News


పడిపోతున్న ఆదాయంతో ప్రమాదం!

Saturday 28th December 2019
news_main1577506180.png-30491

ద్రవ్య గణాంకాలు గతి తప్పుతాయి
ఆర్‌బీఐ హెచ్చరిక

ముంబై: పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను, పన్నేతర ఆదాయం లక్ష్యాలకు దూరంగా ఉండడంతోపాటు, ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం బలహీనపడడం సవాలుగా పేర్కొంది. శుక్రవారం ముంబైలో విడుదల చేసిన 25వ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఈ అంశాలను ప్రస్తావించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలు తమ బ్యాలన్స్‌ షీట్ల ప్రక్షాళనకు తీసుకున్న చర్యల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతున్నట్టు తెలిపింది. నవంబర్‌ నాటికే ద్రవ్యలోటు నిర్ణీత లక్ష్యంలో 107 శాతానికి చేరిపోవడంతో.. జీడీపీలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతుండడం ఆర్‌బీఐ వ్యాఖ్యల్లోనూ కనిపించింది. అలాగే, జీఎస్‌టీ వసూళ్లు కూడా ఆశించిన మేర లేవు. మరోవైపు కార్పొరేట్‌ పన్ను కోత కారణంగా ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోనుంది. ‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఆర్‌బీఐ స్థిరత్వ నివేదిక పేర్కొంది.  
స్థూల ఎన్‌పీఏలు పెరగొచ్చు
స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కారణంగా బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2020 సెప్టెంబర్‌ నాటికి 9.9 శాతానికి పెరగొచ్చని ఈ నివేదిక పేర్కొంది. 2019 సెప్టెంబర్‌ నాటికి ఇవి 9.3 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 9.3 శాతం స్థాయిలోనే స్థిరంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 12.7 శాతం నుంచి 13.2 శాతానికి, ప్రైవేటు బ్యాంకుల్లో ఇది 3.9 శాతం నుంచి 4.2 శాతానికి.. అదే విధంగా దేశంలో పనిచేసే విదేశీ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2.9 శాతం నుంచి 3.1 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. 
ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆస్తుల నాణ్యత ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో స్థూల ఎన్‌పీఏలు 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెరిగాయని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నికర ఎన్‌పీఏలు మాత్రం స్థిరంగా 3.4 శాతం వద్దే ఉన్నాయని తెలిపింది. క్యాపిటల్‌ టు రిస్క్‌ అసెట్స్‌ రేషియో (సీఆర్‌ఏఆర్‌) నిర్దేశిత 20 శాతానికంటే తక్కువగా 19.5 శాతం వద్ద ఉంది.

రూ.5 కోట్లు దాటితే చెప్పాలి..
రూ.5 కోట్లు, అంతకుమించి రుణాల సమాచారాన్ని.. భారీ రుణాల కేంద్ర సమాచార కేంద్రానికి (సీఆర్‌ఐఎల్‌సీ) తెలియజేయాలని పెద్దసైజు కోపరేటివ్‌ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులున్న అన్ని అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులను సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

పాలనను మెరుగుపరిచి వృద్ధికి తోడ్పడాలి: దాస్‌
కంపెనీలు, బ్యాంకులు పాలనా ప్రమాణాలను మెరుగుపరుచుకుని, దేశ ఆర్థిక వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు తోడ్పడాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కోరారు. దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట ‍స్థాయి 4.5 శాతానికి సెప్టెంబర్‌ త్రైమాసికంలో పడిపోయిన విషయం విదితమే. అలాగే, చాలా కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దాస్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. వినియోగం, పెట్టుబడులను పునరుద్ధరించడం అన్నవి ప్రధాన సవాళ్లుగా దాస్‌ పేర్కొన్నారు. బోర్డుల్లో మంచి కార్పొరేట్‌ పరిపాలన అన్నది మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు ముఖ్యమైన అంశమనేది తన అభిప్రాయంగా చెప్పారు. ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక శుక్రవారం విడుదల కాగా, ఈ సందర్భంగా శక్తికాంతదాస్‌ మాట్లాడారు. దేశీయ, అంతర్జాతీయ అంశాల కారణంగా వృద్ధి బలహీనపడిందన్న ఆయన, వినియోగ రుణాలు పెరుగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో హోల్‌సేల్‌రుణాలు తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు. కంపెనీలు తమ రుణ భారం తగ్గించుకోవడమే కారణంగా పేర్కొన్నారు.  



You may be interested

పీఎంసీ బ్యాంక్‌ స్కాంపై 32 వేల పేజీల చార్జిషీట్‌

Saturday 28th December 2019

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ స్కాంకు సంబంధించి ఐదుగురు నిందితులపై 32 వేల పేజీల చార్జిషీట్‌ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జిషీట్‌లో ఆ బ్యాంకు మాజీ ఎండీ జాయ్‌ థామస్‌, మాజీ చైర్మన్‌ వర్యమ్‌ సింగ్‌, మాజీ డైరక్టర్‌ సుర్జిత్‌ సింగ్‌ ఆరోరాతో పాటు, హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌)

మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయం

Saturday 28th December 2019

ఐవోబీ, యూకో, అలహాబాద్‌ బ్యాంకులకు రూ.8,655 కోట్లు న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు గాను యూకో, ఇండియన్‌ ఓవర్సీస్‌, అలహాబాద్‌ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.8,655 కోట్ల నిధుల సాయాన్ని అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపు రూపంలో బ్యాంకులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పెట్టుబడుల విషయమై బ్యాంకులకు సమాచారం అందించింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత

Most from this category