News


సంక్షేమ సీతమ్మ!

Sunday 2nd February 2020
news_main1580627396.png-31445

  • స్త్రీ శిశు సంక్షేమాలకు 14 శాతం నిధుల పెంపు
  • గర్భధారణ సగటు వయసు సమీక్షకు టాస్క్‌ఫోర్స్‌
  • గ్రామీణాభివృద్ధి నిధుల్లో కోత

న్యూఢిల్లీ: కేంద్రంలో పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న వేళ మోదీ ప్రభుత్వం సమాజ సంక్షేమానికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా స్త్రీశిశు సంక్షేమానికి, షెడ్యూల్‌ తెగలు, కులాలు, మైనార్టీల శాఖలకు నిధుల కేటాయింపులు పెరిగాయి. సామాజిక సంక్షేమాన్ని మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు. స్త్రీ శిశు సాంఘీక సంక్షేమం, సంస్కృతి మరియు పర్యాటకం, పర్యావరణం మరియు వాతావరణ మార్పు అనే మూడు విభాగాలుగా సమాజ సంక్షేమాన్ని విభాగిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు థీమ్స్‌కు అనుగుణంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. మహిళల వివాహ కనీస వయసును పునఃసమీక్షించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తున్నామని, ఈ టాస్క్‌ఫోర్స్‌ ఆరునెలల్లో నివేదిక అందిస్తుందని తెలిపారు. బలహీన వర్గాలు, స్త్రీ శిశు సంక్షేమంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. సంక్షేమానికి గతంతో పోలిస్తే నిధులు పెంచామని తెలిపారు.
స్త్రీ శిశు మరియు సాంఘీక సంక్షేమం
ఈ దఫా బడ్జెట్లో స్త్రీశిశుసంక్షేమ శాఖకు రూ.30వేల కోట్లను కేటాయించారు. ఇది గత బడ్జెట్‌ కేటాయింపు కన్నా దాదాపు 14 శాతం అధికం. బేటీ బచావో- బేటీ పడావో పతకం బాగా విజయవంతమైందని బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మల చెప్పారు. ప్రస్తుతం పాఠశాలల్లో స్థూల బాలికల నమోదు గణాంకాలు(94.32 శాతం) బాలుర గణాంకాల(89. 28 శాతం)కన్నా మెరుగయ్యాయని చెప్పారు.  పసిపిల్లలు, గర్భిణులు, బాలింతల పౌష్టికత మెరుగుదలకు ప్రారంభించిన పోషన్‌ అభియాన్‌ కింద ఆరు లక్షల అంగన్‌వాడీలకు స్మార్ట్‌ఫోన్స్‌ అందించామని, వీటితో దాదాపు 10 కోట్ల కుటుంబాలకుపౌష్టికత అప్‌డేట్స్‌ అందిస్తున్నామని తెలిపారు.పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి, మాన్యువల్‌ స్కావెంజింగ్‌ అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిఉందని, ఈ విషయంలో సాంకేతికతను వినియోగిస్తామని వివరించారు. 
బడ్జెట్లో సంక్షేమ కేటాయింపులు ఇలా ఉన్నాయి...

  • పౌష్టికాహార కార్యక్రమాల కోసం రూ. 35,600 కోట్లు, స్త్రీ సంక్షేమ పథకాలకు రూ. 28600 కోట్లు కేటాయించారు. 
  • పోషన్‌ అభియాన్‌ కార్యక్రమానికి గత బడ్జెట్లో రూ. 3400 కోట్లు అందించగా, ఈ దఫా రూ.3700 కోట్లు కేటాయించారు. 
  • బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి రూ. 220 కోట్లు, మహిళా శక్తి కేంద్రాలకు రూ. 100 కోట్లు కేటాయించారు.
  • షెడ్యూల్‌ కులాల సంక్షేమం, ఓబీసీల సంక్షేమానికి రూ. 85వేల కోట్లను, షెడ్యూల్‌ తెగల కోసం రూ. 53700 కోట్లను కేటాయించారు. 
  • దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ. 9500 కోట్లు అందించనున్నారు. 
  • సాంఘీక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ. 10103.57 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో ఈ మొత్తం రూ. 8885 కోట్లు. 
  • మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 5వేల కోట్లు కేటాయించారు.
  • వన్‌స్టాప్‌ సెంటర్‌ పథకానికి కేటాయింపులను రూ. 204 కోట్ల నుంచి రూ. 385 కోట్లకు పెంచారు. ఈ పథకం ద్వారా దాష్టీకానికి గురైన మహిళలకు చేయూతనిస్తారు. 
  • ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి కేటాయింపులు రూ. 200 కోట్లు పెరిగి రూ. 2500 కోట్లకు చేరాయి. ఈ పథకం ద్వారా గర్భిణులు, తొలిచూలు బాలింతలకు రూ. 6000 అందిస్తారు.
  • ఐసీడీఎస్‌కు చెందిన శిశు రక్షణ సేవల పథకానికి కేటాయింపులు రూ. 1350 కోట్ల నుంచి రూ. 1500 కోట్లకు పెరిగాయి.
  • జాతీయ క్రెచ్‌ పథకానికి రూ. 75 కోట్లు, వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌ పథకానికి రూ. 150 కోట్లు అందిస్తారు.
  • స్త్రీసాధికారిత మిషన్‌కు రూ. 961 కోట్ల నుంచి రూ. 1163 కోట్లకు కేటాయింపులు పెంచారు. 
  • బాలల కోసం కేటాయింపులు గత బడ్జెట్‌తో పోలిస్తే 0.13 శాతం తగ్గాయి. 

ఉపాధి హామీకి రూ. 61500 కోట్లు...
ఈ దఫా బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం రూ. 1.20 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో సింహభాగం మహాత్మాగాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)కు దక్కనుంది. గత బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి రూ. 1.22 కోట్లను కేటాయించారు. 2020-21కి ఉపాధి హామీకి రూ. 61,500 కోట్లను కేటాయించారు. ఇది గత బడ్జెట్‌ అంచనా(రూ.60వేల కోట్లు) కన్నా అధికం, కానీ గత బడ్జెట్‌ సవరించిన అంచనా(రూ. 71వేల కోట్లు) కన్నా తక్కువ. బడ్జెట్లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన- గ్రామీణ్‌(పీఎంఏవైజీ)కి రూ. 19500 కోట్లను కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజనపథకానికి సైతం ఇంతే మొత్తంలో నిధులు కేటాయించారు. ఆరోగ్యరంగానికి ఈ బడ్జెట్లో రూ. 69వేల కోట్లను కేటాయించారు. ఇందులో రూ.6400 కోట్లు ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్‌ భారత్‌)కు అందిస్తారు. ఎల్‌పీజీ సిలిండర్లను పేదలకు అందించే ఉజ్వలా పథకం బడ్జెట్లో రూ. 1118కోట్లు పొందింది. 
సంస్కృతి, పర్యావరణం...
పర్యాటకాన్ని వృద్ధి చేసేందుకు, ఐఐహెచ్‌సీ(ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్జర్వేషన్‌) ఏర్పాటు చేసి దానికి డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా కల్పిస్తామని నిర్మల తెలిపారు. దేశంలో ఐదు చోట్ల పురావస్తు సైట్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కోల్‌కతాలోని ఇండియన్‌ మ్యూజియంతో సహా నాలుగు ఇతర మ్యూజియంలను రిక్యూరేట్‌ చేస్తామని తెలిపారు. జార్ఖండ్‌లో ట్రైబల్‌ మ్యూజియం, లోథాల్‌లో మారిటైమ్‌ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి  వాతావరణ మార్పుపై పారిస్‌ సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలును చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా నిర్ధారిత నిబంధనలకన్నా అధిక ఉద్గారాలు వెదజల్లే పాత థర్మల్‌ ప్లాంట్లు మూసివేస్తామన్నారు. వాతవరణ కాలుష్య నివారణకు, పదిలక్షల జనాభా దాటిన నగరాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు రూ. 4400 కోట్లను కేటాయిస్తున్నట్లు సీతారామన్‌ చెప్పారు. 



You may be interested

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు

Sunday 2nd February 2020

దేశీయంగా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశీయంగానే వీటి తయారీకి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించే విధానంలో భాగంగా దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్‌ వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. మొబైల్‌ విడిభాగాలపైనా కస్టమ్స్‌ సుంకాన్ని సవరిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. పూర్తిగా నిర్మితమై (సీబీయూ) దేశంలోకి దిగుమతి అయ్యే వాణిజ్య విద్యుత్‌ వాహనాలపై 2020

ఎన్‌ఆర్‌ఐ నిబంధనల సవరణ

Sunday 2nd February 2020

న్యూఢిల్లీ: విదేశాలలో పన్నులు చెల్లించని ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) ఇకపై దేశీయంగా ఆదాయ పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇందుకు తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. దేశీయంగా పౌరసత్వం కలిగి ఉన్నప్పటికీ కొన్ని రోజులపాటు విదేశాలలో ఉండటం ద్వారా ఎన్‌ఆర్‌ఐ కేటగిరిలోకి వస్తున్న వ్యక్తులు ఏ దేశంలోనూ పన్నులు చెల్లించని పక్షంలో ఇకపై దేశీయంగా పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇందుకు తాజా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేపట్టారు. వెరసి భారతీయులై

Most from this category