News


ఎఫ్‌డీఐ 2.0

Thursday 29th August 2019
news_main1567059819.png-28084

  • విదేశీ పెట్టుబడులకు మరో విడత రెడ్‌కార్పెట్‌
  • బొగ్గు మైనింగ్‌, కాంట్రాక్టు తయారీలో నూరు శాతం ఎఫ్‌డీఐలు
  • సింగిల్‌ బ్రాండ్‌ రిటైలర్లకు స్థానిక సమీకరణలో వెసులుబాటు
  • డిజిటల్‌ మీడియాలోకి 26 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి
  • పంచదార రైతులకు పూర్తి మద్దతు
  • కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ: నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చేందుకు ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మరోసారి ద్వారాలు తెరిచింది. బొగ్గు మైనింగ్‌, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతి అవసరం లేని ఆటోమేటిక్‌ మార్గంలో ఆహ్వానించింది. అలాగే, డిజిటల్‌ మీడియాలో ఇప్పటి వరకు ఎఫ్‌డీఐలకు అవకాశం లేకపోగా, ఇకపై 26 శాతం వరకు ఎఫ్‌డీఐలను స్వీకరించొచ్చు. బుధవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయాలు తీసుకుంది. అలాగే, సింగిల్‌ బ్రాండ్‌ రిటైలర్లకు స్థానిక ఉత్పత్తులను సమీకరించుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఐదేళ్ల కనిష్ట స్థాయికి (5.8 శాతం) జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో గత వారం పలు వర్గాలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించగా.. వారం తిరగకముందే ఎఫ్‌డీఐలపై నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి విషయంలో మరిన్ని చర్యలకూ అవకాశం ఉందని ప్రభుత్వం సంకేతాలు పంపినట్టయింది. గత 3-4 త్రైమాసికాలుగా దేశ వృద్ధి కుంటుపడిన విషయం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన జీడీపీ వృద్ధి 5.8 శాతం అన్నది ఐదేళ్ల కనిష్ట స్థాయి. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తక్షణ నిధుల సాయం సహా పలు చర్యలను ప్రభుత్వం గతవారం ప్రకటించింది.
మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు...
‘‘ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు చేయడం వల్ల భారత్‌ ఎఫ్‌డీఐలకు గమ్యస్థానంగా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా పెట్టుబడుల రాక పెరిగి, ఉపాధి, వృద్ధికి తోడ్పడుతుంది’’ అని కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాతో అన్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు గాను ఎఫ్‌డీఐ పాలసీని మరింత సరళీకరించడమే కేబినెట్‌ నిర్ణయాల ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. బొగ్గు మైనింగ్‌లో ఆటోమేటిక్‌ మార్గంలో నూరు శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడం వల్ల అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంతోపాటు దేశంలో పోటీతత్వంతో కూడిన, బలమైన బొగ్గు మార్కెట్‌ ఏర్పడుతుందని మంత్రి వివరించారు. కాంట్రాక్టు తయారీలో నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్‌ మార్గంలో అనుమతించడం వల్ల దేశీయంగా తయారీ వృద్ధి చెందుతుందన్నారు. 
సింగిల్‌ బ్రాండ్‌రిటైల్‌...
సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ విభాగంలో 51 శాతానికి మించి ఎఫ్‌డీఐలను కలిగిన సంస్థ... 30 శాతం ఉత్పత్తులను స్థానిక మార్కెట్‌ నుంచే సమీకరించుకోవాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. ఇటువంటి సంస్థలకు కార్యకలాపాల నిర్వహణలో గొప్ప వెసులుబాటు కల్పించేందుకు గాను, భారత్‌ నుంచి సేకరించే అన్ని రకాల ఉత్పత్తులను స్థానిక సమీకరణగానే గుర్తిస్తారు. అంటే భారత్‌లో విక్రయించేందుకు అయినా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు సమీకరించినా ఈ వెసులుబాటు లభిస్తుంది. అలాగే, భౌతికంగా సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ దుకాణాలు ప్రారంభించడానికి ముందే ఆన్‌లైన్‌లో అమ్మకాలు మొదలు పెట్టుకునేందుకు కూడా అనుమతించింది. ‘‘ఆన్‌లైన్‌ విక్రయాలతో లాజిస్టిక్స్‌, డిజిటల్‌ చెల్లింపులు, కస్టమర్‌ కేర్‌, శిక్షణ, ఉత్పత్తులపై నైపుణ్యం విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి’’ అని మంత్రి గోయల్‌ తెలిపారు.
ఐదేళ్లలో 286 బిలియన్‌ డాలర్లు...
ఎఫ్‌డీఐ అన్నది ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇంధనం వంటిది. రుణాల రూపంలో కాకుండా పెట్టుబడులుగా దేశాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తోడ్పడతాయి. ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రభుత్వం నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా 2014-15 నుంచి 2018-19 వరకు దేశంలోకి 286 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అంతకుముందు ఐదు సంవత్సరాల కాలంలో వచ్చిన 189 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. 2018-19లో వచ్చిన 64.37 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు ఇప్పటి వరకు ఓ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గరిష్ట ఎఫ్‌డీఐలు కావడం గమనార్హం. 
బొగ్గు రంగంలోకి ఇలా...
ప్రస్తుతం విద్యుత్‌ ప్రాజెక్టులు, ఐరన్‌, స్టీల్‌, సిమెంట్‌ ప్లాంట్ల సొంత వినియోగానికి ఉద్దేశించిన బొగ్గు, లిగ్నైట్‌ మైనింగ్‌లోకి ఆటోమేటిక్‌ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఇకపై బొగ్గు విక్రయాలు, మైనింగ్‌, కోల్‌ వాషరీ, క్రషింగ్‌, కోల్‌ హ్యాండ్లింగ్‌ తదితర బొగ్గు అనుబంధ విభాగాల్లోకీ వంద శాతం ఆటోమేటిక్‌ మార్గంలో ఎఫ్‌డీఐలను తెచ్చుకోవచ్చు. 



You may be interested

డీటీసీతో ‘పన్ను’ ఊరట!

Thursday 29th August 2019

తగ్గనున్న వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు... గరిష్ట పన్ను రేటు 20 శాతమే డివిడెండ్‌ పంపిణీపై పన్ను ఎత్తేయాలి ప్రభుత్వానికి డైరెక్ట్‌ ట్యాక్స్‌ కోడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిఫారసులు న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కోడ్‌(డీటీసీ) సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ ప్యానెల్‌.. పన్నుల భారం తగ్గించే దిశగా కీలక సిఫారసులు చేసింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్‌ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్‌ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి.

పసిడికి ఆర్థిక మాంద్య ఆందోళన అండ

Thursday 29th August 2019

ఆర్థిక మాంద్య భయాల నేపథ్యంలో గురువారం పసిడి ధర తిరిగి లాభాల బాట పట్టింది. వడ్డీరేట్ల తగ్గింపుపై ప్రపంచ బ్యాంకుల సానుకుల వైఖరి, చైనా అమెరికా దేశాల వాణిజ్య చర్చలు తదితర అంశాలు పసిడి ర్యాలీకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు పెరిగి 1,551.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ట్రేడ్‌వార్‌పై మరింత సమాచారం కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. ట్రేడ్‌వార్‌ పసిడి ర్యాలీకి దిశానిర్దేశం చేస్తుంది.ట్రేడ్‌వార్‌లో

Most from this category