News


బ్యాంకిం‍గ్‌ బాహుబలి

Saturday 31st August 2019
news_main1567228115.png-28119

  • ఈసారి 10 బ్యాంకుల విలీనం
  • రూ. 55.81 లక్షల కోట్ల వ్యాపార పరిమాణం
  • ప్రభుత్వ రంగంలో 12కి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య
  • విలీనాలతో రుణ వితరణ పెంపు, వృద్ధికి ఊతం
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
  • బ్యాంకింగ్‌లో గవర్నెన్స్‌పరంగా మరిన్ని సంస్కరణలు
  • జవాబుదారీతనం పెంచే చర్యలు

న్యూఢిల్లీ: మందగమన భయాలతో డీలా పడుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు, మొండిబాకీలతో కుదేలవుతున్న బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణల వ్యూహాన్ని కొనసాగిస్తోంది. ఎస్‌బీఐ, బీవోబీల్లో ఇతర బ్యాంకుల విలీనాలకు కొనసాగింపుగా మరిన్ని భారీ బ్యాంకులు ఏర్పాటు చేస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా పది బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది. దీని ప్రకారం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) ఆరు విలీనం కానున్నాయి. దీంతో పీఎస్‌బీల సంఖ్య 12కి తగ్గనుంది. వీటి వ్యాపార పరిమాణం ఏకంగా రూ. 55.81 లక్షల కోట్లుగా ఉండనుంది. 2017లో పీఎస్‌బీల సంఖ్య 27గా ఉండేది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. అలాగే పీఎస్‌బీల్లో గవర్నెన్స్‌పరమైన పలు సంస్కరణలను కూడా ఆవిష్కరించారు. బోర్డులకు స్వయంప్రతిపత్తి ఇవ్వనున్నట్లు తెలిపారు. "మేనేజ్‌మెంట్‌ జవాబుదారీతనాన్ని పెంచే దిశగా..జనరల్‌ మేనేజర్‌ నుంచి మేనేజింగ్‌ డైరెక్టర్‌ దాకా అందరి పనితీరు గురించి జాతీయ బ్యాంకుల బోర్డు కమిటీ మదింపు చేస్తుంది" అని ఆమె తెలిపారు. 10 బ్యాంకుల ఖాతాలను పటిష్టంగా మార్చేందుకు రూ. 52,250 కోట్ల మేర నిధులు అందించనున్నట్లు వివరించారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఎకానమీ వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందంటూ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెల్లడి కావడానికి సరిగ్గా కొద్ది సేపు ముందే నిర్మలా సీతారామన్ బ్యాంకుల విలీన ప్రకటన చేయడం గమనార్హం. విలీన ప్రకటన అనంతరం వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం వరుసగా అయిదో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి మందగించి 5 శాతానికి పడిపోయింది. 2012-13 నాలుగో త్రైమాసికం తర్వాత ఇంత తక్కువ వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. 

నెక్ట్స్‌జెన్ ‍బ్యాంకులతో వృద్ధికి ఊతం ...
"దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్‌వర్క్‌, అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలుండే బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కార్యకలాపాల వృద్ధితో ఆయా బ్యాంకులకు మరిన్ని వనరులు అందుబాటులోకి వస్తాయి. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది. నెక్ట్స్‌జనరేషన్‌ బ్యాంకులను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం" అని నిర్మలా సీతారామన్ చెప్పారు. 
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద పన్ను సర్‌చార్జీల తొలగింపు, బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ పెంచడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. అలాగే, బొగ్గు మైనింగ్ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడి నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది. రాబోయే రోజుల్లో రియల్‌ ఎస్టేట్ రంగానికి కూడా ఉద్దీపన ప్యాకేజీలాంటిదేమైనా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇవన్నీ కూడా ఎకానమీని మందగమనం కోరల నుంచి బైటపడేయగలవని ప్రభుత్వం ఆశిస్తోంది. 

ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు..
- ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) లాభదాయకత మెరుగుపడుతోంది. పీఎస్‌బీల్లో అమలు చేస్తున్న సంస్కరణలు ఫలితాలివ్వడం మొదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 14 బ్యాంకులు లాభాలు నమోదు చేశాయి.
- 2018 డిసెంబర్‌ ఆఖరు నాటికి రూ. 8.65 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం స్థూల మొండిబాకీలు 2019 మార్చి ఆఖరు నాటికి రూ. 7.9 లక్షల కోట్లకు తగ్గాయి.
- పాక్షిక రుణ హామీ పథకం అమలుతో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణాల సంస్థల (హెచ్‌ఎఫ్‌సీ)కు నిధులపరమైన తోడ్పాటు మెరుగుపడింది. ఇప్పటికే రూ. 3,300 కోట్ల మేర నిధులు అందించగా, మరో రూ. 30,000 కోట్లు అందుబాటులోకి రానున్నాయి.
- నీరవ్‌ మోదీ తరహా మోసాలను నివారించేందుకు స్విఫ్ట్‌ మెసేజింగ్‌ వ్యవస్థను కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు (సీబీఎస్‌)కు అనుసంధానించడం జరిగింది. 
- విలీనానంతరం వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆయా బ్యాంకుల బోర్డులు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌లను కూడా నియమించుకోవాల్సి ఉంటుంది. 
- సమర్ధులైన వారిని ఆకర్షించేందుకు మార్కెట్‌కు అనుగుణమైన ప్యాకేజీని ఇవ్వొచ్చు. స్వతంత్ర డైరెక్టర్ల సిటింగ్‌ ఫీజును నిర్ణయించుకునేందుకు బ్యాంకు బోర్డులకు వెసులుబాటు ఉంటుంది. 

మూడో విడత  ... 
రాశి కన్నా వాసి ముఖ్యమనే లక్ష్యంతో.. అసంఖ్యాకంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను కుదించే క్రమంలో కేంద్రం కొన్నాళ్లుగా విలీనాల వ్యూహాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్వల్ప వ్యాపార పరిమాణం గల చిన్నా, చితకా బ్యాంకులు పదుల సంఖ్యలో ఉండటం కన్నా .. భారీ బ్యాంకులు కొన్ని ఉండటం ఎకానమీకి శ్రేయస్కరమని, రుణ వితరణా మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజా వ్యూహాలు అమలు చేస్తోంది. రెండేళ్ల క్రితం ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంకుతో పాటు అయిదు అనుబంధ బ్యాంకులను (స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌, స్టేట్ ‍బ్యాంక్ ఆఫ్ బికానెర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా) విలీనం చేసింది. ఆ తర్వాత గతేడాది బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో దేనా బ్యాంకు, విజయా బ్యాంకులను విలీనం చేసింది. తాజాగా రెండు బ్యాంకులను విలీనం చేసుకోవడం ద్వారా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇకపై దేశీయంగా రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలవనుంది. ప్రాంతీయంగా మంచి పట్టున్న ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, యూకో బ్యాంకు, పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం ప్రత్యేకంగానే కొనసాగుతాయి. 

1. కార్పొరేషన్‌ బ్యాంకు
సుమారు 113 ఏళ్ల క్రితం 1906లో కార్పొరేషన్‌ బ్యాంకు ఏర్పాటైంది. మంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం 2,600 పైచిలుకు సీబీఎస్‌ బ్రాంచీలు, 3,000 పైగా ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. రూ. 1,84,564 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,21,251 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 2,13,624 కోట్లు. 

2. యూనియన్‌ బ్యాంకు
సుమారు 99 ఏళ్ల క్రితం 1919లో ఏర్పాటైంది. ముంబై కేంద్రంగా పనిచేస్తోంది. 4,300 పైగా శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 4,17,505 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 2,98,780 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 4,98,580 కోట్లు. 

3. ఆంధ్రా బ్యాంకు
స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభిరామయ్య దీన్ని నెలకొల్పారు. 1923లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రా బ్యాంకుకు 2,885 దాకా శాఖలు, 3,798 ఏటీఎంల నెట్‌వర్క్‌ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 2,19,853 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,58,848 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 2,54,044 కోట్లు. 

4. కెనరా బ్యాంకు
కెనరా బ్యాంక్‌ హిందు పర్మనెంట్‌ ఫండ్‌గా 1906లో ఏర్పాటైన ఈ బ్యాంకు 1910లో కెనరా బ్యాంక్‌ లిమిటెడ్‌గా మారింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకుకు సుమారు 6,310 శాఖలు, 8,851 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. రూ. 5,99,123 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 4,28,114 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 7,11,783 కోట్లు. 

5. సిండికేట్‌ బ్యాంకు
కెనరా ఇండస్ట్రియల్‌ అండ్‌ బ్యాంకింగ్‌ సిండికేట్‌గా 1925లో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత సిండికేట్‌ బ్యాంక్‌గా మారింది. కర్నాటకలోని మణిపాల్‌ కేంద్రంగా పనిచేస్తోంది. సుమారు 4,063 శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,59,883 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 2,05,044 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 3,12,971 కోట్లు. 

6. అలహాబాద్‌ బ్యాంకు
సుమారు 154 ఏళ్ల క్రితం 1865లో ఈ బ్యాంకు ఏర్పాటైంది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తోంది. గతేడాది మార్చి నాటి గణాంకాల ప్రకారం సుమారు 3,503 శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,14,330 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,42,212 కోట్లు. మొత్తం అసెట్స్‌ 

రూ. 2,49,577 కోట్లు. 

7. ఇండియన్‌ బ్యాంకు
దాదాపు 112 ఏళ్ల క్రితం 1907లో ఏర్పాటైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది. 2,900 దాకా శాఖలు, 2,861 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,42,041 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,81,262 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 2,80,388 కోట్లు. 

8. పీఎన్‌బీ 
నూట పాతికేళ్ల క్రితం 1894లో పీఎన్‌బీ ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. గతేడాది అక్టోబర్‌ దాకా గల గణాంకాల ప్రకారం సుమారు 7,000 పైగా శాఖలు, 10,681 ఏటీఎంల నెట్‌వర్క్‌ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 6,81,874 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 4,62,416 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 7,89,266 కోట్లు. (కన్సాలిడేటెడ్‌ గణాంకాలు)

 



You may be interested

జీడీపీ.. ఢమాల్‌!

Saturday 31st August 2019

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో  కేవలం 5 శాతం వృద్ధి తయారీ రంగం నెమ్మది కేవలం 0.6 శాతం వృద్ధి సాయం చేయని వ్యవసాయం వృద్ధి కేవలం 2 శాతం  క్యూ1లో చైనా వృద్ధి 6.2 శాతం దీనితో ఈ త్రైమాసికంలో ‘వేగంగా వృద్ధి’  హోదా కోల్పోయిన భారత్‌ న్యూఢిల్లీ: భారత ఆర్థికరంగం తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. 2012-13 ఏప్రిల్‌-జూన్‌

ఎఫ్‌అండ్‌వోలో ఎక్కువ రోలోవర్‌ వీటిల్లోనే...

Friday 30th August 2019

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో డేటాను పరిశీలించడం ద్వారా ట్రేడర్ల యాక్టివిటీని అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోలోవర్ల పరిమాణం ఆయా స్టాక్స్‌ కదలికలపై రానున్న రోజుల్లో చూపించగలదు. దీనిపై సెంట్రమ్‌ బ్రోకింగ్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ జయ్‌ పురోహిత్‌ విశ్లేషణ ఇలా ఉంది.    ముఖ్యంగా షార్ట్‌ పొజిషన్లను కొన్నింటిని రోలోవర్‌ చేసుకున్నారు. సూచీలు జూలై నెలలో అమ్మకాలు చవిచూడగా, ఆగస్ట్‌ సిరీస్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.

Most from this category