిన తర్వాతే ప్రభుత్వం పరిశీలించగలదన్నారు. ‘‘గత సవరించిన అంచనాల్లో మా పన్ను వసూళ్ల లక్ష్యం 2019-20 సంవత్సరానికి రూ.13.78 లక్షల కోట్లుగా ఉంది. కానీ, ఇది వాస్తవానికి దూరంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఏడాది వసూళ్లతో పోలిస్తే 24 శాతం ఎక్కువ. బడ్జెట్‌ సంప్రదింపుల సమయంలో మేం ఇదే తెలియజేశాం. దీంతో పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ఇప్పుడు రూ.13.35 లక్షల కోట్లుగా నిర్ణయించడం జరిగింది’’ అని మోడీ వివరించారు. దీంతో గతేడాది వసూళ్ల కంటే 17.5 శాతం ఎక్కువన్నారు. ఇది కష్టమైన లక్ష్యమే కానీ, అసాధ్యం మాత్రం కాదన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖ ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11.37 లక్షల కోట్లను వసూలు చేసింది. బడ్జెట్‌లో పెట్టుబడులు, వృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆర్థిక రంగం మంచి పనితీరు చూపుతుందని, దాంతో వసూళ్లు కూడా మెరుగ్గానే ఉంటాయని చెప్పారు.You may be interested

మహిళా ఉద్యోగులు డబుల్‌!!

Thursday 11th July 2019

అయిదేళ్లలో ఫేస్‌బుక్ ప్రణాళిక శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే నల్లజాతి వారు, లాటిన్ అమెరికన్ ఉద్యోగుల సంఖ్యను సైతం రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. సిబ్బందిలో వైవిధ్యాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఈ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు సంస్థ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ మాక్సిన్ విలియమ్స్ తెలిపారు. 2024 నాటికి తమ సిబ్బందిలో సగభాగం ఉద్యోగుల్లో మహిళలు,

ఇండిగో మరో 7 శాతం క్రాష్‌

Thursday 11th July 2019

ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ షేరు వరుసగా రెండవ రోజు కూడా నష్టాల్లో ట్రేడవుతోంది. క్రితం రోజు భారీగా నష్టపోయిన ఈ షేరు గురువారం(జులై 11) ట్రేడింగ్‌లో 7.57 శాతం నష్టపోయి రూ.1,294.40 కు పడిపోయింది. ఇండిగో ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌ మధ్య వివాదం సెబీ వరకు వెళ్లడంతో బుధవారం(జులై 10) ట్రేడింగ్‌లో ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ షేరు విలువ 17 శాతం నష్టపోయిన విషయం తెలిసినదే. ఇండిగో

Most from this category