News


దివాలా కోడ్‌కు మరిన్ని సవరణలు

Thursday 12th December 2019
news_main1576120673.png-30180

  • ఎన్‌హెచ్‌ఏఐ ఇన్‌విట్‌కు ఆమోదం
  • బ్యాంకులకు పాక్షిక రుణ హామీ పథకానికి ఓకే
  • కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు

న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్‌ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రకారం ఆయా కంపెనీల గత ప్రమోటర్లు చేసిన తప్పిదాలకు కొత్త యాజమాన్యం.. క్రిమినల్ విచారణ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. 2016లో అమల్లోకి వచ్చిన ఐబీసీకి ఇప్పటికే మూడు సార్లు సవరణలు చేశారు. తాజాగా కొన్ని సెక్షన్లను సవరించడంతో పాటు కొత్తగా మరో సెక్షన్‌ను చేర్చారు. ఐబీసీ (రెండో సవరణ) బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం కొనసాగిస్తున్నాయి. దీంతో దివాలా సంస్థలను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాత ప్రమోటర్ల తప్పిదాలకు సంబంధించిన చర్యల నుంచి కొత్త యాజమాన్యానికి ఊరటనిచ్చే ప్రతిపాదనలు.. ఐబీసీపై ఇన్వెస్టర్లు, బ్యాంకర్ల విశ్వాసాన్ని పునరుద్ధరించగలవని న్యాయసేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ ఎండీ సిరిల్ ష్రాఫ్ పేర్కొన్నారు. 

ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట...
సంక్షోభంలో ఉన్న నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్‌ఎఫ్‌సీ) ఊరటనిచ్చే స్కీమునకు కేం‍ద్రం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలకు సంబంధించిన అత్యధిక రేటింగ్ గల ఆస్తులను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) ప్రభుత్వం పాక్షికంగా రుణ హామీ కల్పిస్తుంది. ఆయా అసెట్స్‌ విలువలో పది శాతం లేదా రూ. 10,000 కోట్ల దాకా (ఏది తక్కువైతే అది) నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ పూచీకత్తు ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా నిధుల అవసరాల కోసం ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు తమ అసెట్స్‌ను తెగనమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఈ స్కీము ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. 2020 జూన్ దాకా ఆరు నెలల పాటు లేదా రూ. 1,00,000 కోట్ల అసెట్స్ కొనుగోలు పూర్తయ్యేదాకా ఈ స్కీము అమల్లో ఉంటుంది. అవసరమైతే దీన్ని మరో మూడు నెలల పాటు ఆర్థిక మంత్రి పొడిగించవచ్చు. 

ఎన్‌హెచ్ఏఐ ఇన్‌విట్‌...
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్‌విట్‌) ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌హెచ్‌ఏఐకి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఇది కూడా పలువురు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించి, ఇన్‌ఫ్రా అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు రాబడులు అందిస్తుంది. దాదాపు రూ. 5,35,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 24,800 కి.మీ. మేర రహదారులు అభివృద్ధి చేసే దిశగా 2017 అక్టోబర్‌లో కేంద్రం భారత్‌మాలా పరియోజన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐకి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి. తాజాగా ఇన్‌విట్‌కు ఆమోదం లభించడంతో కనీసం ఏడాది కాలంపాటు టోల్ వసూళ్ల రికార్డు ఉన్న జాతీయ రహదారుల ద్వారా మరింత ఆదాయం ఆర్జించేందుకు, కొత్త ప్రాజెక్టులపై ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐకి వెసులుబాటు లభిస్తుంది. You may be interested

2019లో భారత్‌ వృద్ధి 5.1 శాతమే!

Thursday 12th December 2019

ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అంచనా 2020లో 6.5 శాతం ఉంటుందని విశ్లేషణ  న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తన తాజా నివేదికలో పేర్కొంది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి పలు అంశాలు దీనికి కారణమని ఏడీబీ విశ్లేషించింది. అయితే 2020లో భారత్‌ వృద్ధి

అందరివాడు .. దాస్‌

Thursday 12th December 2019

ఆర్‌బీఐ గవర్నర్‌గా ఏడాది     దేశీ బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ బాధ్యతలు చేపట్టి సంవత్సరమవుతోంది. గతేడాది డిసెంబర్‌ 12న ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ అర్ధాంతరంగా నిష్క్రమించిన తర్వాత అనూహ్యంగా ఆ స్థానంలో దాస్‌ నియమితులయ్యారు. బ్యూరోక్రాట్‌ స్థాయి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా ఎదిగారాయన.  1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన దాస్‌.. గతంలో

Most from this category