News


ఎగుమతులు.. రివర్స్‌గేర్‌!

Saturday 14th September 2019
news_main1568435303.png-28364

  • ఆగస్టులో 6 శాతం క్షీణత
  • దిగుమతులూ 13.45 శాతం పతనం
  • వాణిజ్యలోటు 13.45 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఆగస్టు ఎగుమతి-దిగుమతులు అద్దం పడుతున్నాయి. ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దిగుమతులదీ అదే ధోరణి. 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది జూలైలో ఎగుమతులు స్వల్పంగా 2.25 శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలను చూస్తే...

- ఆగస్టులో ఎగుమతుల విలువ 26.13 బిలియన్‌ డాలర్లు. 2018 ఆగస్టులో పోల్చితే విలువ పెరక్కపోగా 6 శాతం క్షీణించింది. పెట్రోలియం, ఇంజనీరింగ్‌, తోలు, రత్నాలు, ఆభరణాల విభాగంలో అసలు వృద్ధిలేదు. ఎగుమతులకు సంబంధించి మొత్తం 30 కీలక రంగాలను చూస్తే, 22 ప్రతికూలతనే నమోదుచేసుకున్నాయి. రత్నాలు ఆభరణాల విభాగంలో -3.5 శాతం క్షీణత, ఇంజనీరింగ్‌ గూడ్స్‌ విషయంలో 9.35 శాతం క్షీణత, పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో 10.73 శాతం క్షీణత నమోదయ్యింది. కాగా సానుకూలత నమోదు చేసిన రంగాల్లో ముడి ఇనుము, ఎలక్రా‍్టనిక్‌ గూడ్స్‌, సుగంధ ద్రవ్యాలు, మెరైన్‌ ప్రొడక్టులు ఉన్నాయి. 
- దిగుమతుల విలువలో కూడా (2018 ఆగస్టులో పోల్చితే) అసలు పెరుగుదల లేకపోగా 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ 39.58 బిలియన్లుగా నమోదయ్యింది. దిగుమతుల్లో ఇంత స్థాయి క్షీణత 2016 ఆగస్టు తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో ఈ క్షీణ రేటు మైసస్‌ 14 శాతంగా ఉంది. 
- దీనితో ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.45 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఆగస్టులో వాణిజ్యలోటు 17.92 బిలియన్‌ డాలర్లు. 
- ఆగస్టులో చమురు దిగుమతులు 8.9 శాతం పడిపోయి 10.88 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు కూడా 15 శాతం క్షీణించి, 28.71 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
- ఇక​ ప్రత్యేకించి పసిడి దిగుమతులు చూస్తే, భారీగా 62.49 శాతం పడిపోయి 1.36 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 

ఏడాదంతా నిరుత్సాహమే...
భారత్‌ ఎగుమతుల విభాగం ఈ ఏడాది ఇప్పటి వరకూ నిరుత్సాహంగానే నిలిచింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తయారీ రంగం మందగమనంతో జూలైలో తయారీ రంగం వృద్ధి కూడా 4.3 శాతానికి పరిమితం అయ్యింది. కాగా ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ చూసుకుంటే, భారత్‌ ఎగుమతులు 1.53 శాతం క్షీణించి, 133.54 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు కూడా 5.68 శాతం పడిపోయి 206.39 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 72.85 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

ప్రోత్సాహకాలకు తగిన సమయం...
పరిస్థితి చూస్తుంటే, ఎగుమతుల రంగానికి తగిన ప్రోత్సాహకాలు కల్పించాల్సిన తరుణం ఇదని భావించాల్సి వస్తోంది.ఎంఈఐఎస్‌ (మర్చండైజ్‌ ఎక్ట్‌పోర్ట్‌ ఫ్రం ఇండియా స్కీమ్‌) ఉపసంహరించకూడదు. ఈపీసీజీ (క్యాపిటల్‌ గూడ్స్‌ ఎగుమతుల వృద్ధి) విధానాన్ని సరళీకరించడం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది తయారీ  రంగం వృద్ధికి ఈపీసీజీ కింద యంత్రాల దిగుమతులకు ఈ చర్యలు అవసరం. 
- ఎస్‌సీ రెల్హాన్‌, లుధియానా ఎగుమతిదారు

ఇది తాత్కాలికమే...
ఎగుమతుల విభాగంలో నిరుత్సాహకర ధోరణి తాత్కాలికమే. వచ్చే నెలల్లో తిరిగి ఎగుమతులు పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఎగుమతుల ప్రోత్సాహక ప్యాకేజీ కోసం మేము ఎదురుచూస్తున్నాం. 
- అక్వీల్‌ అహ్మద్‌, తోలు ఎగుమతుల మండలి చైర్మన్‌

అనిశ్చితికి నిదర్శనం..
ఎగుమతుల్లో క్షీణ ధోరణి అనిశ్చితికి, అంతర్జాతీయ డిమాండ్‌ తగ్గిందనడానికి, సుంకాల యుద్ధం తీవ్రతకు నిదర్శనం. దేశీయ క్లిష్ట అంశాలూ సమస్యకు తోడవుతున్నాయి. రుణం లభ్యతలో ఇబ్బందులు, అధిక వడ్డీరేట్లు, జీఎస్‌టీ రిఫండ్‌లో ఆలస్యం వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. 
- శరద్‌ కుమార్‌ షరాఫ్‌, భారత ఎగుమతుల సంఘాల సమాఖ్య చీఫ్‌



You may be interested

20న జీఎస్‌టీ మండలి సమావేశం

Saturday 14th September 2019

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం వచ్చే శుక్రవారం (20వ తేదీన) గోవాలో జరగనుంది. కార్ల నుంచి బిస్కెట్ల వరకూ ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని వస్తున్న డిమాండ్లపై ఈ అత్యున్నత స్థాయి జీఎస్‌టీ సమావేశం దృష్టి సారించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆదాయాలపై ప్రత్యక్షంగా ఎటువంటి ప్రభావం పడుతుందన్న విషయాన్ని మండలి సమీక్షిస్తుందని తెలుస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే

ఫార్మాను ఊరిస్తున్న మధ్యప్రాచ్య దేశాలు

Saturday 14th September 2019

టాప్‌-30 మార్కెట్లలో 3 దేశాలకు చోటు జూన్‌ ఎగుమతుల్లో 11 శాతం వృద్ధి ఈ ఏడాది రూ.1,54,000 కోట్ల ఎక్స్‌పోర్ట్స్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- భారత ఫార్మా రంగ సంస్థలకు మధ్యప్రాచ్య దేశాలు ఊరిస్తున్నాయి. 2018-19 టాప్‌-30 ఎక్స్‌పోర్ట్స్ మార్కెట్లలో మూడు మధ్యప్రాచ్య దేశాలు చోటు సంపాదించాయి. వీటిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 13వ స్థానం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ దేశానికి రూ.1,820 కోట్ల విలువైన ఎగుమతులు భారత్‌ నుంచి

Most from this category