News


ఈ ఏడాదే 3 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ

Saturday 6th July 2019
news_main1562395327.png-26849

  • 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోగల సామర్థ్యం ఉంది
  • అందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తప్పనిసరి
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోకి భారీ పెట్టుబడులు అవసరం
  • ఆర్థిక వృద్ధికి రవాణా సౌకర్యాలే కీలకం
  • బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపిన నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే భారత ఆర్థిక వ్యవస్థ 3 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రెండు కోట్ల కోట్ల రూపాయలు) స్థాయికి చేరుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు 3.4 కోట్ల కోట్ల రూపాయలు) స్థాయిని అందుకోవాలంటే వ్యవస్థలో నిర్మాణత్మక సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని రెండో ప్రభుత్వపు తొలి బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెడుతూ, ఐదేళ్ల క్రితం 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను తమ ప్రభుత్వం ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చిందనీ, రాబోయే కొన్నేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని కూడా చేరుకునే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకు ఉందని చెప్పారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3 లక్షల కోట్ల స్థాయికి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో మనది ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఐదేళ్ల క్రితం మనం 11వ స్థానంలో ఉండేవాళ్లం. కొనుగోలు శక్తి ప్రకారం చూసుకుంటే ఇప్పటికే మనం చైనా, అమెరికాల తర్వాత మూడో స్థానంలో ఉన్నాం’అని నిర్మల తెలిపారు. 

ఎన్నో చేశాం.. ఇంకా ఎంతో చేయాలి...
గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం పరోక్ష పన్నుల వసూళ్లు, దివాలా చట్టం, స్థిరాస్తి వ్యాపారం తదితరాలకు సంబంధించి ఎన్నో భారీ సంస్కరణలు చేపట్టిందని నిర్మల తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే మాత్రం ఇవి సరిపోవనీ, ఇంకా ఎన్నో నిర్మాణాత్మక సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ‘ఓ వైపు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), దివాళా చట్టం వంటి సం‍స్కరణలు పార్లమెంటులో జరుగుతుంటే, మరోవైపు కింది స్థాయిలో సామాన్యులకు సాయం అందించేందుకు ముద్ర రుణాలు, పలు ఇతర కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. సగటు వ్యక్తి జీవితాలను ఇంకా మెరుగుపరిచేందుకు మనం మౌలిక వసతులు, డిజిటల్‌ ఆర్థిక సేవలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉద్యోగ కల్పన తదితరాలపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరడానికి భారత ఆర్థిక వ్యవస్థకు 55 ఏళ్లు పట్టింది. అదే ప్రజల హృదయాలు ఆశలు, ఆకాంక్షలు, నమ్మకంతో నిండినప్పుడు కేవలం ఐదేళ్లలోనే మరో లక్ష కోట్ల డాలర్ల స్థాయికి ఎదిగి మొత్తంగా 2 లక్షల కోట్ల డాలర్లను స్థాయిని అందుకున్నాం. ఇక ఇప్పుడు, ఈ ఆర్థిక ఏడాదిలోనే 3 లక్షల కోట్ల డాలర్ల మార్కును కూడా చేరుకోబోతున్నాం. 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యాన్ని కూడా మనం దేశ ప్రజల శ్రమ ఫలంతో చేరుకోగలం. విధానాలు లేక చచ్చుబడిన దశ నుంచి తేరుకుని దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తోంది’అని నిర్మల తన ప్రసంగంలో చెప్పారు.

ప్రతి ఒక్కరినీ రక్షిత తాగునీరు మా ప్రాథమ్యం...
దేశంలోని ప్రతి పౌరుడికీ రక్షిత తాగు నీరు అందించడం తమ ప్రభుత్వ ప్రాథమ్యమని నిర్మల చెప్పారు. 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచి నీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతీ గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణను కూడా స్వచ్ఛ భారత్‌ కిందకు తీసుకురావాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని తెలిపారు. అలాగే కొత్తగా పది వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ ‍ప్రాంతాల మధ్య అనుసంధానత, రవాణా సౌకర్యాలే ఆర్థిక వ్యవస్థ బతికేందుకు రక్తం వంటివని నిర్మల పేర్కొన్నారు. రహదారులు సహా అన్ని రకాల రవాణా మార్గాలు, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీకి రూ. 1.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపును కూడా అదనంగా ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ గత ప్రభుత్వం ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల పథకం, భారతమాల, సాగరమాల, జల మార్గాల అభివృద్ధి, ఉడాన్‌, పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేకంగా సరకు రవాణాకే కేటాయించిన కారిడార్లు తదితర పథకాల ద్వారా రవాణా సౌకర్యాలు, అనుసంధానతను ఎంతో పెంచిందని నిర్మల చెప్పారు. భారతమాల రెండో దశలో భాగంగా రహదారులను అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్రాలకు కూడా సాయం చేస్తామన్నారు.You may be interested

ఇస్రో వాణిజ్య అవసరాలకు ఎన్‌ఎస్‌ఐఎల్‌

Saturday 6th July 2019

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష విభాగానికి ఈసారి బడ్జెట్‌ కేటాయింపుల్లో కొద్దిపాటి పెరుగుదల మాత్రమే నమోదైంది. గత ఏడాది ఈ విభాగానికి కేటాయించిన రూ.11, 200 కోట్లకు అదనంగా రూ.1, 273 కోట్లు చేర్చి.. తాజా బడ్జెట్‌లో రూ.12 ,473 కోట్లు కేటాయించారు. అయితే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అన్న అంశానికి ఏకంగా 1,400 కోట్ల రూపాయలు కేటాయింపులు పెరిగాయి. ఈ అంశానికి గత ఏడాది మొత్తం రూ.6, 992 కోట్లు

‘రక్షణ’కు రూ. 3.18 లక్షల కోట్లు

Saturday 6th July 2019

- మధ్యంతర బడ్జెట్‌ కేటాయింపులే కొనసాగింపు - రక్షణ పరికరాల దిగుమతికి కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు  న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో 2019- 20 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖకు రూ. 3.18 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది రక్షణ శాఖకు రూ. 2.98 లక్షల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది స్వల్పంగా నిధులు పెంచారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చేసిన రక్షణ శాఖకు కేటాయింపులనే

Most from this category