News


వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ..

Wednesday 3rd July 2019
news_main1562136199.png-26759

  •  వైఫైతో కాల్స్‌ చేసుకునే సదుపాయం
  • ప్రస్తుతం ప్రయోగదశలో వీవోవైఫై 
  • ముందుగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రవేశపెట్టే యోచన

ముంబై:     ప్రైవేట్‌ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ (ఓటీటీ) సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. వైఫై ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ ఓవర్‌ వైఫై (వీవోవైఫై) సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీతో అత్యంత నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపిక చేసిన కొన్ని సర్కిల్స్‌లో ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్స్‌లోనూ ఈ సేవలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నా.. ముందుగా మాత్రం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, స్పెక్ట్రం అంతగా అందుబాటులో ఉండని మారుమూల ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తేవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ యోచిస్తోంది. 

ప్రత్యర్థి సంస్థలతోనూ పోటీ...
ప్రస్తుతం ప్రైవేట్‌ టెల్కోలైన భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ (ఆర్‌జియో) తదితర సంస్థలు కూడా వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తున్నాయి. ఇవి తుది దశలో ఉండగా త్వరలోనే సేవలు అందుబాటులోకి తేవాలని ఆయా సంస్థలు యోచిస్తున్నాయి. అయితే, వాటికన్నా ముందుగానే రంగంలోకి దిగాలని, మార్కెట్‌ను దక్కించుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ చకచకా పావులు కదుపుతోంది. 

వీవోవైఫై అంటే ...
మొబైల్‌ సిగ్నల్‌ లేకపోయినా యూజర్లకు కనెక్టివిటీ దెబ్బతినకుండా చూసేలా ఉపయోగపడే అత్యుత్తమ టెక్నాలజీగా వీవోవైఫైకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ (వైఫై) ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకోవడాన్ని సాధారణంగా వైఫై కాలింగ్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం వాట్సాప్, స్కైప్, హైక్, ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి ఓటీటీ సంస్థలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. అయితే, టెల్కోల్లాగా లైసెన్సు బాదరబందీ లేని ఈ సంస్థలు తమ వాయిస్‌ సేవల విభాగం ఆదాయానికి గండి కొడుతున్నాయంటూ టెలికం సంస్థలు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతున్నాయి. ఓటీటీ సంస్థలు కూడా తమలాగా కాలింగ్, మెసేజింగ్‌ సర్వీసులను అందిస్తున్నాయి కాబట్టి వాటిని సైతం లైసెన్సింగ్‌ పరిధిలోకి తీసుకురావాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. 

బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌లో మార్పులు...
రిలయన్స్‌ జియో కొత్తగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ విభాగంలో ముందుగా పట్టు సాధించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రణాళికల్లో భాగంగా తమ భారత్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ చార్జీలను సవరించింది. నెలకు 500 జీబీ డేటా ఆఫర్‌ చేసే రూ. 777 ప్లాన్‌ను సవరించి రూ. 849కి మార్చింది. దీని కింద 50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటా పరిమాణాన్ని 600 జీబీకి పెంచింది. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కూడా అందిస్తోంది. మరోవైపు, రోజుకు 50 జీబీ డేటా అందించే రూ. 3,999 ప్లాన్‌ని కూడా సవరించి రూ. 4,499కి మార్చింది. ఈ ప్లాన్ కింద ఇకపై 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో రోజూ 55 జీబీ డేటా లభిస్తుంది. 



You may be interested

డేటా సేకరణ ఆరోపణలు నిరాధారమైనవి: టిక్‌టాక్‌

Wednesday 3rd July 2019

న్యూఢిల్లీ: చట్టవిరుద్ధంగా యూజర్ల డేటాను సేకరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను షార్ట్-వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఖండించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొంది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌ సంస్థలో భాగమైన టిక్‌టాక్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. యూజర్ల డేటా భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించింది. యూజర్ల డేటాను టిక్‌టాక్‌ చట్టవిరుద్ధంగా సేకరించి .. చైనాకు పంపుతోందని, ఇది జాతీయ

బుల్లిష్‌గా మారిన 126 షేర్లు

Wednesday 3rd July 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

Most from this category