News


బడ్జెట్‌ రియల్టీ : అందుబాటు తప్ప.. అందినదేమీ లేదు!

Sunday 2nd February 2020
news_main1580618319.png-31429

– రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ గడువు మరొక ఏడాది పొడిగింపు
– అఫడబుల్‌ డెవలపర్లకు లాభాల మీద పన్నుకు కూడా..
– కొత్త ఎయిర్‌పోర్ట్స్, లాజిస్టిక్‌ పాలసీలతో కమర్షియల్‌ రియల్టీకి డిమాండ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మళ్లీ పాత పాటే పడింది. జీఎస్‌టీ తగ్గింపు, మౌలిక రంగ హోదా, ఇన్వెంటరీ గృహాలకు పన్ను మినహాయింపు, డెవలపర్స్‌ సబ్‌వెన్షన్, కొనుగోలుదారుల ఫిర్యాదు కోసం రెరా సింగిల్‌ బాడీ ఏర్పాటు వంటి వాటితో రియల్టీలో జోష్‌ నింపుతుందనుకున్న బడ్జెట్‌ నీరుగార్చింది. అందుబాటు గృహ కొనుగోలుదారులు, వాటి నిర్మాణదారులకు మినహా రియల్టీ రంగానికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. లాజిస్టిక్‌ పాలసీ, కొత్త యూనివర్సీటీలు, విమానాశ్రయాలు, స్మార్ట్‌ సిటీలు, డేటా సెంటర్లతో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అవకాశాలను కల్పించారు. రవాణా, మౌలిక రంగ వసతుల కేటాయింపులతో దీర్ఘకాలంలో గృహ విభాగానికి డిమాండ్‌ వస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
 అందుబాటు గృహాల మీదే ఫోకస్‌..
తొలిసారి ఇల్లు కొనే కొనుగోలుదారులకు అందించే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ గడువును మరొక ఏడాది పాటు పొడిగించారు. అంటే అఫడబుల్‌ హౌజింగ్‌ వడ్డీ రాయితీని 2021 మార్చి వరకూ పొందే వీలుందన్నమాట. ఇది కొనుగోలుదారులు కొనుగోలు సమయాన్ని ఏడాదికి పెంచిన్నట్లయింది. అలాగే అందుబాటు గృహాల నిర్మాణదారులకు లాభాల మీద 100 శాతం పన్ను మినహాయింపులను మరొక ఏడాది పాటు పొడిగించింది. పెరిగిన ఏడాది పన్ను మినహాయింపు లాభాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు కొనుగోలుదారులు, డెవలపర్లు ముందుకొస్తారు కాబట్టి అఫడబుల్‌ హౌజింగ్స్‌కు డిమాండ్‌ పెరుగుతుందని నరెడ్కో నేషనల్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ హిర్‌నందానీ అభిప్రాయపడ్డారు. డెవలపర్లు కూడా రెట్టింపు ఉత్సాహంతో అఫడబుల్‌ హౌజింగ్‌ ప్రాజెక్ట్‌లు చేయడానికి ముందుకొస్తారని పేర్కొన్నారు. వ్యక్తిగత ఆదాయపన్ను శాతాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. ఇది ఆయా పన్ను చెల్లింపుదారులకు రియల్టీ పెట్టుబడులకు అవకాశమిస్తుందని టాటా రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ అండ్‌ సీఈఓ సంజయ్‌ దత్‌ తెలిపారు.
రియల్టీకి కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌ దారులు..
డేటా సెంటర్లు, కొత్త విమానాశ్రయాలు, స్మార్ట్‌ సిటీలతో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు అవకాశాలు మెరుగవుతాయని జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓ రమేష్‌ నాయర్‌ అన్నారు. రవాణా రంగంలో కేటాయింపులతో కొత్త రియల్టీ హాట్‌స్పాట్స్‌ తయారవుతాయి. ఢిల్లీ–ముంబై, బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేస్, బెంగళూరు సబర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాజెక్ట్‌లతో మౌలిక రంగంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పెరగడంతో పాటూ ఆయా మార్కెట్లలో డెవలపర్లకు కొత్త పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయి. కొత్తగా వంద విమానాశ్రయాలు, ఐదు స్మార్ట్‌ సిటీలు, డేటా సెంటర్లతో కమర్షియల్‌ రియల్టీకి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని రియల్టీ వ్యాపార అవకాశాలతో పాటూ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ప్రవాసుల ఫోకస్‌ పెరుగుతుందని చెప్పారు. దేశంలో డేటా సెంటర్లలో 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు అవకాశాలున్నాయని జేఎల్‌ఎల్‌ అంచనా వేసింది. 2024 నాటికి పరిశ్రమ ఆదాయం 3.2 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పేర్కొంది.
లాజిస్టిక్‌ బూస్ట్‌..
నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీ ప్రకటనతో వేర్‌హౌజ్, లాజిస్టిక్‌ రంగంలో సప్లయి పెరుగుతుంది. గతేడాది దేశంలో 21.1 కోట్ల చ.అ.లుగా ఉన్న వేర్‌హౌజ్‌ సప్లయి 2023 ముగింపు నాటికి 37.9 కోట్ల చ.అ.లకు చేరుతుందని అనరాక్‌ కన్సల్టెన్సీ అంచనా వేసింది. సింగిల్‌ విండో క్లియరెన్స్‌తో వేర్‌హౌజ్‌ అనుమతుల సమయం 6 నెలలకు తగ్గిపోతుంది. 2019లో దేశంలోని ప్రధాన నగరాల్లో 3.6 కోట్ల చ.అ. వేర్‌హౌజ్‌ నికర లావాదేవీలు జరిగాయి. సెక్యూరిటైసేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ ఇంట్రెస్ట్‌ యాక్ట్‌ (సర్ఫాసీ చట్టం) కింద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) అసెట్స్‌ నిర్వహణ (ఏయూఎం)ను రూ.500 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించారు. దీంతో మధ్యలోనే ఆగిపోయిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల నిధులను రికవర్‌ చేయడానికి అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆగిపోయిన ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించాలి.
స్టూడెంట్‌ హౌజింగ్‌కు డిమాండ్‌..
విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం, నేషనల్‌ పోలీస్, ఫోరెన్సిక్‌ యూనివర్సీటీల ఏర్పాటు, 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సుల అమలు, విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్‌ ఇండియా ‘ఇండ్‌శాట్‌’ ప్రోగ్రాం వంటి వాటితో దేశ, విదేశీ విద్యార్థుల వలసలు పెరుగుతాయి. దీంతో స్టూడెంట్‌ హౌజింగ్‌కు డిమాండ్‌ పెరుగుతుందని అనరాక్‌ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పురీ తెలిపారు. దేశంలోని స్టూడెంట్‌ హౌజింగ్‌ విభాగంలో ఉన్న డిమాండ్, సప్లయి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బడ్జెట్‌ భర్తీ చేసింది. ప్రొషిషనల్‌ మేనేజ్డ్‌ స్టూడెంట్‌ అకామిడేషన్‌ (పీఎంఎస్‌ఏ) అభివృద్ధి చెందుతాయి. బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, నోయిడా, ఇండోర్‌ వంటి నగరాల్లో స్టూడెంట్‌ హౌజింగ్‌కు డిమాండ్‌ ఉంది. సాధారణ నివాస అద్దెలతో పోలిస్తే స్టూడెంట్‌ హౌజింగ్‌ అద్దెలు 14–17 శాతం ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతమున్న డిమాండ్‌కు కోటికి పైగా బెడ్స్‌ అవసరముందని అనరాక్‌ కన్సల్టెన్సీ తెలిపింది. గతేడాది 1,267 కోట్లుగా ఉన్న స్టూడెంట్‌ హౌజింగ్‌ మార్కెట్‌ ఈ ఏడాది ముగింపు నాటికి 2,400 కోట్లకు చేరుతుందని అనూజ్‌ పురీ తెలిపారు. స్టూడెంట్‌ లివింగ్‌ ప్రాజెక్ట్‌లకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇస్తే డిమాండ్‌ మరింత పెరుగుతుందన్నారు.

 



You may be interested

ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజ్‌ల్లో బాండ్ల లిస్టింగ్‌కు బూస్ట్‌

Sunday 2nd February 2020

విత్‌హోల్డింగ్‌ పన్ను 4 శాతానికి తగ్గింపు ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజ్‌లో బాండ్ల లిస్టింగ్‌ను ‍ప్రోత్సహించేందుకు.. ఈ బాండ్ల వడ్డీ చెల్లింపులపై విత్‌హోల్డింగ్స్‌ ట్యాక్స్‌(ముందస్తుగా వసూలు చేసే పన్ను)ను 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ చర్య మరింత మంది అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజ్‌లోని బాండ్లలో పెట్టుబడులు పెట్టే దిశగా ప్రోత్సహించనుంది. ఈ చర్య బాండ్లను జారీ చేసే కంపెనీలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని, మరింత మంది అంతర్జాతీయ

పెరిగిన ద్రవ్యలోటు లక్ష్యం

Sunday 2nd February 2020

3.3 శాతం నుంచి 3.8 శాతానికి పెంపు ఆదాయలేమి నేపథ్యం న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు లక్ష్యం పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉండాలన్నది గత బడ్జెట్‌ లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని తాజా బడ్జెట్‌ (2020-21) 3.8 శాతానికి పెంచింది. ఆదాయాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం.  2020 మార్చి నాటికి ద్రవ్యలోటు రూ. 7,03,760 కోట్లు ఉండాలన్నది

Most from this category