News


వామ్మో.. ఏటీఎం!?

Friday 27th December 2019
Markets_main1577416979.png-30462

  • భద్రతపై ఆర్‌బీఐ ఆదేశాలు బేఖాతరు...
  • లైట్‌ తీసుకుంటున్న బ్యాంకులు
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్‌కు దగ్గరపడుతున్న డెడ్‌లైన్‌
  • పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి


న్యూఢిల్లీ: ఏటీఎంలలో భద్రత లోపాలు అనేకసార్లు బైటపడుతున్నప్పటికీ బ్యాంకులు తగు చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలను కూడా అంతగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏటీఎంలలో విండోస్‌ 7 సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం మొదలుకుని యాంటీ స్కిమ్మింగ్‌ కార్డ్‌ రీడర్లు ఇన్‌స్టాల్‌ చేయడం, నగదు సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల దాకా వివిధ అంశాలపై ఏప్రిల్‌ 2018 నుంచి ఆగస్టు 2019 మధ్యలో ఆర్‌బీఐ, హోంశాఖ పలు సర్క్యులర్‌లు జారీ చేశాయి. నగదు భర్తీ చేసే సంస్థలు పాటించాల్సిన నిబంధనలు కూడా వీటిల్లో ఉన్నాయి. విండోస్‌ 7 సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు ఆర్‌బీఐ విధించిన జనవరి 2020 డెడ్‌లైన్ దగ్గరపడుతోంది. అయినప్పటికీ.. మిగతా నిబంధనల్లాగే దీన్ని కూడా పూర్తి స్థాయిలో అందుకునే పరిస్థితి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

తీవ్రంగా పరిగణిస్తున్న ఆర్‌బీఐ...
భారత్‌లో బ్యాంకింగ్‌ తీరుతెన్నులు, పురోగతిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. ఏటీఎం, డెబిట్‌ కార్డు లావాదేవీలపై బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌కి 2017–18లో 24,672 ఫిర్యాదులు రాగా, 2018–19లో 36,539కి పెరిగాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యల గురించి అనేకసార్లు హెచ్చరించినప్పటికీ బ్యాంకులు పట్టించుకోకపోతుండాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ తీవ్రంగా పరిగణిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏటీఎంలలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి 2017 మార్చి, నవంబర్‌లలో చేసిన సిఫార్సులను అమలు చేయాలంటూ 2018 జూన్‌ 21న ఆర్‌బీఐ ఒక సర్క్యులర్‌ పంపించింది. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం..  ఏటీఎంలను కచ్చితంగా గోడలు లేదా పిల్లర్లలోకి అమర్చడం, నగదు భర్తీ కోసం వన్‌ టైమ్‌ కాంబినేషన్‌ (ఓటీసీ) తాళాలను ఉపయోగించడం తదితర నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్‌బీఐ ఆదేశాల అమలు పురోగతి నత్తనడకన సాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి మొత్తం 2,06,589 ఏటీఎంలు నిర్వహణలో ఉన్నాయి. అయితే, ఇప్పటికీ సగం ఏటీఎంలలో ఓటీసీ వినియోగంలోకి రాలేదు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోకపోవడం, తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల.. బ్యాంకు ఖాతాదారులు నష్టపోవడంతో పాటు బ్యాంకు ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

వ్యయాల భయంతో వెనుకంజ...
ఏటీఎంలలో నగదు భర్తీకి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానానికి బదులుగా మరింత సురక్షితమైన లాకబుల్‌ క్యాసెట్స్‌ (పెట్టె) విధానాన్ని అమల్లోకి తేవాలని సూచిస్తూ 2018 ఏప్రిల్‌ 12న.. ఆర్‌బీఐ మరో సర్క్యులర్‌ కూడా ఇచ్చింది. 2020-21 నాటికి మొత్తం ఏటీఎంలలో కనీసం 60 శాతం ఏటీఎంలలో దీన్ని అమల్లోకి తేవాలని నిర్దేశించింది. అయితే, దీనిపై బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఖర్చులు తడిసి మోపెడవుతాయని, పరిశ్రమపై సుమారు రూ. 6,000 కోట్ల మేర భారం పడుతుందని అంటున్నాయి. భారీ ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నందున ఈ ఆదేశాల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖను కోరాయి. మరోవైపు, నగదు రవాణా చేసే సంస్థలకు (సీఎల్‌సీ) సంబంధించి కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ 2018 ఏప్రిల్‌ 6న మరో కీలక సర్క్యులర్‌ జారీ చేసింది. సీఎల్‌సీల వద్ద పటిష్టమైన, తేలికపాటి వాణిజ్య వాహనాలు కనీసం 300 అయినా ఉండాలని నిర్దేశించింది. దీన్నే పునరుద్ఘాటిస్తూ 2018 ఆగస్టు 8న కేంద్ర హోంశాఖ కూడా ఒక నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందుకు నిర్దేశించిన గడువు దాటిపోయి ఏడాది గడిచిపోయినా.. ఇంతవరకూ పూర్తిగా అమలు కావడం లేదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.  
 You may be interested

'మిల్లీమీటర్‌' స్పెక్ట్రం విక్రయంపై కసరత్తు

Friday 27th December 2019

వచ్చే ఏడాదే వేలానికి అవకాశం ధరపై ట్రాయ్‌తో చర్చించనున్న టెలికం శాఖ మార్చి-ఏప్రిల్‌లో విక్రయించే స్పెక్ట్రంనకు ఇది అదనం న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల కోసం మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కీలకమైన 24.75-27.25 గిగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రంను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని వీలైతే వచ్చే ఏడాదే వేలం వేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ధర, వేలం విషయంలో పాటించాల్సిన ఇతరత్రా

లాభాల ఓపెనింగ్‌కు ఛాన్స్‌?!

Friday 27th December 2019

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయిం‍ట్లు ప్లస్‌  గురువారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో(గ్యాపప్‌) ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 12,234 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. క్రిస్మస్‌ సెలవుల తదుపరి గురువారం​ప్రారంభమైన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. కాగా.. క్రితం

Most from this category