News


ఏజీఆర్‌పై సుప్రీంలో టెల్కోల రివ్యూ పిటిషన్‌

Saturday 23rd November 2019
news_main1574478924.png-29796

న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్‌)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్‌టెల్‌ శుక్రవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏజీఆర్‌ మొత్తంపై వడ్డీ, జరిమానాను రద్దు చేయాలని ఈ పిటిషన్‌లో కోరింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్‌ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్‌  రూ. 21,682 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడింది. స్పెక్ట్రం యూసేజీ చార్జీగా చెల్లించాల్సింది రూ.13,904 కోట్లు. కాగా వొడాఫోన్‌ ఐడియా కూడా సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది.  వివరాల్లోకి వెళితే... కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్‌ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్‌ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టెల్కోలు .. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గత నెల 24వ తేదీన  ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిప్రకారం రూ.92,642 కోట్లు టెల్కోలు లైసెన్స్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీగా చెల్లించాలి. ‍ 



You may be interested

కార్వీపై సెబీ ఆంక్షలు..

Saturday 23rd November 2019

కొత్త క్లయింట్లు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు న్యూఢిల్లీ: క్లయింట్లకు సంబంధించిన రూ. 2,000 కోట్ల విలువ చేసే సెక్యూరిటీస్‌ను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్‌)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాల కోసం కొత్తగా క్లయింట్లను తీసుకోకుండా నిషేధించింది. అలాగే, క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీల ఆధారంగా కేఎస్‌బీఎల్‌ ఎలాంటి సూచనలు ఇచ్చినా.. పరిగణనలోకి తీసుకోరాదంటూ ఎన్‌ఎస్‌డీఎల్‌, సీడీఎస్‌ఎల్‌ను ఆదేశించింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోకి నెస్లే, టైటాన్‌, అల్ట్రాటెక్‌

Saturday 23rd November 2019

యూపీఎల్‌, డాబర్‌ ఇండియాకు కూడా చోటు టాటా మోటార్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, వేదాంత, యస్‌ బ్యాంకు తొలగింపు డిసెంబర్‌ 23 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి కొత్తగా నెస్లే, టైటాన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ అడుగు పెట్టనున్నాయి. ప్రస్తుతం సూచీలో ఉన్న వేదాంత, యస్‌ బ్యాంకు, టాటా మోటార్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ బయటకు వెళ్లిపోనున్నాయి. డిసెంబర్‌ 23 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రకటించింది.

Most from this category